సోమవారం, సెప్టెంబర్ 29, 2008

ఫిల్టర్ కాఫీ / కాఫీ ఫిల్టర్

శీర్షిక చూసి ఇదేదో మంచి కాఫీ లాంటి టపా చదువుదాం అని వస్తే, మీరు తప్పులో కాలేసినట్లే ముందే హెచ్చరిస్తున్నా కాబట్టి చదివి మీరు తెచ్చుకునే తలనొప్పులకు ఇక నా పూచీ ఏం లేదు (నా లాంటి కాఫీ ప్రియులకి తలనొప్పి కూడా ఒకందుకు మంచిదే!! మరి ఎంచక్కా ఆ వంకతో ఇంకో కప్పు కాఫీ ఎక్కువ తాగేయచ్చు కదా:-). సరే ఏదో ఊసు పోక ఈ రోజు ఉదయం నే చేసిన సాహసం గురించి సరదాగా వ్రాద్దాం అని కూర్చున్నా సో తీరిక ఉంటే చదవండి.

నేను ఇండియా వెళ్ళినప్పుడు చెన్నై అయితే వెళ్ళాను కానీ చాలా బిజీ స్కెడ్యూల్ అవడం వల్ల శరవణ భవన్ లో ఫిల్టర్ కాఫీ తాగే అవకాశం దొరక లేదు. కానీ అక్కడ ఉన్నంత సేపూ తలచుకుంటూనే ఉన్నా. అక్కడ నుండి గుంటూర్ వచ్చాక ఈ సారి తీసుకు వెళ్ళాల్సిన వాటిలో కాఫీ ఫిల్టర్ మర్చిపోకుండా చేర్చమ్మా అని చెప్పా. దాందేముంది రా మన ఇంట్లో ఉన్నది ఎలాగు వాడటం లేదు అది ఇప్పుడే సూట్కేస్ లో పెట్టేసుకో అని అమ్మ ఇచ్చేసింది. మా ఇంట్లో అందరూ టీ ప్రియులు లెండి నేను ఒక్కడ్నే కాఫీ కి అంకితమయ్యా... మొత్తం మీద అలా మర్చిపోకుండా తీసుకు వచ్చిన ఫిల్టర్ ని వాడటానికి ఈ రోజే తీరిక దొరికింది.

ఎలా వాడాలి అనే బేసిక్ ట్రైనింగ్ టెలిపోన్ లో అల్రెడీ ఓ నేస్తం దగ్గర తీసుకుని ఉండటం తో "జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదు రా... " అనుకుంటూ మొదలు పెట్టాను. ముందు నీళ్ళు మైక్రోవేవ్ లో వేడి చేయాలి దానికోసం ఒక ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్ళు పోసి ఓ ప్లాస్టిక్ స్పూన్ వేసి ఓవెన్ లో పెట్టా (మైక్రో వేవ్ ఓవెన్ లో నీళ్ళు యధాతధం గా వేడి చేయకూడదు ఓ స్పూనో స్టిర్రరో వేసి చేయాలి అని వీడియోలతో మరీ చెప్పారు కదా అది వంట పట్టించుకున్నా లెండి అందుకే ముందు జాగ్రత్త) కానీ ఓ 3 నిముషాలు ఆగి చూస్తే ఆ స్పూన్ కాస్తా వంగి పోయి ఉంది.

హతవిధీ ఆదిలోనే హంసపాదా అనుకుని సరే ఆ వంగిన ప్లాస్టిక్ స్పూన్ కరిగి పోయి ఏ కెమికల్స్ నీళ్ళలో కలిసి ఉంటాయో అని అనుమానం వచ్చి అవన్ని పడేసి ఈ సారి పింగాణీ కప్ దాన్లోకి ఒక స్ట్రాంగ్ స్పూన్ పడేసి కాసింత తక్కువ టైం వేడి చేసా. నీళ్ళు వేడయ్యే సరికి ఫిల్టర్ లో ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసి దాని పైన రెండో
ఫిల్టర్ పెట్టి రెడీ చేసి, ఆ వేడి నీళ్ళు ఫిల్టర్ లో పోసి మూత పెట్టేసా. ఇక అక్కడ నుండి మొదలు నా కష్టాలు.

