శుక్రవారం, ఫిబ్రవరి 05, 2010

Happy to Help - ఛా! నిజమా!!

ఈ వీడియో చూశారా అందులో మొదటి ప్రకటన చూసి "how cute!!" అని అనుకోని వారు ఉండరేమో కదా. చక్కని క్రియేటివిటీతో ఎంతో శ్రద్దగా తయారు చేసిన ప్రకటన. నాకు నచ్చిన వాణిజ్య ప్రకటనల్లో ఇది ఒకటి. హచ్ కుక్క పిల్ల ’పగ్’ సృష్టించిన ప్రభంజనం ఇంతా అంతా కాదు కదా... దానినే ఉపయోగించి వోడాఫోన్ కు ఈ ప్రకటన రూపొందించిన వారెవరో కానీ వారిని మెచ్చుకోకుండా ఉండలేను. దీని తర్వాత ఇప్పుడు తనకు తానుగా ఏ ఫేమస్ హీరోకూ తీసిపోనంత పేరు సంపాదించుకున్న zozo పాత్రలతో రూపొందించిన వోడాఫోన్ ప్రతి ప్రకటనా ఆ యాడ్ మేకర్  క్రియేటివిటీ కి అద్దం పడుతుంది. నేను గత మేలో ఇండియా వచ్చినపుడు ఏ ఫోన్ నంబర్ తీసుకోవాలా అని ఆలోచించి ఈ ప్రకటనలు గుర్తొచ్చి "ప్రకటనల మీదే అంత శ్రద్ద పెట్టిన వారు సర్వీస్ మీద కనీసం యాభై శాతమన్నా శ్రద్ద పెట్టి ఉండరా" అని అనుకుని వొడాఫోన్ తీసుకున్నాను. నాకు అనుకూలంగా ఉన్న STD, SMS తారీఫ్ ప్లాన్ లు కూడా ఒక కారణం అనుకోండి. ఆ క్షణం లో ఓ పక్కనుండి zozo బొమ్మ "వెర్రి వెధవ మమ్మల్ని చూసి బుట్టలో పడ్డాడు ఇక వీడి పనైపోయిందే" అనుకుంటూ చేసిన వికటాట్టహాసం నా చెవుల బడకుండా ఏ శక్తి అడ్డుకుందో ఏమో కానీ వేడి వేడి ముద్దపప్పులో కాలేశాను అన్న విషయం తర్వాత తెలిసింది.


అదేమిటో పొలిమేరల్లోనూ, ఊరి బయట హైవేస్ మీదా ఉన్నంత సిగ్నల్ స్ట్రెంత్ సిటీల్లోనూ ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ ఉండి చావదు. సరే కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా మరి చీప్ గా ఇస్తున్నపుడు ఇలాటివి భరించాలి లే అని వదిలేశాను. సిగ్నల్ సంగతి పక్కన పెడితే నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ఏ కాల్ చేసినా కూడా 30 నిముషాలు దాటనివ్వడు. సరిగ్గా ఇరవైతొమ్మిది నిముషాల యాభైఏడు సెకన్లకు కట్ చేసి పడేస్తాడు. మంచి ఫ్లోలో సాగుతున్న సంభాషణ మధ్య ఈ అంతరాయం చాలా చిరాకు కలిగిస్తుంది, ఈ సరికే దీనికి కూడా అలవాటు పడిపోయాను అనుకోండి. ఒకోసారి లైన్ కలవదు నంబరు బిజీ అనో నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అనో వస్తుంది అవతల వ్యక్తి ఫోన్ పట్టుకుని మనకోసమే ఎదురుచూస్తున్నారు అని మనకి తెలుసు అయినా వీడి నాటకాలు ఇవి. ఒకోసారి ఉన్నట్లుండి 4-5 నిముషాలు కూడా గడవక ముందే చెవులు చిల్లులు పడేలా పెద్ద శబ్దం వచ్చి కాల్ కట్ అయిపోతుంది. నాకైతే ఆ సమయంలో zozo బొమ్మ ఒక ఎర్రడబ్బా పై కూచుని నా వైపే చూస్తూ "అచ్చికిచ్చి.. అచ్చికిచ్చి.. అయ్యిందా అబ్బాయిగారి పని యిహ్హిహిహిహి..." అని గేలిచేస్తూ నవ్వుతున్నట్లు కనిపిస్తుంది (అచ్చంగా ఈ కింది వీడియోలో చూపించినట్లు). ఇంక కాల్స్ రద్దీ ఎక్కువ ఉండే సమయంలో మాట్లాడాలంటే గగనమే, లైన్స్ దొరకక పోవడం ఒక ఎత్తైతే కలిసినా చిత్రమైన శబ్దాలు కొండకచో అవతలి మనిషి గొంతు రోబోట్ గొంతులా వినపడటం జరుగుతుంటుంది.

