శుక్రవారం, జనవరి 22, 2016

అమ్మ జ్ఞాపకాలతో...

అపుడు నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో.. ఓ మండు వేసవి మిట్ట మద్యాహ్నం.. గుంటూరు నగరం, అరండల్ పేటలో నడిరోడ్డు.. సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. నేను మాత్రం.. "పో.. పోవోయ్ చుప్పనాతి సూరీడా నీ ఎండ నన్నేం చేయలేదు నా దగ్గర మా అమ్మ చీర చెంగుంది.." అని సూరీడ్ని సవాలు చేస్తూ అమ్మ చీర కొంగులో తల దాచేసుకుని.. అమ్మ చేతిని గాట్టిగా పట్టుకుని వడి వడిగా నడుస్తూ ఉన్నాను.. చుట్టూ ఏవో రంగు రంగుల పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి కాని ఇంత లావు కళ్ళజోడు పెట్టుకున్నా కళ్ళు మసక మసక గా ఉండి సరిగా కనపడడం లేదు.. 

పొద్దున్న వరకూ చక్కగా ఉన్న కంటి చూపుని ఇలా ఐడ్రాప్స్ వేసి మసకబారేలా చేసిన డాక్టర్ గారిని మరో మారు తిట్టుకుంటూ అమ్మ చేతిని మరింత బిగించి పట్టుకుని తన వెంట నడుస్తున్నా.. ఇంతలో ఒక పెద్ద భవనం కనిపించింది.. "వచ్చేశాం నాన్నా ఇదిగో ఇదే.. ఇంత దూరం ఉంటుందనుకోలేదు వెళ్ళేప్పుడు రిక్షాలో వెళ్దాంలే" అంది అమ్మ... లోపలికి వెళ్తే ఫ్యామిలీ సెక్షన్ పైకి వెళ్ళాలన్నారు అబ్బా ఇపుడు భోజనం కోసం మళ్ళీ ఇన్ని మెట్లెక్కాలా.. ఎంచక్కా మా నర్సాపేటలో ఐతేనా రోడ్ మీద నుండి ఇలా అడుగు లోపలికి పెడితే కుర్చీలేసి కూర్చోబెట్టి పరోఠాలు వడ్డించేస్తారు కేరళా హోటల్ వాళ్ళు.. అనుకుంటూ పైకెక్కాను.. 

ఇరుకుగా ఉన్న మెట్లు ఎక్కి పైకి చేరి తలుపు తీయగానే చల్లటి గాలి మొహం మీద హాయిగా తగిలింది.. మనకి జ్వరం వచ్చినపుడు అమ్మ చల్లని చేతితో మొహం మీద తడిమితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా అనిపించింది. ఆహా ఏమి హాయిలే హలా అనుకుంటూ లోపలకి అడుగుపెట్టాను.. కళ్ళలో వేసిన ఐడ్రాప్స్ ఎఫెక్ట్ ఏమో డ్రీమ్ సీక్వెన్స్ లోలా లైట్స్ చుట్టూ హేజ్ లా పరుచుకుని గ్లాస్ పార్టీషన్స్ తో అందమైన ఇంటీరియర్ కళ్ళకి విందు చేసింది. ఊర్లో వీధి చివరి కాకా హోటల్ సెంటర్ లో కేరళా హోటల్ తప్ప తెలియని నాకు ఏదో ఇంద్ర లోకంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. 