ఫిల్టర్ అంతా స్టీల్ అదీ కాక Airtight ఎక్కడ ముట్టుకున్నా కాలి పోతుంది కనీసం ఒక పక్కకి జరపడానికి కూడా లేదు. పొనీ హేండిల్ ఏమన్నా ఇచ్చాడా అంటే అదీ లేదు ముందు ఇది ఇలా డిజైన్ చేసిన వాడ్ని తన్నాలి అనుకున్నా పోని చల్ల బడే వరకు ఆగుదాం అంటే మనకి ఆత్రం ఆగి చావదు. ఏదైనా గుడ్డ తోనో లేదా పేపర్ టవల్ తోనో ట్రై చేద్దాం అంటే ముందు గ్రిప్ దొరకడం లేదు దానికి తోడు మొత్తం Airtight అవడం వల్లనేమో రెండు కంపార్ట్మెంట్ లు పైన మూత అన్నీ బిగుసుకు పోయి కదిలి చావడం లేదు, లోపలేం జరుగుతుందో తెలీడం లేదు.

ఓ రెండు నిముషాల పాటు "బావగారు బాగున్నారా" సినిమాలో శ్రీహరి సీసా మూత తీయడానికి చేసే ప్రయత్నం గుర్తు చేసుకోండి ఇంచు మించు అదే రేంజ్ లో తిప్పలు పడ్డా... మరో రెండు నిముషాలు "తమ్ముడు" సినిమాలో అవధాన్లు మాష్టారి దుష్యంతుడు పాఠం గుర్తొచ్చింది. బాణం గాట్టిగా లాగాడు... రాలా !!... మళ్ళీ లాగాడు...బాణం లో నుంచి చెయ్యొచ్చింది కాని బాణం రాలా!!.. అదే టైప్ లో గాట్టిగా లాగాను కానీ చేయి జారిపోయింది కానీ మూత రాలేదు కింద కంపార్ట్మెంటూ రాలేదు !! అలా ఓ అయిదు నిముషాలు కుస్తీ పట్టాక వేసుకున్న
టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ హఠాత్తు గా ఊడి వచ్చేసింది.

అయ్యో రామా మొత్తం అంతా ఒలికి పోయిందా మళ్ళీ పెట్టాలా అనుకుని చూస్తే ఏదో కాస్త షర్ట్ మీదా నేల మీద కిచెన్ టాప్ మీదా చిందిందనే కానీ మళ్ళీ చేయాల్సిన అవసరం రాలేదు, బ్రతుకు జేవుడా అనుకుంటూ
అవన్ని క్లీన్ చేసి, 3 వంతులు పాలు ఓ వంతు డికాక్షను కలిపి కాసింత చక్కెర వేసి మళ్ళీ కాసేపు వేడి చేసి. చివరగా కాఫీని మంచి నురగ వచ్చేలా స్టీల్ గ్లాస్ లోకి ఇంకో కప్ తోటి తిరగ కొట్టి వేడి వేడి ఫిల్టర్ కాఫీ ని ఆస్వాదించేసా. ఈ చివర తిరగకొట్టడం అనబడు ఘట్టం అతిముఖ్యం స్పూన్ తో తిప్పినా Ikea లో దొరికే Milk frother లాంటి టూల్స్ వాడినా ఇలా ఒక కప్ నుండి ఇంకో కప్ లోకి తిరగ కొడితే వచ్చే టేస్ట్ కానీ అలాంటి నురగ కానీ రాదు.