సరే ఇన్ని జరిగుతున్నా మనకి కాస్త సహనం పాళ్ళు ఎక్కువే కనుక భరిస్తూ వచ్చాను. ఓ వారం క్రితం ఉన్నట్లుండి నో యాక్సెస్ అని ఫోన్ లో నెట్వర్క్ రిజిస్టర్ అవడం మానేసింది. ఫోన్ లో ఏ విధమైన సమస్య లేదని నిర్ధారించుకుని కాసేపు మాన్యువల్ ఆటోమాటిక్ మధ్య మారుస్తూ ఎలాగో మళ్ళీ సాధించాను. ఒక రెండ్రోజుల క్రితం మళ్ళీ పోయింది ఈ సారి ఎంత ప్రయత్నించినా రాలేదు. సరే ఒక సారి ప్రకటన గుర్తుతెచ్చుకుని హ్యాపీ అట కదా చూద్దాం అని కాల్ చేస్తే  సంతోషం సంగతి దేవుడెరుగు కనీసం తీరిగ్గా సమస్య ఏంటో విని సలహా ఇద్దాం అనే ఆసక్తి ఏమాత్రం కనిపించలేదు. ఎప్పుడు ఫోన్ పెట్టేద్దామా అని ఎదురు చూస్తున్నట్లు అనిపించింది. సరే ఆవిడ సలహాలు నోట్ చేసుకుని అవన్నీ పాటించి అయినా ఉపయోగం లేదని ఇంకోసారి కాల్ చేస్తే ఈవిడ ఒక పదినిముషాలు సతాయించి "ఈ జిడ్డుగాడు వదిలే లా లేడు" అనుకుని కంప్లైంట్ రిజస్టర్ చేసి కంప్లైంట్ నంబర్ SMS వస్తుంది అని చెప్పింది. నాకు తిక్క నషాలానికంటింది, "నెట్వర్క్ లేదు మొర్రో అంటే sms" ఎలా వస్తుంది అని అడిగా.. "నెట్వర్క్ వచ్చిన తర్వాత వస్తుంది" అంది, నేను "నెట్వర్క్ వచ్చిన తర్వాత కంప్లైంట్ నంబర్ నాకెందుకు నాలుక గీసుకోడానికి కూడా పనికి రాదు" అంటే సరే మీకు ఇప్పుడే ఇస్తాను ఉండండి అని కాసేపు హోల్డ్ లో పెట్టి ఫైనల్ గా ఇచ్చింది. ఆ తర్వాత ఆ నంబర్ పట్టుకుని మళ్ళీ కాల్ చేసి ఎస్కలేట్ చేయిస్తే ఒక గంటకు నెట్వర్క్ వచ్చింది, వీళ్ళు సాయం చేసే విథానం ఇది.