ఇక అక్కడ ఇచ్చే మంచినీళ్ళ నుండి భోజనం అయ్యాక ఇచ్చిన పాన్ వరకూ నాకు ప్రతీదీ అద్భుతమే.. వేటికవే ప్రత్యేకంగా ఉన్న అరలు గా ఉన్న ప్లేట్ లో పప్పు వేపుడు ఇగురు సాంబార్ రసం పెరుగు అంటూ పలు రకాల కూరలు వాటన్నిటికి ముందుగా పలావ్ రైస్ చిన్న చిన్న పూరీలు చిన్న గ్లాసుడు ఫ్రూట్ జ్యూస్ అన్నీ వేటికవే ప్రత్యేకం.  ఇక నేతి మైసూర్ పాక్ మాధుర్యమైతే మాటల్లో చెప్పలేను.. దాని ఘుమఘుమలూ కమ్మటి రుచీ ఇప్పటికీ ఇంకా ఫ్రెష్ గా గుర్తొస్తుంటాయి. పాపం అమ్మ కొంచెం రుచి చూసి తన స్వీట్ కూడా నాకే ఇచ్చేసింది. 

ఒక్క మైసూర్ పాకేనా.. ఏదైనా అమ్మ నాతో షేర్ చేస్కోవాల్సిందే.. అసలదేంటో కానీ చిన్నపుడు నేను ఎన్ని తినుబండారాలు ఎంత తిన్నా అంత రుచి ఉండేది కాదు కానీ అమ్మ ప్లేట్ లోంచి తీసుకుంటే వచ్చే రుచే వేరు. నా భోజనం అంతా ఐపోయాకైనా సరే అమ్మ తింటూంటే పెరుగన్నం లోంచైనా ఓ ముద్ద తింటే కానీ కడుపు నిండినట్లు అనిపించేది కాదసలు. ఇక ముద్ద పప్పు ఆవకాయ నెయ్యి కలిపి వేళ్ళకంటిన గుజ్జు గోరుముద్దలు చేసి తినిపిస్తే మహాప్రభో ఆ రుచి ఇన్నేళ్ళలో ఇంక వేటికీ రాలేదంటే నమ్మండి. అంతెందుకు అదే ముద్దలు మనంతట మనం తిన్నా ఆ రుచి మాత్రం రాదు.

 
చిన్నతనంలో ఎక్కువగా బజారు వెళ్ళాలన్నా ఊళ్ళు తిరగాలన్నా నాన్న వెంటే వెళ్ళే వాడ్ని కానీ ఒకోసారి నాన్న బాగా బిజీగా ఉండి వీలు పడనప్పుడు అమ్మ తీస్కెళ్ళాల్సి వచ్చేది. ముఖ్యంగా నేను చిన్నతనం నుండే ఇంత లావు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వచ్చేది కదా సో అప్పట్లో మేమున్న నర్సరావుపేటలో మంచి డాక్టర్ లేరని చెప్పి గుంటూరులో దయాకర్ గారి దగ్గర చెక్ చేయించే వాళ్ళు మొదటిసారి అమ్మా నాన్నా ఇద్దరూ వచ్చినా ఆ తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఓ సారి వీలుని బట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను తీస్కెళ్ళి చెకప్ చేయించేవారు. 

ఐతే చిన్నతనం కావడంతో వైద్యానికి వెళ్తున్నామన్న స్పృహ కంటే ఎక్కువగా అదేదో సరదాగా పిక్నిక్ కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు, అమ్మ తీస్కెళ్తే అది మరీ ఎక్కువ. రైల్లో ప్రయాణం మొదలు బోలెడన్ని కథలు కబుర్లు వింతలూ విశేషాలు ఓహో అద్భుతం. ఒకోసారి నాన్నారితో వెళ్ళినపుడు మాంచి సినిమా చూసే అవకాశం వస్తే అమ్మతో వెళ్ళినపుడు గీతాకేఫ్ లోని ఏసీ రెస్టారెంట్ లో కమ్మటి భోజనం చేసే అవకాశం దొరికేది. అదిగో అలాంటి ఓ సందర్బంలో మొదటి సారి చేసిన గీతాకేఫ్ భోజనం గురించే పైన చెప్పినది..