నే తెచ్చిన కాఫీ ఫిల్టర్ & నే చేసిన ఫిల్టర్ కాఫీ

ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎంత కష్ట పడైనా ఫిల్టర్ కాఫీ నే మళ్ళీ
తాగాలనిపిస్తుంది కాని ఇంచు మించు సరి సాటి అని చెప్పుకునే ఇన్స్టంట్ జోలికి ఇక వెళ్ళ బుద్ది కావడం లేదంటే నమ్మండీ. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ స్టీల్ కి కాఫీ కి ఏదో కనెక్షన్ ఉండీ ఉంటుంది. అరిటాకులో వేసి ఇచ్చిన వేడి వేడి పెసరట్టు అరిటాకు రసం పీల్చి మరింత రుచి గా తయారయినట్లు స్టిల్ ఫిల్టర్ లో, స్టీల్ గ్లాస్ ల్లో ఏదో ప్రత్యేకమైన రుచి ని సంతరించుకుంటుంది మన కాఫీ. ఇది వరకు ఇక్కడి electric coffee maker లో చేసిన ఫిల్టర్ కాఫీ ఇంత రుచి గా లేకపోడమే అందుకు నిదర్శనం.

సో అదనమాట నా ఫిల్టర్ కాఫీ కధ, ఇంకెందుకాలశ్యం వెళ్ళి ఓ మంచి ఫిల్టర్ కాఫీ తాగేయండి.

మళ్ళీ మరో టపా లో కలుద్దాం శలవ్.

28 కామెంట్‌లు:

  1. బావుంది మీ ఫిల్టర్‌కాఫీ తయారీ.

    రిప్లయితొలగించండి
  2. హమ్మ..ఇలాంటి పోస్టుకూడా ఒకటిరాయొచ్చన్నమాట! అదీ ఇంత ఆసక్తికరంగా. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  3. marI filter coffee ni pogidEstunnAru....
    naaku kaapi ayithe caalu..:D

    రిప్లయితొలగించండి
  4. "మంచి కాఫీ లాంటి పోస్టు" అని అనను--ఎందుకంటే నాకు కాఫీ రుచి తెలియదు కాబట్టి!

    వేసుకున్న టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ హఠాత్తుగా ఊడి వచ్చేసింది--హ.. హ... హ.. నాకు రాజేంద్రప్రసాదు గుర్తుకొచ్చాడు.

    రిప్లయితొలగించండి
  5. బాగుంది.

    సరదాగా....ఒక నెల తరువాత అడుగుతా మీరు ఇంకా ఆ కాఫి ఫిల్టర్ ని వాడుతున్నారా లేదా అని. అప్పటికి మీరింకా వాడుతున్నారనుకొండి, అప్పుడు మీరు నిజంగానే నికార్సయిన కాఫి ప్రియుల కింద లెక్క.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది కాఫీ టపా! ఇవ్వాళ కాఫీ గురించి ఇది మూడవ టపా!

    తొందరగా కలవండి కొత్త టపాతో.. నా కాఫీ తాగడం అయ్యిపోయింది మరి. :-)

    రిప్లయితొలగించండి
  7. చాన్నాళ్ళు మిస్సింగ్ మీరు.
    పునరాహ్వానం.
    అందులో కమ్మటి ఫిల్టరు కాఫీతో ఏతెంచారాయెనూ!

    రిప్లయితొలగించండి
  8. మీరు రాసింది మొన్న తొటరాముడు గారు రాసిన సాంబారు కష్టాలకి దగ్గరగా ఉంది...
    ఆయన కష్టాలు చదివితే మీరు... నవ్వి నవ్వి ఇంకొ కాఫి తాగుతారు.

    రిప్లయితొలగించండి
  9. హ హ...కొన్ని కొన్ని చోట్ల చమక్కులు భలె బాగున్నాయి.
    మీ కాఫీఏ కాదు టపా కూడా బాగా కుదిరింది.
    మీరు కాఫీ ప్రియులు అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను.ఏ కాఫీ బాగుంటుంది?ఫిల్టర్ లో ఏ కాఫీ పౌడర్ వేసారు?

    రిప్లయితొలగించండి
  10. నిజంగానే ఇప్పుడు (రాత్రి పదిన్నరకి) ఫిల్టర్ కాఫీ తాగాలనిపిస్తోంది వేణూ! ఫిల్టర్ కాఫీకి అసలు టైమేంటిలెద్దూ!
    నేను నా అమెరికా సూట్ కేసులో మొదట సర్దింది కాఫీ ఫిల్టర్. అదిలేకపొతే ఎన్నుండి ఏం లాభం!

