ఆదివారం, జులై 14, 2013

సాహసం...


తనది పదేళ్ళ సినీ కెరీర్ కానీ తీసింది ఐదే సినిమాలు సంపాదించిన ఖ్యాతి మాత్రం అనంతం. ఐతే-2003, అనుకోకుండా ఒకరోజు-2005(ఇదే కాన్సెప్ట్ తో నాలుగేళ్ళ తర్వాత 2009 లో హాంగోవర్ అనే హాలీఉడ్ సినిమా వచ్చింది), ఒక్కడున్నాడు-2007 (ఇందులో ప్రధానాంశం గుండె మార్పిడి ఐతే లివర్ మార్పిడి ప్రధానంశంగా ఇదే తరహాలో ఐదేళ్ళ తర్వాత 2012 లో హాలీఉడ్ సినిమా విడుదలైంది), ప్రయాణం-2009, ఇపుడు 2013 లో సాహసం.


ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమాలే వందలకొద్దీ నిర్మించే అలవాటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను తీసిన సినిమా మళ్ళీ తీయడం దేవుడెరుగు తీసిన జొనర్ లో మళ్ళీ తీయకుండా ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా కథా కథనాలపై దృష్టి నిలిపి మంచి సినిమాలు తీస్తూ తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్న ఆ దర్శకుడి పేరు చంద్రశేఖర్ యేలేటి. తెలుగు సినీ జగత్తుకు దిశానిర్దేశం చేయగల అరుదైన ప్రతిభావంతులైన దర్శకులలో ఈతనిది ఒక విశిష్టమైన స్థానం..

తను యాక్షన్/అడ్వంచర్ జెనర్ లో మాస్ హీరో గోపీచంద్ తో చేసిన సరికొత్త ప్రయత్నం “సాహసం” సైతం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్, గ్లామర్, అనే ఎండమావుల వెంట పరిగెట్టకుండా కథా కథనాలు టెక్నికల్ వాల్యూస్ పై ఫోకస్ చేస్తూ తనపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆకట్టుకుంటుంది. ఇదే జెనర్ లో హాలీఉడ్ లో వచ్చిన నేషనల్ ట్రెజర్, ఇండియానా జోన్స్ వంటి సినిమాలని గుర్తుచేసినా కూడా చక్కని ప్లాట్ తో, నెరేషన్ తో, సునిశితమైన హాస్యంతో, టెక్నికల్ బ్రిలియన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేసే చిత్రం సాహసం.


కథ విషయానికి వస్తే నిజాయితీ పరుడైన గౌతం(గోపీచంద్) ఒక సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. “నాది కానిది కోటి రూపాయల విలువైనదైనా నాకొద్దు, నాదన్నది అర్ధరూపాయైనా ఒదులుకోను” అంటూండే గౌతం పేదరికంతో విసిగి వేసారి ఎలాగైనా బోలెడు డబ్బు సంపాదించాలని అదృష్ట రత్నాలనీ లాటరీ టిక్కెట్లనీ నమ్ముకుని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపధ్యంలో తన తాత తమకోసం కూడబెట్టిన కొన్ని వజ్రాలు ఆభరణాలు పాకిస్థాన్ లోని హింగ్లజ్ దేవి గుడి దగ్గరలో ఉన్నాయని తెలుసుకుంటాడు. శ్రీనిధి(తాప్సి) ఒక భక్తురాలు ప్రపంచం త్వరలోనే అంతమైపోతుందనీ ఆలోపే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాలను దర్శించుకోవాలనీ తిరుగుతుంటుంది. తన తదుపరి మజిలీ పాకిస్థాన్ లోని హింగ్లజ్ దేవి ఆలయం. గౌతం కూడా శ్రీనిధితో కలిసి పాకిస్థాన్ బయలుదేరుతాడు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్ లో ఒక చోట కనిష్కుల కాలం నాటి గుప్తనిధి నిక్షిప్తమై ఉందని తెలుసుకుని ఆనాటి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని తన దేశాభివృద్దికి ఆనిధిని ఇవ్వాలని ఒక గ్రూప్ తో తవ్వకాలు జరుపుతుంటాడో ఆర్కియాలజీ ప్రొఫెసర్. అతనిని బెదిరించి ఆ ఆర్కియాలజీ సైట్ మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని నిధి కోసం ఎదురు చూస్తుంటాడు అక్కడి టెర్రరిస్ట్ సుల్తాన్(శక్తి కపూర్). వీళ్ళు వెతుకుతున్న నిధీ, గౌతం వెతుకుతున్న నిధీ ఒకటేనా? అసలు గౌతం తాత ఆస్థి కుటుంబానికి చెందకుండా అక్కడెక్కడో పాకిస్థాన్లో ఎందుకు ఉంది. చివరికి గౌతం ఆ నిధిని కనుగొనగలిగాడా అనే వివరాలు తెలుసుకోవాలంటే మీరు “సాహసం” సినిమా చూడాలి.


