బుధవారం, సెప్టెంబర్ 26, 2018

యూ-టర్న్...

మన దేశంలో తప్పు చేయని వాళ్ళు ఉండవచ్చేమో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించని వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఉండరనే చెప్పవచ్చు. ఈ ఉరుకుల పరుగుల కాలంలో ఏ ఒక్కరికీ రోడ్ మీద ఒక్క క్షణం ఎదురు చూసే ఓపిక సహనం అస్సలు ఉండవనే విషయం రోడ్లపై ప్రయాణించే ప్రతిసారి మనం గమనిస్తూనే ఉంటాం.

ఇలాంటి ఒక సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తూ దానిని అతిక్రమిస్తే వచ్చే ఊహించని పర్యవసానాలు ఎలా ఉండవచ్చో వివరించే సినిమా యూ టర్న్. మాములుగా ఈ విషయం చెప్తే ఒక డాక్యుమెంటరీ అవుతుంది కానీ ఈ సందేశాన్ని ఇవ్వడానికి కన్నడ దర్శకుడు పవన్ కుమార్ ఎన్నుకున్న కథా కథనాలు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

ఇంజనీరింగ్ చదివి కూడా మనసుకు నచ్చిన పని చేయాలనే లక్ష్యంతో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ రిపోర్టర్ గా పని చేస్తుంటుంది రచన (సమంత).  ఆర్.కె.పురం రైల్వే లైన్ మీదుగా ఓ టూలైన్ ఫ్లైఓవర్ ఉంటుంది అంటే వెళ్ళడానికి ఒక లైన్ రావడానికి ఒక లైన్ మాత్రమే. ఈ రెండు లైన్స్ ను విభజించే డివైడర్ పక్కకు జరపగల రాళ్ళతో ఏర్పాటు చేసినది.

దదాపు కిలోమీటర్ పొడవున్న ఈ ఫ్లైఓవర్ పై కొందరు పూర్తిగా చివరి వరకూ వెళ్ళి యూ టర్న్ తీస్కోడానికి బద్దకించి బ్రిడ్జ్ మధ్యలో డివైడర్ రాళ్ళను పక్కకు జరిపి యూ టర్న్ తీస్కుని వెళ్ళి పోతుంటారు. అలాంటి వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి తెలుసుకోని తమ పేపర్ లో ఒక స్టోరీ ప్రజంట్ చేయాలని రచన ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రయత్నంలో తనకి ఎదురైన అనూహ్య పరిణామాల సారాంశమే ఈ చిత్రం. 

థ్రిల్లర్ సినిమాల కథలను ఇలాంటి రివ్యూలలో ఎక్కువ తెలుసుకుంటే సినిమా చూసేప్పుడు వచ్చే థ్రిల్ కోల్పోతాం కనుక నేను ఎక్కువ చెప్పడం లేదు. కానీ చివరి అరగంట వరకూ కూడా ఊహకందని ఉత్కంఠతో చూసేలా దర్శకుడు కథని నడిపిన తీరుని ప్రశంసించకుండా ఉండలేం. ఆ తర్వాత కూడా టిపికల్ గా ఆ జెనర్ లో వచ్చే సినిమాల శైలికి కాస్త భిన్నంగా చూపించి శభాష్ అనిపించుకున్నాడు.

సినిమా మూడ్ కి తగిన నేపథ్యం, సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ల సహజమైన నటన ఆకట్టుకుంటుంది. చిన్మయి డబ్బింగ్ కి అలవాటు పడి ఉన్న ప్రాణాలకి సమంత తెలుగు కాస్త పంటికింది రాయిలా తగలుతుందేమో కానీ భరించవచ్చు. కథ కథనాలలో అక్కడక్కడా కాస్త లాజిక్ ని పక్కన పెడితే సినిమా జరుగుతున్నంత సేపు ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కాక నిజంగా కథ జరుగుతున్న చోటులో మనం కూడా ఉండి చూస్తున్నామేమో అని ఫీల్ తెప్పించడంలో దర్శకుడు సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యారు. నాకైతే టైటిల్స్ ప్రజెంట్ చేసిన తీరుతోనే ఇంట్రస్టింగ్ సినిమా చూడబోతున్నామనే ఫీల్ వచ్చింది.

కన్నడ ఒరిజినల్ చూడని వాళ్ళు. థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, తెలుగులో కమర్షియల్ ఫార్ములా సినిమాలు లేదా టిపికల్ ప్రేమకథలు తప్ప వేరే ఆసక్తికరమైన సినిమాలు రావడం లేదనే ప్రతి ఒక్కరూ ఒక వైవిధ్యమైన ప్లస్ ఆసక్తికరమైన సినిమాని చూడాలంటే "యూ-టర్న్" ని మిస్సవ్వద్దు. సినిమా ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.

2 కామెంట్‌లు:

  1. ఇంట్రెస్టింగ్..రొటీన్ లో తెలీకుండా చేసే తప్పులు ఇలాంటి పవర్ఫుల్ మీడియం ద్వారా అండర్లైన్ చేయటం వల్ల..ఒకరిద్దరు రియలైజ్ అయినా దర్శకుని ప్రయత్నం సక్సెస్ అయినట్టే...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతిగారు.. ఈ సినిమా చూసిన వారిలో కొందరైనా ఖచ్చితంగా మరోసారి ఆలోచిస్తారు ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే ముందు.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.