    హాండిల్ లేకుండా ఫిల్టరు డిజైన్ చేసినవాణ్ణి నిజంగానే తన్నాలి! బాగుంది మీ టపా మా ఇంట్లోని మంచి ఫిల్టర్ కాఫీలాగే!

    రిప్లయితొలగించండి
  11. "వేసుకున్న టీషర్ట్ ని కాఫీ షర్ట్ చేస్తూ "
    ha ha ha .. Bravo.
    This reminded me of our efforts to open lunch boxes in elementary school.

    రిప్లయితొలగించండి
  12. చంద్ర శేఖర్ గారు, బ్రహ్మి గారు వ్యాఖ్యకు నెనర్లండీ...

    మహేష్ గారు నెనర్లు, కాదేదీ బ్లాగుకనర్హం అనేస్కోండి మరి :-)

    వంశీ గారు నెనర్లు, అయితే మీరు సరైన ఫిల్టర్ కాఫీ రుచి చూడలేదని నా అనుమానం అండీ. దాని రుచి ఇన్స్టంట్ కి రానే రాదు.

    సిరిసిరిమువ్వ గారు నెనర్లు :-) అయితే ఓ లిప్త పాటు నవ్వుకున్నారనమాట రాజేంద్రుడ్ని గుర్తు తెచ్చుకుని.

    ఉమా శంకర్ గారు నెనర్లు మంచి పాయింటే పట్టుకున్నారు కానీ కఫీ విషయం లో రాజీ లేదండీ ఓ నెల కాదు కదా ఇది పాడయ్యె వరకు నిస్సందేహం గా కంటిన్యూ చేస్తా..

    పూర్ణిమా నెనర్లు, హ్మ్ బ్లాగర్లందరూ కాఫీ పై మనసుపారేసుకున్నారనమాట ఈ రోజు.

    కొత్త పాళీ గారు నెనర్లు, ఆహా పునరాహ్వానం ఎంత కమ్మ గా ఉందండి "Welcome back" తో పోలిస్తే... మీకు మీరే సాటి. నిజమే లంచ్ బాక్సు మూతలు ఓ పట్టాన వచ్చేవి కాదు నానా తిప్పలు పెట్టేవి.

    పార్ధు గారు నెనర్లు, తోట రాముడు గారికి దగ్గరలో ఎక్కడండీ బాబు వారు హాస్యం లో స్కాలరు నేనింకా అ ఆ లే దిద్దుకుంటున్నా.

    మధు గారు నెనర్లు.

    రాధిక గారు నెనర్లు, ఏదో మంచి కాఫీ దొరికితే ఆహా అనుకోడం తప్ప రీసెర్చ్ చేసేంత ఓపిక లేదు లెండి. నేను వాడింది గ్రీన్ లేబుల్ కాఫీ చికోరీ మిక్స్. ఇక్కడ దొరికే వాటిలో ఫోల్గర్స్ ఒకటే తెలుసు కానీ నాకు అంత గా నచ్చలేదు. ఇన్స్టంట్ లో అయితే నెస్కేఫ్ సన్‌రైజ్ నచ్చుతుంది నాకు బ్రూ కన్నా.

    సుజాత గారు నెనర్లు, మొన్న పెసరట్టు అంటూ ఊరించేసారు ఇప్పుడు ఫిల్టర్ కాఫీ అంటున్నారు మీ ఆతిధ్యం ఎప్పుడు అందుకుందామా అని ఎదురు చూసేలా చేస్తున్నారండి.

    మేధ గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  13. హ్హా హ్హా t-షర్టు, కాఫీ-షర్టు అదిరింది.

    ఫోటోలో ఉండేది ఫిల్టరు కాఫీయా, నేను కాఫీ ఫిల్టరు క్లీన్ చేసాక వచ్చిన నీళ్ళేమో అనుకొన్నా.

    రిప్లయితొలగించండి
  14. :)
    చిన్నప్పట్నుంచీ పిల్టర్ కాపీ అలవాటు. తొందర్లో నలభీమపాకమ్లో పిల్టర్ కాపీ ఎలా? రాస్తా.

