ఆదివారం, అక్టోబర్ 07, 2012

ENగ్LISH VINGLIష్

ఈ సినిమా చూసినంతసేపు నవ్వుకున్నా, అక్కడక్కడ గుండె బరువెక్కినా, పూర్తయ్యాక తేలికైన మనసుతో, మంచి సినిమా చూశానన్న సంతోషంతో బయటకు వచ్చినా, ఇంటికి వచ్చాక మాత్రం ఈ సినిమా నన్ను చాలాసేపే ఆలోచనలలోకి నెట్టేసింది. రోజంతా తీరికలేకుండా శుచీ శుభ్రమని ఆలోచించకుండా వారాంతాలూ శలవలూ లేని ఇంటెడు చాకిరీని నవ్వుతూ చేసేస్తూ మనం అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే అమ్మని మనమెంత అలుసుగా చూస్తామోకదా. బహుశా మనం అలా చేయడానికి ఒక కారణం తనని అలాగే ట్రీట్ చేసే నాన్నకావచ్చు కొన్నిసార్లు నాదేముందిలేరా అని తనగురించి అస్సలు పట్టించుకోని అమ్మకూడా
కావచ్చు. ఇప్పటితరంలో అంటే గత పదిపదేహేనేళ్ళలో పెళ్ళిళ్ళు చేసుకున్నవారిలో భార్యకి సైతం తగిన ప్రాముఖ్యతనిచ్చే మగవాళ్ళ శాతం పెరిగినా మా చిన్నతనంలోమాత్రం భార్య ఎంతచదువుకున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా నీకేంతెలియదు నోర్మూసుకో అనే నాన్నలనే ఎక్కువ చూశాం.

అలా అని తనంటే మనకి కానీ నాన్నకి కానీ ప్రేమ లేదని కాదు కానీ ఆప్రేమని వ్యక్తపరచడంలో ఒక అలక్ష్యతని చూపిస్తాం మన అమ్మేకదా అనే ఓ ఫీలింగ్. ఇంట్లో పాచిపనీ వంటపనీ చేస్కునే తనకి ప్రపంచమేమీ తెలియదని తనంటె ఒక చిన్నచూపు. తనగురించి ఏం మాట్లాడినా అదే తనప్రపంచమన్నట్లు తనని వంటింటికే పరిమితం చేసి మాట్లాడతాం. కానీ తనూ మనిషేకదా తనతో ప్రేమగా మాట్లాడడం, తనకితగిన విలువ గౌరవం ఇవ్వడం, తాను చేసే పనులకు గుర్తింపునివ్వడం, అప్పుడప్పుడు చిన్న ప్రశంసలు అందించడం, సాధించిన చిన్నవిజయాలను సైతం గుర్తించి మెచ్చుకోవడం కుటుంబ సభ్యులందరి బాధ్యత. అమ్మ అనే కాదు మనకుటుంబంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి బలహీనతలని లోపాలను కుటుంబసభ్యులే అర్ధంచేసుకుని అవహేళన చేయకుండా వాళ్ళు వాటిని అధిగమించడానికి ఆసరా ఇవ్వాలి అంటూ కుటుంబ బాధ్యతని మరోసారి గుర్తుచేసే చిత్రమే ఇంగ్లీష్ వింగ్లీష్. 

శశి(శ్రీదేవి) ఒక సాధారణ గృహిణి, వంట అద్భుతంగా చేయగలదు రుచికరమైన మోతీచూర్ లడ్డూలు తయారుచేయడం తన ప్రత్యేకత. ఇంటెడు చాకిరీ చక్కబెట్టుకోవడమే కాక ఆర్డర్ పై పెళ్లిళ్లకీ శుభకార్యాలకీ లడ్డూలు తయారుచేసి సప్లై చేస్తుంటుంది. ఐతే తనకున్న ఒకే ఒక లోపం(??) ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోవడం. అసలే తనకి ఇంగ్లీష్ రాదనే ఆత్మన్యూనతతో ఉన్న శశి లోని ఈ లోపాన్ని తరచుగా ఎత్తిచూపుతూ 7th చదువుతున్న తన కూతురు స్వప్న, భర్త సతీష్(ఆదిల్) అవహేళన చేస్తుంటారు. తన అత్తగారి నుండి, చిన్నకొడుకు సాగర్ నుండి తనకి కాస్త ఊరట లభిస్తుంది. ఇలాంటి తరుణంలో శశి తన అక్క కూతురి పెళ్ళికోసమని ఒక నెలరోజులపాటు ఒంటరిగా అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. తనకుటుంబం అమెరికా వచ్చేలోపు అక్కడ దొరికిన ఖాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంది అనేది మిగతాకథ. కథకన్నా కథనానికి ప్రాముఖ్యతనిచ్చిన చిత్రం ఇది. 

