సోమవారం, మార్చి 29, 2010

పది పైసలు

మరుగున పడిపోకుండా పదిల పరచుకోవలసిన వాటిలో మధురమైన ఙ్ఞాపకాల తర్వాత మొదటి స్థానం కరెన్సీదేనేమో. చిన్నప్పటి నుండి నాకు ఎంత ఆలోచించినా అర్ధం కాని విషయం ఒకటుండేది. ఎక్కువ విలువ ఉన్న డబ్బులు నీళ్ళలో వేస్తే నానిపోయే కాగితంతో చేస్తారు కానీ తక్కువ విలువ ఉండే చిల్లరను కలకాలం నిలవుండే మెటల్ తో తయారు చేస్తారు ఎందుకో ఎంత ఆలోచించినా నా బుర్రకి ఇప్పటికీ అర్ధంకాని ప్రశ్నే. కాస్త పెద్దయిన తర్వాత బహుశా విలువ తక్కువ ఉండే చిల్లరకు వాడుక ఎక్కువ కనుక కాగితాలు త్వరగా పాడవుతాయ్ అని నాణేలు ఉపయోగించారేమో లే అని నాకు నేను సర్ధి చెప్పుకున్నాను, మరి ఇది కాక వేరే కారణమేదైనా ఉంటే మీరే చెప్పాలి. నా చిన్న తనంలో నేను తరచుగా ఉపయోగించినది పది పైసలు :-) ఇప్పటి పిల్లలకి పాకెట్ మోయలేనంత పాకెట్ మనీలు కానీ అప్పట్లో మనం ఇంట్లో ఒక రూపాయి సంపాదించడమంటేనే గగనం. కాని మా ఇంట్లో నాకు కాస్త గారాబం ఎక్కువ కనుక స్కూల్  ఇంటర్వెల్ లో కొనుక్కోడానికి తప్పకుండా చిల్లర ఇచ్చేది అమ్మ. పదిపైసలకి రెండు వచ్చే కొబ్బరి బిళ్ళలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా న్యూట్రిన్ లో పది పైసల సైజ్/షేప్ లోనే వచ్చే ఒక కొబ్బరి చాక్లెట్ ఒకటి ఉండేది అది కూడా చాలా ఇష్టం. పొదుపు చేసుకుని ఒకే సారి ఖర్చు పెట్టుకోవడం కన్నా ఎప్పటికప్పుడు దొరికే ఆనందమే మిన్న అని నమ్మే నేను నా చిల్లర అంతా ఆ చిరుతిళ్ళ కొట్టువాడికే ధారా దత్తం చేసేస్తున్నాను అని అంటుండేది అమ్మ.
 
ఈ పదిపైసలు చూసి చాలా ఏళ్ళయింది అసలు సత్తు కాయిన్స్ అన్నీ మానేశారు అనుకుంటా కదా. అసలు నేను పావలా చూసే చాన్నాళ్ళైంది లేండి ఇక పదిపైసల గురించి ఎందుకు అడుగుతారు. పదిపైసలు అనగానే నాకు ముందు గుర్తొచ్చేది రైలుబండి. అదేంటి అంటారా :-) మా ఇల్లు నరసరావుపేట లో స్టేషన్ కు చాలా దగ్గరలోనే ఉండేది. అక్కడ పిల్లలు కొందరు ఈ పది పైసలను రైలు పట్టాల మీద పెట్టి, దాని మీదనుండి రైలు వెళ్ళాక పలచని రేకు లా మారిన వాటిని కలెక్ట్ చేసుకుని, వాటి మధ్యలో రెండు రంధ్రాలు పెట్టి దారం కట్టి రెండు చేతుల వేళ్ళ మధ్య పెట్టి ఆడుకునే వాళ్ళు. నా క్లాస్మేట్స్ కూడా అపుడపుడు చేసే వాళ్ళు కానీ రైలు దగ్గరకి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తే వీపు చీరేస్తారనే భయం ఉండేది కనుక నేను కేవలం ఫైనాన్సియర్ పాత్రకి పరిమితమయ్యే వాడ్ని. అంటే పావలా ఇస్తే ఒక పదిపైసలు దీనికి దాచుకుని ఆ పిల్లలకో మా ఫ్రెండ్స్ కో ఇచ్చి చక్కని రేకు సంపాదించేవాడ్ననమాట. ఈ ప్రాసెస్ లో కొన్ని డబ్బులు వేస్ట్ అయ్యేవి అంటే సగం మాత్రమే నలిగి, ఒకోసారి మధ్యకు విరిగి ఇలా పనికొచ్చేవి కావు అనమాట. మా వాళ్ళొకోసారి ఇలా అయినవి నావే అని చెప్పి ఇచ్చేవారు. మనం వెళ్ళలేం కనుక వాళ్ళేం చెప్తే అదే కదా మరి.

