సోమవారం, సెప్టెంబర్ 15, 2008

బ్లాగ్లోకానికి, బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి...

బ్లాగ్లోకానికి బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి... గత నెల రోజులు గా నా నుండి కొత్త టపా లేక పోయినా అపుడపుడు ఇటు విచ్చేసి వ్యాఖ్య లతో పలకరించి ప్రోత్సహంచిన మిత్రులందరికీ శతకోటి నమస్సులు. నేను మధ్యలో ఒకటీ అరా టపా లు అతికష్టం మీద చదివినా వ్యాఖ్య వ్రాసే సమయం లేకపోయింది. కంప్యూటరు తో గడప గలిగిన కాస్త సమయం లో ఏదో ఒక ఆఫీసు పని ఉండటం తో పాటు Internent Speed సరిగా లేక పోడం తో ఎక్కువ సమయం వెచ్చించ లేకపోయాను.

ఏదేమైనా నెల రోజుల శలవులు ముగించుకుని ఈ రోజే తిరిగి చికాగో చేరుకున్నాను. నేను డిల్లీ నుండి బయలుదేరే రోజే అక్కడ పేలుళ్ళు జరగడం బాధాకరం, Aug 11th ఉదయం అభినవ్ బింద్రా బంగారు పతకం గెలుచుకున్నాడన్న వార్త తో భారత మీడియా నాకు స్వాగతం పలికిందని సంతోషించే లోపే Sept 13th డిల్లీ పేలుళ్ళ వార్త తో వీడ్కోలు పలకడం బాధాకరమైన విషయం.

మొత్తం మీద నా ట్రిప్ అద్యంతమూ దేవుడి పాలనలో వరుణదేవుడు కురిపించిన ఎడతెరిపి లేని వర్షాలలోను, మా బంధువులు ఆత్మీయులు కురిపించిన అత్మీయ, అనురాగ వర్షపు జల్లులలోనూ, ఇంకా అకాల వర్షాల వల్ల పంట చెడిపోయిందనో సకాలం లో ఎరువులు అందలేదనో రైతన్నల ఆగ్రహ జల్లులలోనూ తడిసి ముద్దయి పోయా... ఇక నా అభిమాన హీరో "ప్రజారాజ్యం" ఆవిష్కరణని అందరితో కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూడటం కూడా ఓ మరువలేని అనుభూతి. ఈ నెల రోజులలోనూ మోయలేనన్ని బోలెడు అనుభూతులు, జ్ఞాపకాల వల్లనో :-) లేకా అనునిత్యం తిన్న విందు భోజనాల వల్లనో (ఇదే అసలు కారణం లెండీ) కానీ ఓ 3 కిలోల బరువు కూడా పెరిగాను.

రానున్న పది రోజులలోనూ మెల్లగా ఆఫీసు లోనూ, బ్లాగ్లోకం లోనూ ఉన్న back log లను కవర్ చేసి తిరిగి టపాయించడం మొదలు పెడతాను అంతవరకూ నిన్న ప్రయాణమయ్యేప్పుడు నా మదిలో మెదిలిన ఈ పాట మీకోసం.



చిత్రం : సిరివెన్నెల
గానం : యస్ పి బి, పి సుశీల
సంగీతం : కె వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఆ... ఆ...
పొలిమేర దాటిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
పొరుగూరికి చేరిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
కధ మారే రోజులు మారేనూ, ఓ గువ్వలచెన్నా!
కల తీరే దారులు వెతికేనూ, ఓ గువ్వలచెన్నా!

ఆ... ఆ...
ఆ... ఆ...

గుళ్ళో నిను చూడలేకున్నా, ఓ గువ్వలచెన్నా!
గుండెల్లో దాచుకున్నాలే, ఓ గువ్వలచెన్నా!
ఏ సీమలొ తిరుగాడినా, ఓ గువ్వలచెన్నా!
నీ దీవెనలందించాలన్నా, ఓ గువ్వలచెన్నా!
ఓ..ఓ..ఓ...ఒ.ఒ.ఒ.ఓ..
ఆ..ఆ..ఆ..అ.అ.అ.ఆ..

