గురువారం, జనవరి 28, 2010

తన దాకా వస్తే !!

అవి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతూ ఇండస్ట్రియల్ టూర్ పేరుతో దేశాటన చేస్తున్న రోజులు. ఓ డిశంబరు తెల్లవారు ఝామున డిల్లీలో మంచుకు వణుకుతూనే ఆగ్రా వెళ్ళడానికి గాను అందరం టూరిస్ట్ బస్సు ఎక్కాం. మేమేదో ముందు వచ్చాం అని సంబరపడిపోయాం కానీ ఆ సరికే ముందు సీట్లు ఆక్రమించిన వారిని చూసి నిరాశగా చివరి సీట్లలో కూర్చున్నాం. నాది క్లాసులో అయినా బస్సులో అయినా చివరి సీటే కనుక లాస్ట్ ఐదు సీట్ల వరుసలో ఓ పక్కగా సర్దుకున్నాను. నా ముందు సీట్ లో ఒకడు నిర్మొహమాటంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ప్రశాంతమైన ఉదయపు తాజాదనాన్ని హరిస్తూ మనవాడు యధేచ్చగా బస్సంతా సిగరెట్ పొగ తో  నింపేస్తున్నాడు, అసలే చలికి కిటికీ తలుపులు మూసి ఉన్నాయేమో మా అందరికీ మరింత చిరాకు వచ్చింది. అంతలో మాలోనే ఒకడికి మరీ ఒళ్ళుమండి ఆవేశంగా లేచి "you are not supposed to smoke inside the bus" అని అంటూ చాలా కరుకుగా చెప్పాడు. అతను ఓ క్షణం అవాక్కై నువ్వు అంతలా అరవడం ఏమీ బాలేదు బాసు మెల్లగా చెప్పి ఉండాల్సింది అని సిగరెట్ బయట పారేశాడు.

ఇక మాకు మాట్లాడుకోడానికి ఒక టాపిక్ దొరికింది, మనిషిని చూస్తే చదువుకున్న వాడిలాగే కనపడుతున్నాడు కానీ పక్కా నార్త్ ఇండియన్ ఫేస్ కట్, బొత్తిగా సౌత్ ఇండియా మొహం కూడా చూసినవాడ్లా కనిపించలేదు. ఇక మేము రెచ్చిపోయి "తప్పేలా మొహం వేస్కుని ఎలా ఉన్నాడో చూడు ఈడి ఎంకమ్మా సిగరెట్ కాల్చింది కాకుండా మెల్లగా చెప్పాలంట" అని మొదలెట్టి, "వాష్ బేసిన్ లో చేపలు పట్టే వాడి మొహం వాడూనూ" అని, "పండు పడేసి తొక్కతినే తిక్క సన్నాసి" అనీ జంధ్యాల గారిని గుర్తు చేసుకుని ఇష్టం వచ్చిన తిట్లన్నీ తిట్టేశాం. ఇంచు మించు వాడ్ని విలన్ గా పెట్టి ఒక సినిమా తీసినంత పని చేశాం. ఒక రెండు గంటలు ఇలా గడిపేశాం, అంటే గుర్తొచ్చినపుడల్లా వీడ్ని తెలుగులో తిడుతూన్నా మిగతా ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంది లెండి.

రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయడం కోసం బస్సు ఒక హోటల్ ముందు ఆపాడు. ఇంతలో మా సిగరెట్ బాబు పక్కనే కూర్చున్న మా క్లాస్మేట్ పరుగున వచ్చి "బాబు అలా రెచ్చిపోతున్నారెంట్రా" అని అడిగాడు మేం వెంటనే "ఏమైంది బాసు వాడికెలాగు తెలుగు రాదుగా" అని ధీమా వ్యక్తం చేశాం. దానికి మావాడు "ఆయన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ట్రాన్సిలేటర్ గా పని చేస్తాడుట ఒక ఇరవై భాషల వరకూ వచ్చని చెప్పాడు నాతో చక్కగా తెలుగులో మాట్లాడాడు, మీ మాటలు స్పష్టంగా అర్ధమై నవ్వుకుంటున్నాడు.." అని బాంబు పేల్చాడు. మేం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని ఒక్క క్షణం ఖంగుతిన్నా, పోన్లే ఈ వయసులో కాకపోతే ఇంకెపుడు చేస్తాం అల్లరి అనుకుని ష్ గప్ చుప్ అని బస్సెక్కేశాం. ఆ తర్వాత బుద్దిగా ఉన్నామని వేరే చెప్పాలా :-)