ఈ సినిమా టెక్నీషియన్స్ సినిమా అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్షన్, కళాదర్శకత్వం చేసిన ఎస్. రామకృష్ణ నుండి అద్భుతమైన పనిని రాబట్టుకున్నాడు యేలేటి, పాకిస్థాన్ వాతావరణాన్ని తలపించే సెట్స్ కానీ క్లైమాక్స్ లో నిధికి దగ్గరలో ఉపయోగించిన సెక్యూరిటీ సిస్టంస్ వాటిలో కూడా గ్రాఫిక్స్ కన్నా ఆర్ట్ డైరెక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత శాందత్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది లఢఖ్ లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు, ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాల ఫ్రేమింగ్ కెమేరా యాంగిల్స్ చాలా బాగున్నాయ్ కొన్నిచోట్ల చూడడానికి రెండుకళ్ళు సరిపోవన్నట్లుగా అనిపించింది. శ్రీ సంగీతంలోని పాటలు నిరుత్సాహ పరిచాయి ఉన్న రెండు పాటలు కూడా ఆకట్టుకునేట్లు లేవు, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం తడబడినా ఓవరాల్ గా సినిమా మూడ్ కి సరిపోయింది. సెల్వ స్టంట్స్ చాలావరకూ రియలిస్టిక్ గా ఉన్నాయి.

గోపీచంద్ కి అన్ని షేడ్స్ ఉన్న మంచి పాత్ర దొరికింది తన ఫిట్నెస్, నటన, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఇంతకాలం ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కి పరిమితమైన తాప్సీ ఈ సినిమాలో భక్తురాలి పాత్రలో పక్కింటమ్మాయిలా కనిపించడం పెద్ద రిలీఫ్. ఎంతటి కౄరుడైనాకానీ ఊహాతీతమైనవి కళ్ళముందు జరుగుతుంటే ఖంగారుపడడం కామన్. అలాంటి చిత్రమైన విలన్ పాత్రలో శక్తికపూర్ మెప్పించాడు మొదటి సగంలో భయపెట్టి చివరి నలభై ఐదు నిముషాలలో అక్కడక్కడా ప్రేక్షకులని నవ్వించాడు. నారాయణరావు గారు చాన్నాళ్ళ తర్వాత గోపీచంద్ తండ్రిపాత్రలో కనిపించారు. సుమన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అమృతం సీరియల్ లోని సర్వం ఒక చిన్న పాత్రలో ఉన్న కాసేపు నవ్వించాడు. ఆలీ పాత్రని కామెడీ కోసం కన్నా ఒక సపోర్టింగ్ రోల్ కోసమే ఉంచినట్లు అనిపించింది.       


నా మొదటి రెండు సినిమాలలో లాగా ట్విస్టులు ఫ్లాష్బాకులతో స్క్రీన్ ప్లే జిమ్మిక్కులు ఏవీ ఇందులో ఉండవు ఇది లీనియర్ నెరేషన్ లో చెప్పిన ఒక మాములు యాక్షన్/అడ్వంచర్ కథ అని దర్శకుడు ఈ సినిమా గురించి మొదటి నుండీ చెప్తూనే ఉన్నాడు. సినిమా అలాగే ఉంటుంది, మొదటి నుండి పాత్రలను పరిచయం చేస్తూ సాధారణమైన స్క్రీన్ ప్లేతో కథకు అవసరమైన పాత్రలూ సన్నివేశాలతో ముందుకు నడుపుతాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళలేదు. నెరేషన్ కి అడ్డంరాకుండా కేవలం రెండే పాటలు పెట్టాడు ఒకటి హీరో వ్యక్తిత్వాన్ని చూపిస్తూ టైటిల్స్ కి నేపధ్యంగా సాగే పాట, మరోటి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమని చూపించడానికి వాడుకున్న డ్యూయట్.