అక్కడితో కథ సుఖాంతమైతే ఈ టపా ఉండేది కాదు. నిన్నటి నుండి నేను ఏ నంబర్ కు కాల్ చేసినా చేసిన ప్రతిసారి "మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, అప్లికేషన్ ఏదైనా వొడాఫోన్ స్టోర్ లో ఇవ్వడానికి ఆఖరి రోజు" అంటూ మెసేజ్ వస్తుంది, నిన్న ఇదే విషయమై ఒక sms కూడా వచ్చింది. సరే సంగంతేంటి గురూ అని రాత్రి మళ్ళీ కాల్ చేశాను, ఇతను మరో ఖంగారు కనకయ్య బట్టీ పట్టిన నాలుగుముక్కలు  లొడ లొడ మంటూ కక్కేయడమే కానీ అసలు నే చెప్పేది వినే తీరికే లేదు. పోని ఆ దిక్కుమాలిన స్టోర్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు అని అడిగితే, నేను కమ్మన హళ్ళి లో ఉందేమో చూడరా నాయనా అంటే తను ఒన్లీ ఇన్ సిటీస్ సార్ హళ్ళి పల్లి ల్లో ఉండదు సారు బీటీయమ్ కోరమంగళ అంటూ నాకు పాతిక కి.మి. దూరంలో ఉన్న ప్రదేశాలు చెప్పాడు. సరే ఎలాగైతేనేం రాత్రి వాళ్ళ వెబ్సైట్ స్టోర్ లొకేటర్ లో ఓ స్టోర్ అడ్రస్ పట్టుకుని నా అలవాటుకు విరుద్దంగా కాస్త ఉదయాన్నే నిద్ర లేచి పదిగంటలకు స్టోర్ కి వెళితే అది మూసేసి ఉంది. పదకొండు గంటలకు తెరుస్తారుట పోనీ డాక్యుమెంట్స్ ఏ కదా ఎక్కడైనా డ్రాప్ చేయచ్చా అంటే ఆ వీలు లేదు. కనీసం స్టోర్ ఫోన్ నంబరు వెబ్సైట్ లో లేదు అక్కడ టైమింగ్స్ కూడా లిస్ట్ చేసి చావలేదు. మళ్ళీ ఈసురోమంటూ కాళ్ళీడ్చుకుంటూ సాయంత్రం వెళ్ళాలి. ఈ సారి ఏ టీబ్రేకో అని మళ్ళీ మూసేస్తారేమో అలా చేస్తే తలుపులు పగలగొట్టి లోపలేసి వచ్చేస్తా అంత చిరాకు గా ఉంది వీళ్ల సర్వీసు మీద.

అవండీ నా సినిమా కష్టాలు ప్రీపెయిడ్ ఫోన్ గత జూన్ లో నేను తీసుకునేప్పుడే అన్ని ప్రూఫ్ లు ఇచ్చి కొన్న కొట్లో "అన్నీ జాగ్రత్త గా పంపించరా" అని పది సార్లు చెప్పినా ఉపయోగం లేక అవన్నీ పోగొట్టుకుని ఇలా మళ్ళీ కస్టమర్స్ ని టార్చర్ చేస్తున్న వీళ్ళనేం అనాలి. కాకపోతే ఆన్లైన్ రిచార్జ్ ఫెసిలిటీ, చవకగా దొరికే std & sms ప్లాన్లకు తోడు మళ్ళీ ఇపుడు అందరికీ కొత్త నంబరు ఎక్కడ చెప్తాం అనే బండెడు బద్దకం పుణ్యమా అని ఈ టార్చర్ అంతా అవలీలగా భరించేస్తున్నాను.