కట్ చేస్తే (రక్తం వచ్చుద్ది అంటారా, మీరు వి.వి. వినాయక్ సినిమాలు చూట్టం కాస్త తగ్గించాలి మరి :-) మన కథ లో సీన్ కట్ చేస్తే అండీ బాబు. నేను ఇంజనీరింగ్ ముగించుకుని ఉద్యోగ వేటలో పడిన కొత్తలో ఓ ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి ఢిల్లీ వెళ్ళాను. ఇంటర్వ్యూకి సంభందించిన ఙ్ఞాపకాలు మరో టపాలో రాస్తాను. సరే ఇంటర్వ్యూ ముగించుకుని తిరుగు టపాలో రైలెక్కి రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లో ఠీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. ఇంతలో కిటికీ దగ్గరికి ఒక పెద్ద తెలుగు గుంపు వచ్చింది, ట్రైన్ ఎక్కిందేమో ఒక 10th class కుర్రాడు ప్లస్  వాళ్ళ మామ్మ గారు కానీ వచ్చిన బెటాలియన్ మాత్రం ఒక పది మందికి తక్కువ కాకుండా ఉంది. అందులో ఓ ఆంటీ ఉన్నారు ఆవిడ్ని అందరూ భలే చలాకీ అని పొగుడుతుంటారు అనుకుంటా, ఆవిడ ప్రతాపం చూపడానికి నన్ను ఎన్నుకున్నారు. అందరూ తెలుగులో మాట్లాడు కుంటున్నారు.

మరి నేను తెలుగు వాడిలా కనపడలేదో లేకా చుట్టూ ఉన్న జనాన్ని చూసుకుని నేను ఒంటరిగాడ్నికదా ఏం మాట్లాడలేడులే అనుకుందో ఏమో కానీ నన్ను ఒకరేంజిలో ఆడుకోడం మొదలెట్టింది. డ్రెస్సింగ్ నుండి హెయిర్ కట్ వరకూ, తెలుగు వాడై ఉంటాడా, అసలు ఢిల్లీ ఎందుకు వచ్చాడు, ఇక్కడ వాడే అయి ఉంటాడా, మన రైలు ఎందుకు ఎక్కాడో, మనం మాట్లాడేది అర్ధమవుతున్నట్లు లేదులే అనుకుని ఆపై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశారు. కొన్ని కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నా ఇటువంటి పరిస్థితిలో ఎంత ఇబ్బంది గా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది. పోనీ వాళ్ళతో తెలుగులో మాట్లాడుదామా అంటే మొహమాటం. అప్పటి వరకూ భరించాను కదా ఎదవనైపోతానేమో అని జంకు, ఏం చేయాలో తెలియక బూట్లు కేసి చూసుకుంటుంటే తను "ఏంట్రా బూట్లు చూసుకుంటున్నాడు కొత్తగా కొన్నాడేమో ఆహా ఆ చూపు చూడండ్రా.." ఇలాటి కామెంట్లతో తను నన్ను మహా ఇబ్బంది పెట్టేశారంటే నమ్మండి. ఆ క్షణంలో మా అల్లరి గుర్తొచ్చి అంత సహనంగా ఉన్న అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. మేం వాడ్ని తిట్టిన తిట్ల ముందు ఈ కామెంట్లు ఏ మూలకీ రావనుకోండి. మొత్తానికి ఆవిడ్ని అలా సస్పెన్స్ లోనే ఉంచేశాను. తర్వాత ఆ మామ్మ గారితో కుర్రాడితో తెలుగులో మాటాడినపుడు కుర్రాడు సారీ చెప్తే ఇద్దరం నవ్వేసుకున్నాం అనుకోండి.