13 కామెంట్‌లు:

  1. Welcome back.. వస్తూ మంచి పాట వెంట తెచ్చారు :-)

    రిప్లయితొలగించండి
  2. మీ వూరు నించి ఒక్క టపా అయినా రాస్తారని అనుకున్నాను. సరే, మొత్తానికి మళ్ళీ వూరు కూడా వెళ్ళిపోయారన్నమాట. పోనీ లెండి, "పొరుగూరికి చేరిపోతున్నా" అన్నారు. "మా వూరికి వెళ్ళిపోతున్నా" అన్నారు కాదు. మంచిగంధపు మాలల్లాంటి జ్ఞాపకాలతోటి మళ్ళీ వచ్చెయ్యండి బ్లాగ్లోకంలోకి!

    రిప్లయితొలగించండి
  3. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, జ్ఞాపకాలు రాయకుంటే అవి మరుగున పడతాయి.రోజులు గడిచాక కొత్తవిషయాలు, పాతవిషయాలను అవతలికి నెట్టేసి, వాటి స్థానంలో కూర్చునే ప్రమాదముంటుంది. కాని, ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని శరీరం కోరుతుంది.సమయాభావం, విశ్రాంతి ఈ రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాయగలిగితే, మంచి యాత్రాస్మృతులు ఆవిష్కరణ అవుతాయి.

    రిప్లయితొలగించండి
  4. మంచిపాట గుర్తు చేసారు. ఉన్న నెలరోజులు హాయిగా గడిపేసారన్నమాట. మీ తరువాతి టపా కోసం ఎదురు చుస్తుంటాము.

    రిప్లయితొలగించండి
  5. @ నిషిగంధ గారు నెనర్లు

    @ సుజాత గారు నెనర్లు,
    నేను అంతే అనుకున్నా అండీ గుంటూరు నుండి కూడా కొన్ని టపాలు వ్రాయాలి అని, కాని పని వత్తిడి వల్ల అప్పటికే అమ్మ చేతిలో తిట్లు తిన్నాను, "అస్తమానం ఆ కంప్యూటర్ ముందు ఉండేట్లైతే శలవలు అని ఇంటికి రావడం దేనికి రా" అని. ఇక బ్లాగ్ కూడా వ్రాస్కుంటా అంటే వెంటనే విమానమెక్కించేసేది. ఎంత కాలం ఉన్నా ఈ ఊరు మా ఊరు ఎలా అవుతుందండీ పొరుగూరే...

    @ పూర్ణిమా Thanks.

    @ రావు గారు
    ముందు గా మీకు బోలెడు నెనర్లండీ... పాలగుమ్మి వారి ఫోన్ నంబరు ఇచ్చినందుకు, మీ పుణ్యమా అని నేను కొన్ని నాదవినోదిని కేసెట్ లు సిడీ లు కొనుక్కుని తీసుకొచ్చుకోగలిగాను.
    మీరు చెప్పిన సమన్వయం సాధించ గలిగితే మంచి స్మృతులు వ్రాయచ్చు కానీ నాది ప్రత్యేకించి యాత్రాస్మృతులు వ్రాయదగినంత యాత్ర కాదు లెండి చాలా సాధారణమైన యాత్ర, కుటుంబం తో ఆనందం గా గడపడం మించి ప్రత్యేకించి విశేషాలు ఏమీ లేవు అనే చెప్పచ్చు.

    @ దుర్గేశ్వర గారు నెనర్లు.

    @ సిరిసిరిమువ్వ గారు
    అవునండీ Global families ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో విహార యాత్ర లు చేయడం దేవుడెరుగు కుటుంబం అంతా కలిసి ఒకే చూరు కింద విశ్రాంతి గా గడపడానికి కూడా యేళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్తితి అందుకే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసాం.

    @ గీతాచార్య Thank you.

    రిప్లయితొలగించండి
  6. Many thanks for visiting my blog. You asked for the link of "vijaya vishwanatham" post.

    The link is...

    geethaageetham.blogspot.com

    It could be seen in navatarangam.com also.

    Thank you. Again.

    రిప్లయితొలగించండి
  7. వేణుశ్రీకాంత్ గారూ..నమస్సులు...నాకు నచ్చిన పాటలు మీ బ్లాగులో చూసి చాలా ఆనందించా....అందుకోండి నా అభినందనలు.....

    రిప్లయితొలగించండి
  8. గీతాచార్య గారు నెనర్లండీ...
    భగవాన్ గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  9. నేను స్వదేశం లో ఉంటున్నా అప్పుడప్పుడు అలా బ్లాగడం తప్పితే మిగతా వాటికి అసలు టైం దొరకడం లేదు. మీరు రాసిన ఇలాంటి మంచి టపాలని మిస్ అయిపొయానన్నమాట ఇలా. చాలా మంచి పాట వేణు గారు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.