15 కామెంట్‌లు:

  1. :-) :-)
    వేణూ గారు..మరోలా అనుకోవద్దు నవ్వుతున్నందుకు...
    అసలు వొడాఫోన్ కు ముందు హచ్ నెట్ వర్క్ కూడా అంతేనండీ...దరిద్రమైన నెట్ వర్క్....యాడ్స్ చూసి అస్సలు నమ్మకూడదని నేనూ ఒక అనుభవం ద్వారా తెలుసుకున్నాను. mortein స్ప్రే ఒకటి బొద్దింకల కోసం అని కొని వాటి మీద చల్లితే అవి షవర్ బాత్ చేసుకుంటున్నట్టు ఫీలయిపోయేవి కానీ చచ్చేవి కావు..:)

    రిప్లయితొలగించండి
  2. శేఖర్ గారు నెనర్లు :-))) హ హ అనుకోవడానికి ఏమీ లేదండీ ఎవరి అభిప్రాయం తీసుకోకుండా యాడ్స్ చూసి ఇది కొన్నందుకు అద్దంలో నన్ను చూసుకుని నేనే నవ్వుకుంటాను ఇలాంటపుడు :)

    హ హ హ బొద్దింకల షవర్ బాత్ సూపరు :-D

    రిప్లయితొలగించండి
  3. నంబరు పోర్టబిలిటీ వచ్చేదాకా ఈ తిప్పలు తప్పవులేండి.(డిసెంబర్ ఆఖరికే వస్తుందని అంతా ఊదరగొట్టారుగానీ ఇప్పుడా ఊసే ఎవరూ ఎత్తట్లేదు. ఆ సౌకర్యం శాశ్వతంగా అటకెక్కిందా అని అనుమానాలొస్తున్నాయి నాకైతే.) నాకు జ్ఞానోదయం చేశారు. నేనింకా ఎయిర్ టెల్ నుంచి వోడాఫోన్ కు మారదామనుకుంటున్నా ఒకానొక కారణంవల్ల. కొద్దిలో తప్పించారు, ధన్యవాదాలు :)

    రిప్లయితొలగించండి
  4. మాష్టారూ మీకో విషయం తెలుసా. ఆ మధ్య గోకుల్ చాట్, లుంబిని పార్కుల్లో బాంబులు పేలాయి గుర్తుందా. నిజం చెప్పాలంటే ఇంకొన్ని బాంబులు అల్లాగే పేలకుండా వుండిపోయాయి. ఎందుకో తెలుసా? ఆ సమయానికి ఆ mobile network సరిగా పని చేయక పోవడం వల్ల. ఆ network ఏంటో తెలుసా Hutch. తరువాత అది వోడాఫోన్‌గా రూపాంతరం చెందింది. :)

    రిప్లయితొలగించండి
  5. కొందరు ఆటో డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతో డ్రైవ్ చేస్తారు. ఒరిస్సాలో ఒక ప్రాంతం నుండి వచ్చిన ఆటో వాళ్ళు ఇలా చేస్తారని నేను రాసిన ఒక కధలో రాసాను. అయితే కస్టమర్ కేర్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పారు ఎందుకంటె వాళ్ళు టీ తాగడానికి వెళ్ళే తొందరలో ఉంటారు . నేను అన్ని ప్రూఫ్ లు బాంక్ స్టేట్మెంట్ చెక్ బుక్ , నా ఈమెయిలు పాస్ వార్డ్ అన్ని ఇచ్చి మొబైల్ నంబర్ తీసుకున్నాను. దీనిమీద ఎవరనిన చర్చకు వచ్చేపనైతే నా బ్లాగులో ఫోన్ నంబర్ ఇచ్చాను చేయవచ్చు. ఫోన్ చేసే వారు తమ బాంక్ స్టేట్మెంట్ బయట పెట్టాలి

    రిప్లయితొలగించండి
  6. వేణూ,
    నవ్వాపుకోలేకపోతున్నాను నిజంగా! బాగా కాలిందన్నమాట(వేడి వేడి ముద్దపప్పులో కాలేశానన్నారుగా మరి)!

    IM గారూ, కేక! ఐతే వాళ్ళు ఈ వోడా ని నమ్ముకుంటే వాళ్ల పని గోవిందా అన్నమాట.