మొత్తం మీద మన భాష తెలిసి ఉండక పోవచ్చులే అని తప్పుడు అంచనా వేసిన రెండు సంఘటనల్లో నే ఇరుక్కుపోయిన సంధర్భాలు అవీ, మీరూ ఇటువంటి సరదా సంఘటనలు పంచుకోండి.

23 కామెంట్‌లు:

  1. బావుంది. ఇలాటి అనుభవమే నా స్నేహితుడికి డిల్లీ లో ఐంది. బక్రా వాడు కాదు ఒక అమ్మాయి. బస్ లో ఒక అమ్మాయిని మా వాడు ఇంకొంత మంది(తెలుగు లో) తెగ కామెంట్ చేస్తూ ఉన్నారుట. ఆ తరువాత వీళ్ళు ఏదో అడ్రస్ అడిగారుట సరదాగా ఆ అమ్మాయిని, ఆ యమ్మాయి తెలుగులో సమాధానం చెప్పేసరికి ఫ్యూజ్లు ఎగిరి పోయాయి వీళ్ళకి.

    రిప్లయితొలగించండి
  2. అదేం కాదులెండి. ఆంటీ నచ్చేసిందేమో మీకు. అందుకే ఆమె టీజింగ్ కూడా ఎంజాయ్ చేసేశారు ;-)

    రిప్లయితొలగించండి
  3. :-)
    మేము కూడా ఇండస్త్రియల్ టూర్ కి బెంగళూరు, చెన్నై వెళ్ళినప్పుడు బస్ చెన్నై సిటీలో తిరుగుతుంటే మా క్లాస్ అల్లరి బ్యాచ్(మనకంత సీన్ లేదండి..స్వాతిముత్యం కమల్ హాసన్ ఆ టైంలో) రోడ్డు మీద నచ్చిన ప్రతీ అమ్మాయిని తెలుగులో కమెంట్ చేస్తూ, ఒక దగ్గర బొగ్గులాగ ఉన్న ఒకమ్మాయిని ఆమె రంగు గురించి కమెంట్ చేస్తే ఆ అమ్మాయికి తెలుగు అర్ధమై చెప్పు చూపించింది. దాంతో ఆ బ్యాచ్ వాళ్ళను మా క్లాస్ గాళ్స్ తెగ ఆడుకున్నారు.

    రిప్లయితొలగించండి
  4. అబ్బో ఇలాంటి సంఘటనలు నాకు బోలెడు.ఒక సారి సంతోసా అనె ఐలాండ్ లో ఏదో ఫుడ్ కోర్ట్ లో కూర్చున్నాం..నాకు పిజ్జాలు,బర్గర్లు ఎక్కిచావవు ,ఇండియన్ ఫుడ్ ఉందేమో చూడండి అని పదే పదే అడిగి మా ఆయన్ని చిరాకు పెట్టేస్తున్నా..నువ్వు మరీ ఎక్స్ ట్రాలు చెయ్యకు ..ఏం వీళ్ళందరూ తినడం లేదా నోర్మూసుకుని తిను అని ప్రక్కనున్న సౌతాఫ్రికన్ ఫ్యామలీనీ ని చూపిస్తూ విసుకున్నారు..నాకొళ్ళుమండి వాళ్ళ బొంద ,వాళ్ళదీ ఒక తిండేనా ,పచ్చగడ్డి ఫ్రై చేసి ఇచ్చినా ఆహా ఒహో అంటారు ,టేస్ట్ తెలిసి చావదు వెదవలకి అని తిట్టి పడేస్తుంటే అతను నవ్వుతూ మరి అన్నం,కూరా,చారు పరాయి దేశాల్లో దొరకాలి అంటే కష్టం కదమ్మా అన్నాడు ..అంతే నా నోరు మరుసటి రోజు వరకూ మూతపడిపోయింది...వాళ్ళందరూ తెలుగు నచ్చి నేర్చుకున్నారంట..
    మరొక సారి నన్ను క్రికెట్ మేచ్ చూడమని చెప్పి మా ఆయన బయటకు వెళ్ళిపోయారు...మా ప్రక్కనే తెలుగు వాళ్ళు కూర్చున్నారు..నేను అంతకు ముందే గుడికి వెళ్ళి విబూధి అడ్డ బొట్టు పెట్టడం వల్ల తమిళ పొన్నో, కెరళ కుట్టినో అనుకుని మెల్లగా కామెంట్లు మొదలు పెట్టారు..అందులో ఒకడికి డవుటొచ్చినట్లుంది ఆ అమ్మాయికి తెలుగొచ్చేమోరా అన్నాడు ... ఏడ్చింది దాని మొహం చూస్తెనే తెలియడం లేదా విభూది అడ్డంగా పెట్టింది మన తెలుగమ్మాయిలు అలా పెట్టరు ,దీనికి అర్ధం అయ్యేంత సీన్ లేదులే అన్నాడు మరొకడు..సరే చూసాను చూసాను చివరికి ఏం తెలుగమ్మాయిలు విబూధి పెట్టకూడదని ఏమన్నా రూల్ పెట్టారా అన్నాను ..అంతే అయ్యబాబోయ్ చెల్లెమ్మ తెలుగెంత బాగా మాట్లాడేస్తుందో అని సైడయిపోయారు :)