బాలనటిగా సినీరంగప్రవేశం చేసిన శ్రీదేవి మనం శ్వాసించినంత సులభంగా నటించేస్తుంది అనడం అతిశయోక్తికాదేమో. అలాటి శ్రీదేవి పదిహేనేళ్ళ విరామానంతరం పునఃప్రవేశానికి సరైన చిత్రమెన్నుకుందని చెప్పచ్చు. డ్యూయెట్లు డాన్సులు రొమాన్సు చేస్తూ మెప్పించాలని తాపత్రయపడకుండా తన వయసుకు తగిన, నటనకు ఆస్కారమున్న పాత్రను ఎన్నుకోవడంతోనే సగం విజయం సాధించింది. శశి పాత్ర ఎదుర్కుంటున్న సమస్య మాములుగా చూస్తే చాలాచిన్నది ఇతరులకి అసలు ఒక సమస్యగానే అనిపించదు కానీ అది అనుభవించేవాళ్ళని మాత్రం చాలా బాధపెడుతుంది. అలాంటి సున్నితమైన బాధను చిన్న చిన్న విజయాలు సాధించినపుడు ఆ ఆనందాన్ని తన కళ్ళలో తనముఖంలో పలికించడంలో వందశాతం విజయం సాధించింది. శ్రీదేవి ఆ పాత్రను అలవోకగా పోషించిన తీరు చాలామందిగృహిణులు తమను తాము ఐడింటిఫై చేసుకోగలిగేలా ఉండి ఆకట్టుకుంటుంది. అలాగే ఆయా సన్నివేశాలలో నేపధ్యసంగీతం పోషించిన పాత్రకూడా మరువలేనిది. 

కాకపోతే ఇన్నేళ్ళగా ఒక కలలరాణిగా చూడడం అలవాటైన శ్రీదేవిని ఒక్కసారిగా అలా వయసుమీదపడి సన్నగా చూడడం కాస్త ఇబ్బందిపెడుతుంది ముఖ్యంగా కొన్ని క్లోజప్ షాట్స్ లోనూ కొన్ని expressions లోనూ ఈతేడా బాగా తెలుస్తుంది. ఐతే శరీరమంతా ఎంత మారినా తనకళ్ళలో మాత్రం ఏమార్పు రాలేదు అనిపించింది అంతేకాక సినిమాలో మనకి శ్రీదేవికన్నా శశి ఎక్కువకనబడడంతో కలలరాణిగా కాక ఒక అమ్మగా చూడటానికి అలవాటుపడి ఈ తేడా మనల్ని ఎక్కువ ఇబ్బందిపెట్టదు. సినిమాకి వచ్చిన ప్రేక్షకులు ఓపెనింగ్ షాట్ లోనూ మైఖేల్ జాక్సన్ స్టెప్ వేసినపుడూ, క్లైమాక్స్ లోనూ ఒక మాస్ హీరో సినిమాకి రెస్పాండ్ ఐనట్లుగా ఈలలు చప్పట్లు కేరింతలతో రెస్పాండ్ అవడం ఆనందాన్నిచ్చింది. ఇప్పుడే ఇంత క్రేజ్ ఉంటే ఒకప్పుడు శ్రీదేవి వల్ల సినిమాలు ఆడాయి అంటే ఎందుకు ఆడవు మరి అనుకుని నవ్వుకున్నాను :-)
  