కథలోని ఒక్కో పాయింట్ రివీల్ చేస్తూ వాటిని ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఆసక్తిగా మొదటిసగం కొనసాగుతుంది ఇంటర్వెల్ కి ముందు కొంచెం తగ్గిన నెరేషన్ తర్వాత రోమాన్స్ కోసం ఉపయోగించుకున్న హార్స్ రైడింగ్ సీన్స్ రీరికార్డింగ్ తో సహా చప్పగా ఉండడంతో మరింత దెబ్బతింటుంది కానీ ఆ తర్వాత నుండి చివరి వరకూ దర్శకుడు మనల్ని స్క్రీన్ నుండి తల తిప్పనివ్వకుండా లీనమై చూసేలా చేస్తాడు, ముఖ్యంగా చివరి నలబై ఐదునిముషాలు చాలా బాగుండడంతో బయటకి వచ్చేప్పుడు మంచి సినిమా చూశామన్న తృప్తితో వస్తాం.   

ఫార్ములా చిత్రాలకూ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకూ పెద్దపీట వేస్తున్న ఈరోజుల్లో ఈ సినిమా ఎంతవరకూ మాస్  ప్రేక్షకులను అలరిస్తుందనేది అనుమానాస్పదమే కానీ మీకు ఇలాంటి అడ్వంచర్ తరహా సినిమాలు ఇష్టమైతే కనుక ఒకసారి ఖచ్చితంగా చూడవలసిన సినిమా “సాహసం”. ఇదో అద్భుత కళాఖండమనో యేలేటి మొదటి సినిమాలలాగే స్క్రీన్ప్లే ట్విస్టులను ఊహించుకునో భారీ అంచనాలతో వెళ్ళకండి, ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి కొన్ని సీన్స్ పరిచయమైనవిగా కూడా కనిపించవచ్చు కానీ రొటీన్ ఫార్ములా కథలకు భిన్నంగా వైవిధ్యమైన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా చూసి ప్రోత్సహించవలసిన మంచి ప్రయత్నం ఈ “సాహసం”.  

ఈ సినిమా పై నవతరంగంలో వెంకట్ శిద్దారెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం ఇక్కడ చదవచ్చు. 
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారితో రెంటాల జయదేవ గారి ఇంటర్వ్యూ ఇక్కడ చదవచ్చు

సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ అండ్ అడ్వంచర్ గురించిన ప్రోమో ఇక్కడ చూడవచ్చు.  

13 వ్యాఖ్యలు:

 1. సూపర్ గా రాసారు ! నాకు చూడాలనిపిస్తుంది ఇప్పుడు కానీ కుదరదే ఎలా :-((

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హ్మ్.. ఎలా అంటే మార్గాలు అణ్వేషించడమేనండీ :) వ్యాఖ్యకు ధన్యవాదాలు.

   తొలగించు
 2. వేణూశ్రీకాంత్ అన్నట్లు ఐతేఫేమ్ యేలేటి సినిమా సాహసం రొటీన్ ఫార్ములాకు భిన్నంగా తలతిప్పనివ్వకుండా కథలో లీనం చేస్తే అది మంచి సినిమాయే అవుతుంది! కొత్తగా ఆలోచించే చంద్రశేఖర్ లాంటి దర్శకులు వీలయినంత సహజంగా తీసే సినిమాలు ప్రేక్షకాదరణకు నోచుకుంటే తెలుగుసినిమా దశ దిశ మారుతుంది!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు సూర్యప్రకాష్ గారు. ఐతే, అనుకోకుండా ఒకరోజు సినిమాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే కొంచెం నిరాశపరచచ్చండీ. ఆ సినిమాల స్టాండర్డ్ వేరు కానీ యాక్షన్ అడ్వంచర్ జెనర్ లోనే యేలేటి మార్క్ కనిపించేలా కన్విక్షన్ తో తెరకెక్కించిన సినిమాగా మాత్రం తప్పక ఆకట్టుకుంటుంది.

   తొలగించు
 3. బాగుందండి మీ రివ్యూ .సాహసం ఎలా ఉందంట? వేణు శ్రీకాంత్ రివ్యూ రాసేరా?అని నిన్నే అడిగారు .ఇంకాలేదు రేపు రాస్తారేమో అన్నా ..అలాగే రాసారు?మా పక్కూరికివచ్చిందంట కుదిరితే చూడాలి..రాధిక (నాని)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రివ్యూ చాలా బాగుందండీ. చాలా నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సినిమా, మీ రివ్యూ రెండు బాగున్నాయండి :))

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.