    రిప్లయితొలగించండి
  5. బాగున్నాయి మీ చిలిపితనాలు. మా అక్క ఇక్కడ పార్టీ లో ఒక రోజు పార్టీ మొదలయ్యాక మా దగ్గరకు వచ్చి హడావుడి గా చెప్పింది, ఏమేవ్ మర్చే పోయాను వూరికే వాగకండి ఈ పార్టీలో చిన్న కళ్ళ ఆవిడ ఏం చేస్తోంది అని మీ నోటీ కొచ్చినట్లు, ఆమె నెల్లూరు లో పెరిగిన చైనా ఆమె, వాళ్ళ కుటుంబం మొత్తం డెంటింస్ట్ లు, సుబ్బరం గా తెలుగు మాట్లాడుతుంది అర్ధం అవుతుంది అని మీతోనే నాకు అనుమానం ఏదో ఒకటి వాగుతారని అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. మేము నోరు తెరిచేము, నయమే ముందు చెప్పింది. అందరు తెలుగు వాళ్ళ మధ్య ఆమె చాంగ్ చుంగ చాంగ్ మంటూ తెలుగు లో పలకరిస్తూ తిరుగుత్ంటే నవ్వాపు కోలేక చచ్చాము. అది గుర్తు వచ్చింది మీ కబుర్లు వింటే.

    రిప్లయితొలగించండి
  6. హ్హహ్హ బావున్నాయి కబుర్లు..
    నేను త్రివేండ్రంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది... రోడ్డ్ మీద నడుస్తుంటే, కొంతమంది తెలుగు అబ్బాయిలు నాకు తెలుగు తెలియదు అనుకుని కొంచెం టీజ్ చేశారు.. నేను తెలుగులో సమాధానమిచ్చేసరికి సారీ అంటూ తప్పుకున్నారు.. :)
    ఇంకో సారి బస్ లో వెళుతుంటే, ఒక స్టాప్ లో చాలా అందమైన అమ్మాయి ఎక్కింది.. ఇక అంతే వెనక కూర్చున్న తెలుగు అబ్బాయిలు కామెంట్లు మొదలుపెట్టారు.. ఇక ఆ అమ్మాయి దిగే స్టాప్ వచ్చేసరికి ఒకతను మరీ ఫీల్ అవుతూ వాళ్ళ ఇల్లెక్కడో, ఎలా కలవాలి అంటూ కొంచెం ఆవేశపడ్డాడు.. ఆ అమ్మాయి కూల్ గా వెనక్కి తిరిగి, మా నాన్నగారు DSP .., ఎవరిని అడిగిన అడ్రస్ చెబుతారు, తప్పకుండా ఇంటికి రండి అని చెప్పి దిగిపోయింది. అంతే వాళ్ళకి సౌండ్ ఆఫ్!