మిగిలిన పాత్రధారులలో శ్రీదేవిని సరిగా అర్ధంచేసుకునే అక్క కూతురు పాత్రలో ప్రియా ఆనంద్ నన్ను బాగా ఆకట్టుకుంది కళ్ళతో భావాలు పలికించడానికి శ్రీదేవితో పోటీపడి ప్రయత్నించింది. ఇంక శశి చిన్నకొడుకు సాగర్ పాత్రలో నటించిన చిన్నపిల్లాడు భలే నచ్చాడు వాడికి మంచి భవిష్యత్తుందనిపించింది. శ్రీదేవి క్లాస్మేట్ ఫ్రెంచ్ షెఫ్ పాత్రపోషించిన నటుడుకూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాడు. ఇతరులంతా తమతమ పాత్రల పరిధిమేరకు కరెక్ట్ గా సరిపోయారు. చిత్రానికి నేపధ్య సంగీతం సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా అమరాయి. పంచ్ లైన్స్ గురించి ఆలోచించకుండా చక్కని సంభాషణలు అందించారు, "ఆడది వంటచేస్తే బాధ్యత, మగాడు వంటచేస్తే కళ", "నా ఫేవరెట్ సబ్జెక్ట్ లో ఫెయిలై ఇతర సబ్జెక్ట్ లో పాసయి ఏం లాభం" లాంటి లైన్స్ ఇంకా శ్రీదేవి క్లైమాక్స్ స్పీచ్, సినిమా మొదటిసగంలో శ్రీదేవికి తెలియని భాషని నేర్చుకొని మాట్లాడడం గురించి అజిత్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఇది దర్శకురాలి సినిమా,  కథ పెద్దగా లేకపోయినా కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడంలో గౌరీషిండే విజయం సాధించారు. తనపై అంచనాలు పెరిగాయి. అలాగే రెండుగంటల నిడివి సైతం సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోడానికి దోహదం చేసింది. కుటుంబంతో కలిసి తప్పకుండా చూడవలసిన చిత్రం “ఇంగ్లీష్ వింగ్లీష్” మిస్ అవకండి.

22 వ్యాఖ్యలు:

 1. సమీక్ష బావుంది వేణూ గారు
  కథ పెద్దగా లేకపోయినా కథనాన్ని ఆసక్తికరంగా రాసుకోవడంలో గౌరీషిండే విజయం సాధించారు
  True :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చూడాల్సిందేనండి,ఇక... చక్కగా రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "ముఝే ప్యార్ కీ కోయీ కమీ నహీ...కమీ హై తో సిర్ఫ్ థోడీ ఇజ్జత్ కీ.." అన్న డైలాగ్ నాకు బాగా నచ్చిందండీ. ఈ పాయింట్ బాగా నచ్చింది. ఇంచుమించు ఇవే భావాలండి నావి కూడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచి రివ్యూ అండీ.. రివ్యూకన్నా ముందు మొదట రాసిన పేరాలు ఆలోచింపజేసేలా ఉన్నాయ్.

  నా ఫీలింగ్ ఏంటంటే..తప్పకుండా చూడాల్సిన సినిమాలకి మీరూ, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడకూడని సినిమాలకి నేనూ రివ్యూలు రాయాలి అని ;)

  తప్పకుండా చూడ్డానికి ట్రై చేస్తాను

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రివ్యూ చాలా బాగుందండీ.. రివ్యూ మొదలుపెట్టడానికి ముందు చెప్పిన మాటలు కూడా చాలా నచ్చాయి సార్.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మ గురించి మీరు చేసిన అబ్జర్వేషన్ బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. హరేకృష్ణ, ద ట్రీ గారు, శ్రావ్య, శుభ గారు, కిషోర్ వర్మగారు ధాంక్స్ ఫర్ ద కామెంట్.

  థాంక్స్ తృష్ణగారు సినిమా ఎసెన్స్ అంతా ఆ ఒక్క డైలాగ్ లోనే ఉందండి. నిజమే నాకు కూడా బాగానచ్చింది.

  థాంక్స్ రాజ్ :) హహహ ఈ ఐడియా బాగుంది :) కానీ ఎవరి శైలి వారిదేకదా నువ్వు ఇలాంటి సినిమాలకి కూడా రివ్యూలు రాయాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Sounds interesting! నాకెందుకో శోభన Mitr - My friend సినిమా గుర్తొచ్చింది వేణూ ఈ రివ్యూ చదివాక.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీరివ్యూ బాగుంది. చాన్నాళ్ళ క్రితం ఒక కధ చదివానండీ ఈనాడు ఆదివారంలో. కధంతా తండ్రి తమను ఎన్ని కష్టాలు పడి పెంచాడో అన్నవిషయాలతో నిండి ఉంటుంది. కధ చివర్లో తండ్రి చనిపోయాక కొడుకులూ, కోడళ్ళూ అందరూ కూర్చొని తండ్రి గురించి నాలుగు మాట్లాడుకోవాలని ప్రయత్నిస్తే అన్ని తమకు చేసిన సేవలే గుర్తొస్తాయిగానీ, నాన్నది ఏఊరు. ఆయ స్నేహితులెవరు, బంధువులెవరు అన్న చిన్న విషయాలు కూడా ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా వాళ్ళకి అంతుచిక్కవు. ఆయన మనకోసం అంతకష్టపడుతుంటే మనం ఆకష్టాన్ని ఎంత taken for grantedగా తీసుకున్నామో కదా, కనీసం ఆయన గురించి, ఆయన జ్ఞాపకాలుపంచుకోవడం గురించి ఆలోచించనుకూడా ఆలోచించలేకపోయాంకదా అని బాధపడతారు చివరకు. ఆకధ గుర్తొచ్చింది.

