సోమవారం, ఆగస్టు 08, 2016

మనసును తాకే మనమంతా...


చంద్రశేఖర్ ఏలేటి -- తెలుగు సినిమాకి దొరికిన మేలి ముత్యం. తను దర్శకత్వం వహించినది కొన్ని సినిమాలకే అయినా వైవిధ్యమైన సినిమాలకి పెట్టింది పేరు, అలాంటి దర్శకుడు మోహన్ లాల్ లాంటి నటుడిని ఒప్పించాడంటే ఎలాంటి కథ చెప్పి ఉంటాడా అని సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుండీ ఆసక్తి రేకెత్తించారు. "మనమంత" ఒక చక్కని హ్యూమన్ ఎమోషన్స్ కి సంబంధించిన కథ. 

సాయిరాం (మోహన్ లాల్) ఒక సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్, స్టాక్ చూసుకుంటూ గోడౌన్ లో పని చేస్తుంటాడు. స్టాక్ బోయ్ గా కెరీర్ మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న అతనకి మేనేజర్ గా ప్రమోషన్ వస్తే తన జీవితం మెరుగవుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. 

గాయత్రి (గౌతమి) ఒక సాధారణ మధ్యతరగతి గృహిణి, సరుకులలో ఓ నాలుగొందలు పొదుపు చేయడం కొసం ఎక్కడో దూరంగా వున్న కిరాణా కొట్టును వెతుక్కుని మరీ వెళ్ళి వచ్చే మధ్యతరగతి మనస్థత్వం. తన ప్రపంచం తన ఇల్లే ఇంకా గట్టిగా మాటాడితే వంటిల్లే.. తనకి తోడు షాపింగ్ కి ఇతరత్రా తనతో వచ్చే పక్కింటి స్నేహితురాలు ఊర్వశి.

అభిరామ్ (విశ్వాంత్) ప్రొఫెసర్ రాసిన కోడ్ లో సైతం తప్పులు పట్టుకోగల బ్రిలియంట్ స్టూడెంట్.. చదువే లోకంగా బ్రతికే ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ జీవితం లోకి కొన్ని అనుకోని సంఘటనలతో ఓ అమ్మాయి వస్తుంది.. ఇక అప్పటినుండి ఆ అమ్మాయి ప్రేమే లోకంగా బ్రతకడమ్ మొదలు పెడతాడు.

తన చూపుల నిండా దయ కరుణ కురిపించే మహిత (రైనా రావ్) తను స్కూల్ కి వెళ్ళే దారిలో కూడా వాళ్ళకీ వీళ్ళకీ చిన్న చిన్న సహాయాలు చేస్తూ అందరితో ఇట్టే స్నేహం చేసే ఓ చిన్న పాప. తను ఆటో ఎక్కే చోట మెయిన్ రోడ్ పక్కన ఉన్న గుడిసెలలొ ఉండే ఒక చిన్న బాబుతో స్నేహం చేసి వాడ్ని తనతో పాటు స్కూల్లో చదివించాలని ప్రయత్నం చేస్తుంటుంది.  

ఈ నలుగురు వారు అనుకున్నవి సాధించ గలిగారా, జీవితమనే రోలర్ కోస్టర్ రైడ్ వారికి ఎలాంటి థ్రిల్స్ ని ఇచ్చింది ఎలాంటి ఆనందాలను ఇచ్చింది ఎలాంటి కష్టాలను రుచి చూపించింది అనేదే కథ. ఈ నాలుగు వేర్వేరు కథలనీ ఎక్కడా అసక్తి సడలకుండా చిక్కని కథనంతో దర్శకుడు చెప్పుకొచ్చిన తీరు వాటిని చివరికి కలిపిన తీరు అద్భుతం. ఇలాంటి సినిమాకి కిలకమైన క్లైమాక్స్ ని తను డీల్ చేసిన్ తీరు అనితర సాధ్యం. ఇంత చక్కని స్క్రిన్ ప్లే అంత బలమైన సన్నివేశాలు వ్రాయడం తెలుగు దర్శకులలో చంద్రశేఖర్ ఏలేటి గారికి మాత్రమే సాధ్యం. 