ఏసీ సినిమా హళ్ళు కూడా పెద్దగా లేని ఎనభయ్యో దశకంలో ఏసీ రెస్టారెంట్ లో భోజనం అంటే మాటలు కాదు. అక్కడి పరిసరాల గురించి భోజనం గురించి భోజనంతో ఇచ్చే నేతి మైసూర్ పాక్ గురించీ స్కూల్లో ఫ్రెండ్స్ కి కథలు కథలుగా వర్ణించి చెప్పే వాడ్ని ఊరెళ్ళివచ్చాక. అసలు ఒక్క ప్రయాణమేంటిలే అమ్మతో గడిపిన ప్రతి క్షణమూ అపురూపమే కదా.

16 కామెంట్‌లు:

  1. మల్లెపూల పరిమళం అంత చల్లగా మన్సును హత్తుకునేంత హాయిగా ఉన్నాయండీ మీ `ఙాపకాలూ వేణూజీ..అసలు అమ్మ ఙాపకాలంటేనే మనసు మల్లెలు కదా..

    రిప్లయితొలగించండి
  2. అమ్మకు.. ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  3. చిన్నతనంలో అన్నీ సరదాలే. మీ అనుభూతి ముందు కాలమే తలవంచేసింది.

    రిప్లయితొలగించండి
  4. అమ్మతో ప్రతి క్షణం అపురూపమే! ఆ క్షణాలన్నీ రాలిన పూల జ్ఞాపకాలే !

    రిప్లయితొలగించండి
  5. వేణు గారూ, అయ్యో అట్లా మధ్యలో ఆపేశారేమిటండీ అనాలనిపిస్తోంది ...
    ఇంకా ఇంకా వ్రాసి ఆ ప్రేమానుభూతులకు మరిన్ని వర్ణాల అద్దకాలను,
    వర్ణనలను జోడించి ఉండాలనిపిస్తోంది ...
    ఆ అమృత భావనల దర్శన భాగ్యపు తనివి తీరలేదనిపిస్తోంది
    అయినా మమ్మల్ని ఆ ఆనంద లోక విహారుల్ని చేసినందుకు మిమ్మల్ని పొగడాలనిపిస్తోంది ...

    __/\__ ...


    "ఎవరు రాయగలరు అమ్మా అను మాటకన్న కమ్మని కావ్యం
    ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
    అమ్మేగా ... అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి
    అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ..."

    (అమ్మ రాజీనామా చిత్ర గీతం :
    https://www.youtube.com/watch?v=LDRhABJJjWw)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ nmrao గారు. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలిఉందనిపిస్తూ అలా మధ్యలో ఆపేసినట్లే అనిపిస్తుంటుందేమోనండీ. మంచి పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  6. 😊... Meeru cheppindi chaduvutunte nenu doctor daggara chupinchukovadaniki ma ammatho guntur vellina sangathi, aa gnaapakaalu kalla mundu kadilayi... ade narasaraopet nunchi... kakapothe bhojanam sankar vilas lo chesamu...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహ అవునా గాయత్రి గారు :-) మీరూ దయాకర్ గారి దగ్గరకేనా.. రామలింగారెడ్డి గారు రాకముందు నరసరావు పేట నుండి అంతా ఈయన దగ్గరకే వెళ్ళే వాళ్ళనుకుంటాను. శంకర్ విలాస్ కూడా బాగుండేదండీ.. మేమూ దానికే ఎక్కువ వెళ్ళేవాళ్ళం గీతాకి ఎపుడో ఒకటి రెండు సార్లు స్పెషల్ గా మాత్రమే. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

      తొలగించండి
  7. అమ్మంటే మీకెంత ప్రేమండీ! అందరికీ ఉంటుందనుకోండీ.. కాని మీ ప్రేమ ప్రత్యేకంగా అనిపిస్తుంది నాకు. నిజం చెప్పాలంటే, అమ్మ గురించి మీ మాటల్లో చదివినపుడల్లా నేను త్వరగా అమ్మయినయితే బావుండనిపిస్తుంది :)

    ఇక ఈ పోస్ట్.. అమ్మ జ్ఞాపకమంత మధురంగా ఉంది :)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.