    నాకూ మొదట్లో వోడా (అప్పట్లో హచ్) ఉండేది. ఎవరన్నా ఫోన్ చేయగానే ఫోన్ పట్టుకుని పరిగెత్తుకెళ్ళి బాలకనీలో ఈశాన్య మూలగా నిలబడి ఒక కాలు 65 డిగ్రీల కోణంలో పక్కకు జరిపి మాట్లాడాలి. మాటల్లో పడి ఏ మాత్రం కాలు కదిలించినా కాల్ కాస్తా కట్ అయిపోయేది. అంత ఘోరంగా ఉండేది వాళ్ళ నెట్ వర్క్. తర్వాత ఇంటి దగ్గర్లోకి టవర్ వచ్చాక మారిందనుకోండి.

    గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది.

    శ్రీనివాస్,
    నేను మీకు ఫోన్ చేయను బాబోయ్!

    రిప్లయితొలగించండి
  7. పాపం మీ కధ విన్నాక ఆ రెండో కమర్షియల్ చూస్తుంటే ఆ జోజో బొమ్మ నిజం గా మిమ్ములను చూసి నవ్వుతున్నట్లే అనిపించింది... పాపమ్ సుజాత నిన్ను కూడా.. సూపర్ కదా బాల్కనీ లో65 డిగ్రీల కోణమ్ ;-). ఇక్కడ కూడా అంతే లే మనకు అత్యవసరమైన చోట్ల లో ఆ ఫోన్ లేక పోతే కష్టం అనే ప్లేస్ లలో నే నో నెట్ వర్క్ వస్తుంది.

    రిప్లయితొలగించండి
  8. మీ సహనానికి నా జోహార్లు వేణు గారూ...

    రిప్లయితొలగించండి
  9. హ హ హ...వేణు గారు పాపం చాలానే అవస్థలు పడుతున్నారండీ. ఒక్క వోడా వాడు మాత్రమే కాదండీ ఇంచుమించు అందరూ అదే ఫార్ములా ఫాలో చేస్తున్నారు.
    బి ఎస్ యెన్ ఎల్ వాళ్ళ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే మొత్తం మలయాళీలే. వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారా? మలయాళం మాట్లాడుతున్నారా? అనే విషయం మనకి అర్ధంయ్యేలోపే... మనం చెప్పాలనుకున్నది వినకుండా..వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పేసి, ఫోన్ పెట్టేస్తారు.

    రిప్లయితొలగించండి
  10. అబ్బ ఆ రెండో కమర్శియల్ లా భలే నవ్విం చారండీ బాబు .

    రిప్లయితొలగించండి
  11. ఇంత ఆలశ్యంగా జవాబిస్తున్నందుకు క్షంతవ్యుడను. అనుకోని ట్రిప్ వలన ఆలశ్యమైంది.

    బ్లాగాగ్ని గారు నెనర్లు, నేను కూడా నంబర్ పోర్టబిలిటీ కోసమే ఎదురు చూస్తున్నానండీ. నిజమే కాని కొందరు వోడాఫోన్ కూడా బాగానే ఉంది అంటున్నారు కనుక. మీ ఏరియాలో కవరేజ్ వివరాలు తెలుసుకుని మీరు మారాలనుకున్న కారణం బలమైనది అయితే మారండి.

    Indian Minerva గారు నెనర్లు, మీరు చెప్పింది నిజంగా నిజమా.. హ్మ్

    శ్రీనివాస్ గారు నెనర్లు. పిచ్చెక్కించేస్తున్నారు సారు మీ కామెంట్లతో + అభిమానంతో :-)

    సుజాత గారు నెనర్లు, నిజమేనండీ బాగా కాలింది. హ హ మీ 65 డిగ్రీలు కేక నాకు అమెరికాలో స్ప్రింట్ నెట్వర్క్ తో ఇలాటి అనుభవాలు జాస్తి. ఒకోసారి మాట్లాడే ఫోజు మార్చినా నెట్వర్క్ పోయేది. అప్పట్లో వాళ్ళ ఫోన్లు కూడా అంతే ఉండేవి లెండి.