సాధారణంగా సినిమా అయిపోయాక కూడా గుర్తుండే కొన్ని సినిమాలలో ఎక్కువ శాతం వాటిలోని కాంప్లెక్సిటీని అర్ధం చేస్కోడానికో విశ్లేషించుకోడానికో గుర్తుంచుకుంటాం. కానీ ఈ సినిమాలొ సన్నివేశాలు పాత్రలు చందూ ఎంత బలంగా రాసుకున్నారంటే. ఆయా పాత్రల ఎమోషన్ కి బలంగా కనెక్ట్ అవడం వల్ల అవి మన మనసులో చెరగని ముద్రలు వేసేస్తాయి. 

మోహన్ లాల్, గౌతమి లాంటి నటుల పెర్ఫర్మెన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. కేవలం మనకి సూపర్ మార్కెట్ సాయిరాం, గృహిణి గాయత్రి మాత్రమే కనిపిస్తారు. మహిత గా చేసిన పాప రైనా రావ్ అద్భుతమైన నటన కనబరిచింది. విశ్వంత్, అనిష్ కూడా న్యూ ఏజ్ లవ్ త్రెడ్ లో అకట్టుకుంటారు. హర్షవర్ధన్, నాజర్, వెన్నెలకిషోర్, బ్రహ్మాజి, తారకరత్న, గొల్లపూడి, ఊర్వశి, పరుచూరి వెంకటేశ్వరరావు లాంటి నటులంతా కూడా చిన్న చిన్న పాత్రలు చేసినా వారు చూపించే ఇంపాక్ట్ మరిచిపొలేనిది. 

ఇలాంటి కథలను చిత్రంగా తీస్తున్నప్పుడు ఒక సీరియల్ ఫీల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే రాహుల్ శ్రీ వాస్తవ్ సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ నేపధ్య సంగీతం ఆ ఫీల్ రాకుండా అడ్డుపడ్డాయని అనిపించింది. ప్రతి సన్నివేశానికి మూడ్ కి తగిన సినిమాటోగ్రఫీ నేపధ్య సంగీతం వాటిలోని ఎమోషన్ ని మరింతగా మన మనసులకి చేరువ చేసిందని అనిపించింది. అలాగే రవీందర్ గారి ఆర్ట్ డైరెక్షన్ని సైతం మెచ్చుకోవాలి.

ఫైట్లు, పాటలు, ప్రాసల పంచ్ డైలాగులు, ఇరికించిన కామెడీ సన్నివేశాలు మాత్రమె ఎంటర్టైన్మెంట్ అనుకునే వారికి ఈ సినిమా నచ్చకపొవచ్చు మొదటి సగం మరీ స్లొగా ఉన్నదనిపించవచ్చు కానీ ఇలాంటి సినిమాలు ఇలాగే ఉండాలి. వైవిధ్యమైన సినిమాలను ఇష్టపడే వారు మిస్సవకుండా చూడవలసిన సినిమా "మనమంతా". సినిమాలోని మనసుకు హత్తుకునే చాలా సన్నివేశాల గురించి క్లైమాక్స్ గురించి ఇంకా రాయాలని ఉంది కానీ ప్రేక్షకులకు ఫీల్ మిస్ అవకూడదని రాయడం లేదు.

ఈ సినిమా ఎంత సహజంగా ఉంటుందంటే నలుగురు మధ్యతరగతి వ్యక్తుల జీవితాలలోకి అజ్ఞాతంగా తొంగి చూసిన ఫీల్ వస్తుంది. సినిమా ముగిసాక వారిని ప్రతి ఒక్కరిని మనం సొంతం చేసుకుంటాం. వారంతా మన ఇంట్లొ వ్యక్తులుగా మనకెన్నో రోజులనుండి పరిచయమున్న వ్యక్తులుగా అనిపిస్తారు. ఒక చక్కని అనుభుతిని సొంతం చేసుకోడానికి "మనమంతా" తప్పక చూడండి.

Updated on 11 - 10 - 2016 

ఈ సినిమా థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు వారాహి వారి యూట్యూబ్ ఛానల్ లో ఇక్కడ చూడవచ్చు.
 

6 కామెంట్‌లు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.