    రిప్లయితొలగించండి
  7. ఇలాంటి అనుభవమే మా మిత్రులకు ఢిల్లీలో ఎదురయింది.
    మా మిత్రులు ఢిల్లీకి విహారయాత్రకు వెళ్ళి నగర సంచారం చేస్తూ అదేదో మార్కెట్ కు వెళ్ళారు. ఆక్కడ ఓంకార్ అనే మిత్రుడు ఒక ఎయిర్ గన్ కొన్నాడు. అది పట్టుకొని వస్తుండగా వీళ్ళకు మరో బృందం ఎదురయింది. ఆ బృందంలోని ఒకడు మావాడు పట్టుకొన్న గన్ చూసి వీళ్ళు తెలుగువాళ్ళు కాదనుకొని
    కట్టె తుపాకెత్తుకొని కట్టమీద నడుస్తుంటె
    కాలు జారి పడ్డాడె సోగ్గాడు
    ఆని పాడాడు. మిగతా వాళ్ళంతా నవ్వారు. మా మిత్రుడు వాళ్ళతో "మాఫ్ కీజియే. ఆప్ నే కుచ్ కహా" అన్నాడు. పాట పాడిన వ్యక్తి "జీ నహీ. హం ఆపస్ మె బాత్ కర్ రహెహై. ఆప్ కే బారేమే నహీ" అన్నాడు.
    మావాడు " అలాగా, నన్ను చూస్తే మీకు జగ్గయ్య గుర్తుకు వచ్చాడనుకున్నాం" అన్నాడు. వాళ్ళంతా మొదట తెల్లబోయారు. తర్వాత పరిచయాలు, హోటల్లో కలిసి టీ తాగడాలు, అడ్రసులు ఇచ్చి పుచ్చుకోవడాలు జరిగాయి.
    ఇదెప్పుడో ఇరవై యేళ్ళ క్రితం జరిగినా ఆ పరిచయాలు స్నేహంగా మారి కొనసాగుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  8. @భావన,
    నాకు అదే అనుభవం అదే కుటుంబం తో అయ్యింది, కాకపోతే మీరు చెప్పే ఆవిడ వాళ్ల అబ్బయితోనో, తమ్ముడు తోనో బోస్టన్ లో.

    ఈ చప్పిడి ముక్కు లు ఎక్కడ క ఫోయినా వదలరా లాంటి డవిలాగ్లు వదిలినాక ఆ డెంటిస్ట్ (ఆ కుటుంబలో కనీసం ఓ పది మంది రాక ఉన్నట్లున్నారు) మీది ఒంగోలు అంట కదా, నేను నెల్లొర్ నుండి అప్పుడప్పుడు ఒంగోలు వచే వాడిని అంటూ తెలుగు లో అన్నాడు అప్పటిదాక నావాగుడు విననట్లు.

    నాకు గుర్తుండి ఆ కుటుంబం అంతా ఎక్కువ క్యాలిఫోరినియా లో సెట్టిల్ అయినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
  9. మీ టపా, వ్యాఖ్యలు ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయండి..

    రిప్లయితొలగించండి
  10. మీ టపా బావుంది సరదాగా అనుకుంటే మిగతావారి అనుభవాలు మరీ సరదాగా ఉన్నాయి :)

    రిప్లయితొలగించండి
  11. సరదాగా ఉన్నాయి అందరి అనుభవాలూను:)
    నాకేమో reverse...మా హాస్టల్ లో room mates ఇద్దరూ మళయాళం వాళ్ళే..నేను కూడా అనుకుని,tea break time లో ఓ పది మంది కూర్చుని మళయాళం లో ఇరగదీసేశారు...నేను తెల్ల మొహం వేసి అందరినీ గమనిస్తూ కూర్చున్నాను....[మనసులో మనసిలాఇల్లా అనుకుంటూ ;) ]

    రిప్లయితొలగించండి
  12. మొత్తానికి భలే వుందండీ మీ ఎక్స్పీరియన్స్. అన్నట్టు మీ టపాకి వచ్చిన వ్యాఖ్యలు ఇంకా భలేగా ఉన్నాయండీ.