కొన్నాళ్ళకి డబ్బులు ఎందుకురా వేస్ట్ చేయడం అని గోల్డ్ స్పాట్, లిమ్కా లాంటి కూల్ డ్రింక్ సీసా మూతలను ఓపికగా గుండ్రాయ్ తో చదును చేసి రేకులా తయారు చేసి దానిని ఉపయోగించే వాళ్ళం ఆటవస్తువులు గా. కానీ దీనికి బోలెడంత ఓపిక కావాలి నిదానంగా జాగ్రత్తగా వేలు నలక్కొట్టుకోకుండా మూత పాడవకుండా ముందు అంచుల పై కొట్టి మెల్లగా వంచాలి అన్ని కాస్త వెడల్పుగా అయ్యాక అపుడు మూత మొత్తాన్ని ఎడా పెడా కొట్టేసి రేకులా చదునుగా చేయచ్చు. అసలు ఈ రేకు తయారయినా కూడా పాడవకుండా వీటికి కన్నం పెట్టడం ఒక ఆర్టు. దబ్బనమో లేదా పుస్తకాలు కుట్టడానికి ఉపయోగించే పెద్ద సూదో ఉపయోగించి పెట్టాలి. ఒకోసారి దబ్బనం మొన సరిగా లేకపోతే రేకు వంగిపోవడమో పాడయి పనికి రాకపోడమో జరిగే అవకాసం ఉంది. ఒక సారి సమయానికి ఇవేమీ దొరకక కుట్టు మిషన్ లో ఎంబ్రాయిడరీ చేసే సూది కాస్త పెద్దగానే ఉంది కదా అని దానితో ప్రయత్నింఛా కానీ అది రెండు ముక్కలయ్యే సరికి బుద్దిగా ఎక్కడిదక్కడ పెట్టేసి దెబ్బలు తప్పించుకున్నా అనుకోండి. దీనికి దారం కూడా మాములు బట్టలు కుట్టే దారమైతే మూడు నాలుగు వరుసలు కలిపి పేనాలి కానీ అంత కష్టపడినా ఒకోసారి సరిగా రావు. అందుకే ఇంట్లో సరుకులు తెచ్చినపుడు వచ్చే పొట్లాలు కట్టే దారం బోల్డంత ఎప్పటికప్పుడు దాచేసుకుని అప్పుడప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగించాలనమాట.