  అమ్మప్రేమనైతే ఇహ చెప్పఖ్ఖర్లేదు. చాలామంది తమకు అమ్మపై ప్రేమను వ్యక్తీకరించే తీరు dominatingగా కూడా ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ రివ్యూ చాలా బాగుందండీ! సినిమా తప్పకుండా చూడాలనిపిస్తోంది, కానీ మంచి ప్రింటు వచ్చి ఆన్లైన్ లో పెట్టేసరికి ఎన్నాళ్ళు పడుతుందో??
  "భార్య ఎంత చదువుకున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా నీకేం తెలియదు నోర్మూసుకో అనే నాన్నలనే ఎక్కువ చూశాం" నిజ్జం!

  ప్రత్యుత్తరంతొలగించు
 11. థ్యాంక్స్ మధుర, అవును నిజమే ఈ సినిమా చూస్తున్నపుడు మొదటిలో ముఖ్యంగా తల్లీ కూతుళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వలన నాకు కూడా మిత్ర్ గుర్తొచ్చింది. పై రివ్యూలో ఈ పాయింట్ హలైట్ చేయడంవల్ల నీకు కూడా అలా అనిపించి ఉండచ్చు. ఈరెండు పాత్రలకి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మిత్ర్ లో హీరోయిన్ కి క్లారిటీ మిస్సింగ్ అనిపిస్తుంది. కానీ శశికి స్పష్టంగా తెలుసు తనకి కావలసింది కాసింత గౌరవ మర్యాదలేకాని ప్రేమ కాదని. అలాగే అక్కడ తను మరొక మనిషి ఆసరా కోసం చూసింది కానీ శశి అలాకాదు తనవాళ్ళనుండే ఆ గౌరవమర్యాదలని గెలుచుకోడానికి ఏం చేయాలో ఆలోచించి అదే చేసింది.

  ఇండియన్ మినర్వాగారు ధన్యవాదాలండీ... మీరు చెప్పిన కథ చాలా బాగుంది. అది నిజంగా ఫాక్ట్ కూడా, మనం చిన్నప్పటినుండి మన అమ్మనాన్న మనమీదున్న ప్రేమాతిశయంతో మనగురించే తప్ప వాళ్ళగురించి పట్టించుకోవడం మానేస్తారు, మనము కూడా ఆలోచించగల ఏ కొద్దిమందో తప్ప అదే ట్రెండ్ ఫాలో అయిపోతుంటాము.

  శైలబాల గారు, రసజ్ఞ గారు ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నేను కూడా సినిమా చూశానండీ..చాలా బాగుంది. చివర్లో శ్రీదేవి మే ఐ.. అని మొదలు పెట్టి చెప్పే మాటలు చాలా బాగుంటాయి..nice review

  ప్రత్యుత్తరంతొలగించు
 13. థ్యాంక్స్ గిరీష్.. అవును ఆ స్పీచ్ చాలాబాగా రాసుకున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. వంశీకృష్ణ గారు, రీలోడ్ చేసి పేజ్ పూర్తిగా లోడ్ అయ్యే వరకూ వేచి చూసి ప్రయత్నించండి. ఇమేజ్ వల్ల ఇబ్బంది రాదు. కంటెంట్ బాక్ గ్రౌండ్ అంతా వైట్ ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. వంశీకృష్ణ గారు మీకు ఇంకా సమస్య తీరకపోతే అడ్రస్ బార్ లో ఉన్న URL చివర ?m=1 చేర్చి రీలోడ్ చేయండి ఉదాహరణకి ఇలా http://venusrikanth.blogspot.in/2012/10/enlish-vingli.html?m=1 అప్పుడు మొబైల్ వర్షన్ లోడ్ అవుతుంది. స్లో కనెక్షన్ కి అది సులువుగా ఓపెన్ అవుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ప్రోమోస్ చూసినప్పుడే అనిపించేదిఈ సినిమా బాగుంటుందని.మీ రివ్యూ చాలా బాగుందండి..ఇప్పుడే చూడాలనిపించేలాగా ఉంది.కానీ మా ఊరి ధియేటర్కి (మా పక్క ఊరికి)హిందీ సినిమాలు రావు.ఎప్పుడో టి.వి లో వేసినప్పుడే చూడాలి ప్చ్!!

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ధన్యవాదాలు రాధిక గారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కూడా బాగానే ఉందండీ. అది వచ్చినా కూడా వదలకండి మంచి సినిమా.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.