    రిప్లయితొలగించండి
  13. అవునా కృష్ణ గారు. మా పార్టీ బోస్టన్ అంటే బోస్టన్ సబ్ అర్బ్స్ ఏండోవర్ లో. ఆమె ప్రాక్టీస్ కూడా పక్క టౌన్ ఏ. పాపం మీరు. మిమ్ములను ఎవ్వరు హెచ్చరించ లేదన్నమాట.

    రిప్లయితొలగించండి
  14. మీ టపా, అలాగే వ్యాఖ్యలు రెండూ బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  15. అయితే ఇలాంటి అనుభవాలు అందరికీ ఉన్నాయన్నమాట. బావుంది

    ఒకసారి ఊటీ వెళ్ళినపుడు అక్కడ బొటానికల్ గార్డెన్లో మా వారు పాప దూరంగా ఫొటోలు తీసుకుంటున్నారు. నా పక్కనే కొత్తగా పెళ్ళైన తెలుగు దంపతులు వాళ్ల చిలిపి ప్రణయ కలహాలతో నన్ను తెగ ఇబ్బంది పెట్టేశారు. అక్కడినుంచి అర్జెంట్ గా పారిపోయాను.

    తర్వాత వాళ్ళు మా హోటల్లోనే పరిచయమై నేను తెలుగని తెలుసుకుని ముందు తెల్లబోయి, తర్వాత సిగ్గుపడిపోయారు."మీరు నార్త్ ఇండియన్ అనుకున్నామండీ" అన్నారు.చాలా మంది నన్ను చూసి ఇలాగే అనుకుంటారు ఎందుకో మరి!

    రిప్లయితొలగించండి
  16. వాసు గారు నెనర్లు, మీ నేస్తం అనుభవం బాగుంది. మరే మనకి ఫ్యూజ్ లు ఎగిరిపోయినా తట్టుకోగలం పాపం వాళ్ళకి కష్టమే.

    అబ్రకదబ్ర గారు నెనర్లు, అదేమీ లేదండీ బాబు "స్థాన బలిమి కాని తన బలిమి కాదయా" అన్న పద్యం గుర్తొచ్చి ఆగిపోయాను,

    శేఖర్ గారు నెనర్లు. హ హ పాపం బకరా దొరికింది అనుకుని వాళ్ళే బకరాలయ్యారనమాట మీ అల్లరి బ్యాచ్

    గణేష్ గారు నెనర్లు, ^c & ^v my reply to Abrakadabra!! :-)

    పద్మార్పిత గారు నెనర్లు.

    నేస్తం నెనర్లు, మీ టపాలలాగే మీరు తలుచుకున్న సంఘటనలు భలే ఉన్నాయ్ :) హ హ "చెల్లెమ్మ తెలుగెంత బాగా మాట్లాడేస్తుందో" సూపరు.

    భావన గారు నెనర్లు. వావ్ చైనీస్ తెలుగు నేను ఎప్పుడూ వినలేదు సుమండీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    మేధ గారు నెనర్లు. మరే ఈ సారీ ఒకటుంది కదండీ మరీ సులభంగా తప్పించుకోడానికి. హ హ DSP గారి కూతురు మంచి ట్విస్ట్ ఇచ్చారు సుమండీ.

    శంకరయ్య గారు నెనర్లు. హ హ మీరు పంచుకున్న సంఘటన చాలా బాగుంది థ్యాంక్యూ.

    రిప్లయితొలగించండి
  17. కృష్ణ గారు నెనర్లు. హ హ చప్పిడి ముక్కులు వీళ్ళని చూడగానే మొదట మెదిలే ఆలోచన అదే కదా :-)

    మురళి గారు నెనర్లు

    పరిమళం గారు నెనర్లు

    నేను గారు నెనర్లు. పాపం మెజారిటీ వాళ్ళదే అవడం తో తెల్లమొహమే దిక్కయిందనమాట :-)

    స్వాతి గారు నెనర్లు.

    ఊకదంపుడు గారు నెనర్లు.

    నాగప్రసాద్ గారు నెనర్లు.