పదిపైసలు కాదు కానీ సత్తు చిల్లర తలచుకుంటే మెదిలే ఙ్ఞాపకం ఇంకోటి ఉందండోయ్ :-) ఓ పది పన్నేండేళ్ళ క్రితం  అనుకుంటాను అప్పట్లో ఈ చిల్లర ఇంకా చలామణి అవుతూనే ఉంది కానీ అప్పుడే కనుమరుగు చేద్దామని ఆలోచిస్తున్నారు అనుకుంటా.  ఒక సారి ఢిల్లీ వెళ్ళి వస్తూ రైలు లో అడుక్కునే వాడికి పోకిరి సినిమాలో బ్రహ్మి లా ఒక ఇరవై పైసల బిళ్ళ ని దానమిచ్చి ఫో పండగ చేస్కో పో అన్న లెవల్ లో స్టైల్ గా చూశా. అప్పట్లో మన రేంజి కి అది చాలా ఎక్కువ మరి :-) కానీ వాడు వెంటనే దాన్ని నా చేతిలో పెట్టేసి "ఏ క్యాహై.. అభి ఏ నయి చల్తా.." అనేసి ఆ పండగేదో నువ్వే చేసుకో పోరా అన్నట్లు చూసి "కహాసే ఆతే ఏ మదరాసి లోగ్.." అనుకుంటూ పోయాడు. ఔరా ఎంతటి అవమానమూ అని ఫీల్ అయిపోతుంటే అప్పటి వరకు పక్కన కూర్చొని బాతాఖానీ వేసిన తెలుగాయన ఇవి ఇక్కడ చెల్లవు సార్ మన ఆంధ్రాలో ఇంకా వాడుతున్నారనుకుంటా అని ఙ్ఞానోదయం చేశారు. అపుడే మొదట తెలిసింది ఈ చిల్లర త్వరలో కనుమరుగవబోతోందనమాట అని. పదిపైసల కబుర్లు అవి మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మరోసారి ఆ కబుర్లతో కలుద్దాం, అంతవరకూ శలవ్. 

15 వ్యాఖ్యలు:

 1. అదేదో సినిమాలో పావలాకు ఏమొస్తాయ్ అంటూ ఓ పెద్ద లిస్ట్ చదువుతుంది ఎవరో హీరొయిన్...అలా పది పైసలుకు చిన్నప్పుడుఏఎమేమి వచ్చేవో రాయండి అని ఒక క్విజ్ పెట్టాల్సిందండీ... :)
  ఐదు పైసలుకు కోఒడా కొన్ని వచ్చేవి చిన్నప్పుడు...నాన్న వాళ్ళ చిన్నప్పుడు అర్ధణా, బేడ ఉండేవని చెబుతున్నట్లే మనం పిల్లలకు మా చిన్నప్పుడు ఐదు పైసలు,పది పైసలూ,పావలా,అర్ధరుపాయి నాణేలు ఉండేవి అని చెప్పుకుంటున్నాం..!

  ఇవాళ రూపాయి బిళ్ళకే కాదు ఐదు రుపాయిల బిళ్ళకే విలువ లేకుండా పోయింది.మా చిన్నప్పుడు రోజూ మా ఇంటి ముందునుంచి వెళ్ళే సోడాతాత..పది పైసలుకు అతనిచ్చే సోడా..చివర్లో అమ్మ మా నోట్లో పోసే నాలుగు చుక్కల సోడా కోసం ఎదురు చూపులూ ..నాకిప్పటికీ గుర్తు...! ఎన్నో జ్ఞాపకాలను పొద్దున్నే కదిలించారు... Good post!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భలే భలే విషయాలు వ్రాస్తారండీ మీరు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఒక సారి ఢిల్లీ వెళ్ళి వస్తూ రైలు లో అడుక్కునే వాడికి పోకిరి సినిమాలో బ్రహ్మి లా ఒక ఇరవై పైసల బిళ్ళ ని దానమిచ్చి ఫో పండగ చేస్కో పో అన్న లెవల్ లో స్టైల్ గా చూశా.>>
  హ హ హ భలే ఉంది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తృష్ణ గారు నెనర్లు :-) భలే కబుర్లు గుర్తు చేసుకున్నారు ధన్యవాదాలు.

