అవి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతూ ఇండస్ట్రియల్ టూర్ పేరుతో దేశాటన చేస్తున్న రోజులు. ఓ డిశంబరు తెల్లవారు ఝామున డిల్లీలో మంచుకు వణుకుతూనే ఆగ్రా వెళ్ళడానికి గాను అందరం టూరిస్ట్ బస్సు ఎక్కాం. మేమేదో ముందు వచ్చాం అని సంబరపడిపోయాం కానీ ఆ సరికే ముందు సీట్లు ఆక్రమించిన వారిని చూసి నిరాశగా చివరి సీట్లలో కూర్చున్నాం. నాది క్లాసులో అయినా బస్సులో అయినా చివరి సీటే కనుక లాస్ట్ ఐదు సీట్ల వరుసలో ఓ పక్కగా సర్దుకున్నాను. నా ముందు సీట్ లో ఒకడు నిర్మొహమాటంగా సిగరెట్ కాలుస్తున్నాడు. ప్రశాంతమైన ఉదయపు తాజాదనాన్ని హరిస్తూ మనవాడు యధేచ్చగా బస్సంతా సిగరెట్ పొగ తో నింపేస్తున్నాడు, అసలే చలికి కిటికీ తలుపులు మూసి ఉన్నాయేమో మా అందరికీ మరింత చిరాకు వచ్చింది. అంతలో మాలోనే ఒకడికి మరీ ఒళ్ళుమండి ఆవేశంగా లేచి "you are not supposed to smoke inside the bus" అని అంటూ చాలా కరుకుగా చెప్పాడు. అతను ఓ క్షణం అవాక్కై నువ్వు అంతలా అరవడం ఏమీ బాలేదు బాసు మెల్లగా చెప్పి ఉండాల్సింది అని సిగరెట్ బయట పారేశాడు. ఇక మాకు మాట్లాడుకోడానికి ఒక టాపిక్ దొరికింది, మనిషిని చూస్తే చదువుకున్న వాడిలాగే కనపడుతున్నాడు కానీ పక్కా నార్త్ ఇండియన్ ఫేస్ కట్, బొత్తిగా సౌత్ ఇండియా మొహం కూడా చూసినవాడ్లా కనిపించలేదు. ఇక మేము రెచ్చిపోయి "తప్పేలా మొహం వేస్కుని ఎలా ఉన్నాడో చూడు ఈడి ఎంకమ్మా సిగరెట్ కాల్చింది కాకుండా మెల్లగా చెప్పాలంట" అని మొదలెట్టి, "వాష్ బేసిన్ లో చేపలు పట్టే వాడి మొహం వాడూనూ" అని, "పండు పడేసి తొక్కతినే తిక్క సన్నాసి" అనీ జంధ్యాల గారిని గుర్తు చేసుకుని ఇష్టం వచ్చిన తిట్లన్నీ తిట్టేశాం. ఇంచు మించు వాడ్ని విలన్ గా పెట్టి ఒక సినిమా తీసినంత పని చేశాం. ఒక రెండు గంటలు ఇలా గడిపేశాం, అంటే గుర్తొచ్చినపుడల్లా వీడ్ని తెలుగులో తిడుతూన్నా మిగతా ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంది లెండి.
రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయడం కోసం బస్సు ఒక హోటల్ ముందు ఆపాడు. ఇంతలో మా సిగరెట్ బాబు పక్కనే కూర్చున్న మా క్లాస్మేట్ పరుగున వచ్చి "బాబు అలా రెచ్చిపోతున్నారెంట్రా" అని అడిగాడు మేం వెంటనే "ఏమైంది బాసు వాడికెలాగు తెలుగు రాదుగా" అని ధీమా వ్యక్తం చేశాం. దానికి మావాడు "ఆయన తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో ట్రాన్సిలేటర్ గా పని చేస్తాడుట ఒక ఇరవై భాషల వరకూ వచ్చని చెప్పాడు నాతో చక్కగా తెలుగులో మాట్లాడాడు, మీ మాటలు స్పష్టంగా అర్ధమై నవ్వుకుంటున్నాడు.." అని బాంబు పేల్చాడు. మేం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని ఒక్క క్షణం ఖంగుతిన్నా, పోన్లే ఈ వయసులో కాకపోతే ఇంకెపుడు చేస్తాం అల్లరి అనుకుని ష్ గప్ చుప్ అని బస్సెక్కేశాం. ఆ తర్వాత బుద్దిగా ఉన్నామని వేరే చెప్పాలా :-) కట్ చేస్తే (రక్తం వచ్చుద్ది అంటారా, మీరు వి.వి. వినాయక్ సినిమాలు చూట్టం కాస్త తగ్గించాలి మరి :-) మన కథ లో సీన్ కట్ చేస్తే అండీ బాబు. నేను ఇంజనీరింగ్ ముగించుకుని ఉద్యోగ వేటలో పడిన కొత్తలో ఓ ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి ఢిల్లీ వెళ్ళాను. ఇంటర్వ్యూకి సంభందించిన ఙ్ఞాపకాలు మరో టపాలో రాస్తాను. సరే ఇంటర్వ్యూ ముగించుకుని తిరుగు టపాలో రైలెక్కి రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లో ఠీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను. ఇంతలో కిటికీ దగ్గరికి ఒక పెద్ద తెలుగు గుంపు వచ్చింది, ట్రైన్ ఎక్కిందేమో ఒక 10th class కుర్రాడు ప్లస్ వాళ్ళ మామ్మ గారు కానీ వచ్చిన బెటాలియన్ మాత్రం ఒక పది మందికి తక్కువ కాకుండా ఉంది. అందులో ఓ ఆంటీ ఉన్నారు ఆవిడ్ని అందరూ భలే చలాకీ అని పొగుడుతుంటారు అనుకుంటా, ఆవిడ ప్రతాపం చూపడానికి నన్ను ఎన్నుకున్నారు. అందరూ తెలుగులో మాట్లాడు కుంటున్నారు.
మరి నేను తెలుగు వాడిలా కనపడలేదో లేకా చుట్టూ ఉన్న జనాన్ని చూసుకుని నేను ఒంటరిగాడ్నికదా ఏం మాట్లాడలేడులే అనుకుందో ఏమో కానీ నన్ను ఒకరేంజిలో ఆడుకోడం మొదలెట్టింది. డ్రెస్సింగ్ నుండి హెయిర్ కట్ వరకూ, తెలుగు వాడై ఉంటాడా, అసలు ఢిల్లీ ఎందుకు వచ్చాడు, ఇక్కడ వాడే అయి ఉంటాడా, మన రైలు ఎందుకు ఎక్కాడో, మనం మాట్లాడేది అర్ధమవుతున్నట్లు లేదులే అనుకుని ఆపై ఇష్టమొచ్చిన కామెంట్లు చేశారు. కొన్ని కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నా ఇటువంటి పరిస్థితిలో ఎంత ఇబ్బంది గా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది. పోనీ వాళ్ళతో తెలుగులో మాట్లాడుదామా అంటే మొహమాటం. అప్పటి వరకూ భరించాను కదా ఎదవనైపోతానేమో అని జంకు, ఏం చేయాలో తెలియక బూట్లు కేసి చూసుకుంటుంటే తను "ఏంట్రా బూట్లు చూసుకుంటున్నాడు కొత్తగా కొన్నాడేమో ఆహా ఆ చూపు చూడండ్రా.." ఇలాటి కామెంట్లతో తను నన్ను మహా ఇబ్బంది పెట్టేశారంటే నమ్మండి. ఆ క్షణంలో మా అల్లరి గుర్తొచ్చి అంత సహనంగా ఉన్న అతనికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. మేం వాడ్ని తిట్టిన తిట్ల ముందు ఈ కామెంట్లు ఏ మూలకీ రావనుకోండి. మొత్తానికి ఆవిడ్ని అలా సస్పెన్స్ లోనే ఉంచేశాను. తర్వాత ఆ మామ్మ గారితో కుర్రాడితో తెలుగులో మాటాడినపుడు కుర్రాడు సారీ చెప్తే ఇద్దరం నవ్వేసుకున్నాం అనుకోండి.మొత్తం మీద మన భాష తెలిసి ఉండక పోవచ్చులే అని తప్పుడు అంచనా వేసిన రెండు సంఘటనల్లో నే ఇరుక్కుపోయిన సంధర్భాలు అవీ, మీరూ ఇటువంటి సరదా సంఘటనలు పంచుకోండి.


