    సుజాత గారు నెనర్లు, హ హ పాపం తెలిసిన తర్వాత వాళ్ళ ఇబ్బందిని తలుచుకుంటే నవ్వూ జాలి కలిపి వస్తున్నాయి.

    మీకు మీ స్నేహితులకు ఎదురైన సంఘటనలు ఈ టపాలో కామెంట్ల ద్వారా అందరితో పంచుకున్న ప్రతి ఒక్కరికీ మరో సారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. ఇలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉంటాయేమో!

    ఒకసారి నేను, ఇంకొంత మంది కొల్లీగ్స్ కలిసి హోల్లాండ్ వెళ్ళాము ఆఫీసు పని మీద. మా మేనేజర్ కుడా మాతో ఉన్నారు. అతను కాస్త సరదా మనిషి. ఒకరోజు అక్కడ బస్సు లో ప్రయాణం చేస్తుంటే... ఒక స్టాప్ లో ఇద్దరు ఇండియన్ అబ్బాయిలు ఎక్కారు. నేను వాళ్ళని చూసి "బాగున్నారు" కదా అన్నాను. అంతే! ఇంకా మొదలు పెట్టారు... అతను బాగున్నాడ? ఇతను బాగున్నాడా? వెళ్లి మాటల్దమంతావ? హైట్ సరిపోతుందా మరి నీకు... అంటూ ఆపకుండా మేము బస్సు దిగే వరకు ఏదో ఒకటి ఎదిపిస్తూనే ఉన్నారు. నాకేమో ఇబ్బందిగా అనిపించింది... పొరపాటున వాళ్ళు తెలుగు వాళ్ళైతే! ఆపండి బాబోయ్ అని మొత్తుకున్నాను. దానికి మా మేనేజర్ ఏమో... పర్లేదులే... వాళ్ళని మనమేమైన మళ్లీ కలుస్తామా ఏంటి అని తేలిగ్గా తీసిపారేశారు. నాలుగు రోజుల తర్వాత అదే బస్సు లో ఒకరోజు నేను, ఇంకో కొల్లీగ్ వెళ్తుంటే ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా ఎక్కారు అదే బస్సు ఒక స్టాప్ లో. అంతే వాళ్ళని చూడగానే నాకైతే మాట రాలేదు. వాళ్ళే వచ్చి పలకరించారు. మాట్లాడారు.
    !!

    రిప్లయితొలగించండి
  19. ఇటువంటి అనుభవాలు చాలా మంధికి వుండే వుంటాయి. అవతలి వారికి మన బాష రాదు అనుకున్నప్పడు మనలో వుండే చిలిపితనం కొంటెతనం అప్రయత్నంగా తొంగి చూస్తాయనుకుంటా. మేం షోలాపూర్ టూర్ కి వెల్లినపుదు మా వాల్లు కూడా ఇలాగే అక్కడి అమ్మాయిల్ని చూసి రెచ్చి పొయ్యారు. పాపం అందులో ఎవరికైనా మన భాష వచ్చో లేదో మరి. ఇప్పటికీ మా కార్యాలయానికి చాలా దేశాల నుండి అతిదులు వస్తూ ఉంటారు. అక్కడక్కడా వారి గురించి కొన్ని కామెంట్స్ వినపడతునే వుంటాయి. మీ టపా చూస్తే అవన్నీ గుర్తుకొచ్చాయి

    రిప్లయితొలగించండి
  20. చైతన్య గారు నెనర్లు. హ హ మీ మేనేజర్ లాంటి వారితో ఒకో సారి సరదాగా బానే ఉంటుంది కానీ శృతిమించినపుడు చాలా విసుగొస్తుంది.. నేనూ ఒకటి రెండు సార్లు ఇటువంటి వారితో ఇబ్బందులు పడ్డాను.

    రాజు గారు నెనర్లు, హ హ మరే మా బాగా చెప్పారు భాషతెలీదేమో అనిపించగానే చిలిపితనం తొంగి చూస్తుంది. అందుకేనేమో అంటారు "అవకాశం దొరికే వరకూ అందరూ మంచివాళ్ళే" అని :)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.