  నేస్తం గారు నెనర్లు :-) ఏదిగుర్తొస్తే అది రాసేస్తానండీ అపుడపుడు ఇలా. అది సరే గానీ ఇంతకీ మీరు పొగుడుతున్నారా తిడుతున్నారా :-p

  శ్రావ్య గారు నెనర్లు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రూపాయి విలువు పడిపోయింది. పావలా విలువ పోయింది అన్నమాట. రాష్ట్రాల మధ్య కూడా కరన్సీ చెల్లుబాటు లో తేడాలు ఉన్నాయా. విచిత్రం.

  చిన్న చిన్న విషయాల మీద భలే అందంగా రాసారు. బావుంది.

  కొన్నాల్లైతే పది పైసలంటే పడి చస్తారేమో. ఎందుకంటారా.. రాగి నాణాల్లా ఇవి కూడా యాంటీక్ వస్తువుల్లో చేరి
  గిరాకీ పెరుగుతుందేమో చూడాలి :).

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మమ్మ అనా, బేడ అనేది, నా దగ్గర ఓ అనా నాణెం ఉండాలి...
  నె 88 లో ముద్రించిన 10 10పైసలు నాణాలు భద్రంగా దాచుకున్నాను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా బాగుందండీ టపా.. మరిన్ని కబుర్లు మీకు గుర్తు రావాలని కోరుకుంటున్నా :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వాసు గారు నెనర్లు :-) అప్పట్లో నార్త్ లో ఈ సత్తు నాణేలను ముందుగా నిషేధించారటండీ. ఇపుడు బహుశా ఏమీ తేడాలు లేకపోయి ఉండచ్చు.

  నేను గారు నెనర్లు :-) వావ్ మీ దగ్గర అణా ఉందా గ్రేట్.. ఎక్కడ ఉందో వెతికి దానికి కూడా ఓ అందమైన ఫోటో తీసి బ్లాగ్ లో పెట్టేయండి మరి మేము చూసి ఆనందిస్తాము :-) 88 లో పది పైసలు అంటే బహుశా స్టీల్ వి అనుకుంటా కదండీ ఇప్పటి పావలా సైజ్ లో వొచ్చేవి. లేదా ఫోటోలో లాంటి మాములు సత్తు కాయిన్స్ ఏనా.

  మురళి గారు నెనర్లు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. http://kottapali.blogspot.com/2008/09/blog-post_11.html


  భలే భలే!!

  తృష్ణ గారి వ్యాఖ్య కూడా భలే భలే.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ పదిపైసల కబుర్లు చాలా బాగున్నాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీ అంత చదవ బుల్ గా రాయలేదు నేను, :+
  కానీ నా వ్యాసాన్ని కూడా కాస్త చదివి, మీ అభిప్రాయాన్ని రాస్తారా?
  వేణూశ్రీకాంత్ గారూ! (konamanini.blogspot- in)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు అనిల్ గారు, లింక్ వేరే పోస్టులవి ఇచ్చినట్లున్నారండీ మీరు చెప్పదలచుకున్న పోస్ట్ ఇదే కదా. http://akhilavanitha.blogspot.in/2013/09/dozen.html

   తొలగించు
  2. అనిల్ గారు మీ బ్లాగ్ లో కామెంట్ ఫాం పనిచేయట్లేదండీ పోస్ట్ కామెంట్ పై క్లిక్ చేస్తే ఏమీ రెస్పాన్స్ లేదు, అది ఫిక్స్ చేయగలరు. అందుకే అక్కడ రాయవలసిన కామెంట్ నేను ఇక్కడే రాస్తున్నాను.

   నా పోస్ట్ కి లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలండీ. నావేవో కాలక్షేపం కబురులండీ, కానీ మీరు చక్కగా ఒకపాఠం చెప్పినట్లుగా దశాంశ పద్దతులు వాడకం గురించి చక్కనితెలుగులో విశదీకరించి బాగా రాశారు. మీ ఇతర బ్లాగ్స్ లింక్స్ కూడా ఇచ్చినందుకు ధన్యవాదములు, వీలువెంబడి అన్ని చూస్తాను.

   తొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.