    రిప్లయితొలగించండి
  15. బాబా గారు నెనర్లు,
    ప్రతాప్ గారు నెనర్లు, :-) ఫోటో లో స్పెషల్ ఎఫెక్ట్ మంచి ఎఫెక్టే ఇచ్చిందనమాట :-)
    భాస్కర్ గారు నెనర్లు, వెంటనే వ్రాసేయండి మరి.
    రిషీ గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  16. కమ్మని ఫిల్టరు కాఫీ బహు సూపరూ.. వేణు గారు ఏమాటకామాటే చెప్పుకోవాలి, నేనైతే కాఫీ ఎడిక్ట్ ని. అందులో ఫిల్టర్ కాఫీ అంటే ఇహ వేళా పాళా చూడనంటే నమ్మండి. అందుకే మీరిచ్చిన కాఫీ గడ గడా తాగేసాను. ఇంకాస్త స్ట్రాంగ్ గా ఉండాలి కాస్త కాఫీ పొడి తగ్గింది. అయినా బాగుంది. " ఇస్టమైంతే ఇంగువ కూడా బెల్లమవుతుందట" . అలా వేడి వేడిగా అవస్థ పడుతూ తగాడంలోనే ఉంది మజా! మంచి కాఫీ ఇచ్చారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  17. రమణి గారు వ్యాఖ్యకు నెనర్లు :-) "ఇష్టమైతే ఇంగువ కూడా బెల్లమవుతుందట" బాగుంది.

    రిప్లయితొలగించండి
  18. బావుంది మిత్రమా టపా

    ముఖ్యంగా "టీ షర్టు -కాఫీ షర్టు" భలే బావుంది. అలాగే మీ కాఫీ ప్రహసనం చదువుతుంటే నేను మొదటిసారి చేసుకున్న వంకాయకూర ప్రహసనం గుర్తుకు వచ్చింది:-)

    రిప్లయితొలగించండి
  19. భావకుడన్ గారు నెనర్లు, మరి ఆ వంకాయ కూర కధ ఏంటో మాకు కూడా చెప్తే విని ఆనందిస్తాం కదండీ... వెంటనే టపాయించేయండి మరి.

    రిప్లయితొలగించండి
  20. ఏమనుకోకుండా ఆన్లైన్ లో పంపిస్తే నేను త్రాగి పెడుతాను. అన్ని సార్లు కుస్తీలు పట్టారా ఏంటి? నాకూ కాఫీ అంటే ఇష్టమే. టీ కన్నా అదే బాగుంటుంది. మీ ఫిల్టరూ, దానిలో చేసిన కాఫీ ఫోటో బాగుంది. హ హ హ. లేటు గానైనా లేటెస్ట్ గా దసరా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  21. నెనర్లు గీతాచార్యా... కాఫీ ఆన్లైన్ లో పంపించడానికి కాస్త ఆలస్యమైంది .. ఇంతకీ అందిందా...

    రిప్లయితొలగించండి
  22. హ్హాహ్హాహ్హా.. ఆ. సౌమ్య బజ్జులో మీ కాఫీ ప్రియత్వం చూసి వచ్చి చదివా ఈ టపా. బాగుంది మీ డికాషన్ తీసే ప్రయత్నం. ఇంతకీ ఈ మూడేళ్ళలో కాఫీ మాస్టర్ అయ్యారా? లేదా? నేనూ కాఫీ ప్రియురాలినే. ఇలాంటి అలాంటి ప్రేమ కాదు నాది. నేను రాసిన కాఫీ టపా చదివి మీరూ ఇంకో కాఫీ తాగెయ్యండి. జై ఫిల్టర్ కాఫీ!! ఛీర్స్!!

    http://kothavakaya.blogspot.com/2010/12/blog-post_12.html

    రిప్లయితొలగించండి
  23. కొత్తావకాయ గారు ధన్యవాదాలండీ... కాఫీ పెట్టడంలో మాష్టర్ కావడం కష్టమండీ.. కాఫీ ఎలాగున్నా తాగేస్తా కానీ ఎంత బాగా వచ్చినా.. ఇంకొంచెం బాగా ఎలా పెట్టగలం అని ఆలోచిస్తుంటా.. ఆ శాటిశ్ఫేక్షన్ అంత తొందరగా రాదు :-)

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.