    భావన గారు నెనర్లు, భలే చెప్పారండీ సరిగ్గా అవసరమనుకున్నపుడే మొరాయిస్తాయి ఈ ఫోన్లు.

    మురళి గారు నెనర్లు, తప్పని సరి పరిస్థితులలో అలా వచ్చేస్తుందండీ సహనం :)

    ప్రణీత స్వాతి గారు నెనర్లు. హ హ మలయాళీ సపోర్ట్ బాగుంది. నిజమే అంతా అలానే ఉన్నారులెండి.

    మాలా కుమార్ గారు నెనర్లు. మరే దాన్లో బొమ్మ నన్ను చూసే నవ్వుతుందండీ..

    రిప్లయితొలగించండి
  12. వేణు గారు మీ సహనానికి జోహార్లు..మీకు ఆడ్ అంతగా నచ్చితే ఆ ఆడ్ని ఎక్కువగా చూడండి అంతే కాని ఇలా వేడి వేడి ముద్దపప్పులో కాలు వేయకండి. సరదాగా తీసుకోండి మిత్రమా నా కామెంట్.
    అన్నట్టు నెంబర్ పోర్టబిలిటి వచ్చేదాకా మనకు ఈ బాధలు తప్పవేమో..
    ఇక్కడ అమెరికాలో చాలా మంది స్ప్రింట్ నెట్వర్క్ సిగ్నల్ సరిగ్గా ఉండదు అంటారు కాని నాకు ఇంతవరకు ౩ సంవత్సరాలలో ఎప్పుడు కూడా సిగ్నల్ లేక కాల్ కట్ అవడం జరగలేదు. పైగా కస్టమర్ కేర్ వాళ్ళు బిల్లు ఎక్కువ అవుతుంది కొంచం తగ్గించండి అంటే వీలున్న ప్రతి డిస్కౌంట్ ఇచ్చి సాధ్యమయినంత వరకు బిల్ తగ్గించడంలో సాయపడతారు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీనివాస్ చింతకింది గారు నెనర్లు, భలే వారు మిత్రమా ఆ మాత్రానికే సరదాగా అని చెప్పాలా :-) నేను రాసిందే సరదాగా...
    స్ప్రింట్ కొన్ని రాష్ట్రాల్లో చాలా బాగుంటుంది కొన్ని చోట్ల అస్సలు సారీ... ఈ ఇబ్బందులు మొదట్లో మరీ ఎక్కువ ఉండేవి. కస్టమర్ కేర్ బాగానే ఉండేది లెండి.

    రిప్లయితొలగించండి
  14. మనకు కొత్త నంబర్ కావాలంటే మనచుట్టు ఆ కుక్క తిరిగినట్టు తిరుగుతారా.. బాబూ ఇంక ఈ నంబర్ అక్కరలేదు - తొలగించు అని ఆ సహాయకేంద్రానికి ఫోన్ లో చెప్పామనుకోండి - మీరు పర్సనల్ గా రావాలి అంటాడు.
    అలా నేను నా పర్సనల్ గా వెళ్ళి వీడికి ఆఖరి నయాపైసా తో సహా కట్టి .. నీకో నమస్కారం నీ సేవకోనమస్కారం ఇక నా జోకిలి రాకు అని బయటకి వస్తే .. ఓ నాలుగురోజుల్లో ఆ పీకేసిన నంబర్ కి బిల్లు పంపాడు. ఇంకో నెలకి - పాత బకాయి + కొత్త రుసుం తో ఇంకో బిల్లు పంపాడు...
    అదండీ సంగతి.
    నంబర్ పోర్టబిలిటీ గురించి నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎక్కడినా కూలి దొరకపోతుందా అని

    రిప్లయితొలగించండి
  15. ఊకదంపుడు గారు నెనర్లు. అది నిజమండీ కొత్త నంబర్ గురించి మన వెంట పడతారు క్యాన్సిల్ చేయాలంటే చుక్కలు చూపిస్తారు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.