మంగళవారం, మార్చి 30, 2010

లీడర్ & ఏ మాయ చేసావె

ఈ రెండు సినిమాల గురించే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య కాలం లో నేను చూసినది ఈ రెండు సినిమాలనే.. ఇంకా రెండు సినిమాల్లోనూ ఏదో చెప్పాలి అని మంచి ప్లాట్ తో సినిమా మొదలు పెట్టి ఏం చెప్పాలో అర్ధం కాక మాములు గా వదిలేసినట్లు అనిపించింది. రెండూ కూడా గొప్ప సినిమాలు కాకపోయినా ప్రోత్సహించదగిన మంచి ప్రయత్నాలు. రెండు సినిమాల దర్శకుల పై నాకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి ఈ రెండు సినిమాలు డైలాగ్ బేస్డ్ సినిమాలు, ఈ సినిమాలను వినాలి, మనసుపెట్టి చూడాలి, పాత్రల స్వభావాలను కాస్తయినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి అపుడే సినిమాను మరింత ఆస్వాదించగలం. తెలుగులో ఈ అవసరాన్ని కల్పించే సినిమాలు వేళ్ళపై లెక్క పెట్టచ్చేమో. డ్యుయట్ లు, ఫైట్లు, వీరోచితమైన డైలాగులు, రక్తాలు, చంపుకోవడం, వెకిలి హాస్యం, ఓవర్ యాక్షన్ ల జోలికి పోకుండా చేసిన వైవిధ్యమైన ప్రయత్నం. మరో మెచ్చుకోతగిన అంశం మాంచి సినీ నేపధ్యం గల ఇద్దరు హీరోలలో ఒక హీరోకి మొదటి సినిమా అయితే మరో హీరోకి రెండో సినిమా. సొంత తెలివి తేటలో ఎవరి ప్రోత్సాహమో తెలియదు కాని ఇటువంటి సినిమాలు ఎంచుకోవడం మంచి పరిణామం.


లీడర్ సినిమా చివరలో అమ్మ పాత్ర తన కొడుకు తో ఇలా అంటుంది "నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే కానీ పొలిటీషియన్ కాదు రా" అని. శేఖర్ ఈ డైలాగ్ తో తనకి క్లారిటీ ఉంది అని నిరూపిస్తాడు కానీ సినిమా అంతా పొలిటీషియన్ అవడం ఎలాగో చూపిస్తాడు చివరి పది నిముషాలు మాత్రమే హీరో లీడర్ అవడానికి చేసిన ప్రయత్నాలను అది కూడా మాంటేజ్ షాట్ లో చూపిస్తాడు. అటుదిటు ఇటుదటు చేసి ఉంటే సినిమా ఇంకా బాగా వచ్చేదేమో, కనీసం క్రిటిక్స్ మూవీ గా అన్నా నిలిచేదేమో అనిపించింది నాకు. బహుశా ఏది చేయద్దు అనేది చూపిస్తే ఏది చేయాలి అన్నది అసలైన నాయకులే నిర్ణయించుకుంటారు లే అని వదిలేశాడేమో. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పవర్ ఫుల్ షాట్స్ తో హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం లో సఫలమయ్యాడనే చెప్పచ్చు. రామానాయుడు గారిలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న రాణా ఇటువంటి కధను ఎన్నుకోవడం కూడా అభినందనీయం. ఇతను ఈ సినిమాకో పెద్ద ప్లస్ కొత్త నటుడు అన్నట్లు కనిపించలేదు. హైట్ తో పెర్ఫార్మెన్స్ తో అందరి మతులు పోగొట్టేశాడు, అలా చేసేలా చేశాడేమో శేఖర్. అలానే ఇతని కంఠస్వరం, తెలుగు ఉఛ్చారణ కూడా ఆ పవర్ తీసుకు రావడానికి దోహదం చేశాయి. ముఖ్య విలన్ ధనుంజయ్ గా చేసిన సుబ్బరాజు కూడా మంచి ఎంపిక ఇతనికి హర్షవర్ధన్ కూ కూడా మంచి పాత్రలు దొరికాయి. మొత్తం మీద ఆకట్టుకున్న సినిమా.


లీడర్ కు హీరో ప్లస్ అయితే ఏ మాయ చేసావె కు హీరో పెద్ద మైనస్ :-) అభిమానులు నన్ను తప్పు పట్టవద్దు. పాత్ర పరం గా మరో నటుడిని ఎన్నుకుని ఉంటే మరింత బాగా వచ్చేదేమో సినిమా అనిపించింది. ఇక హీరోయిన్ జెస్సీ రాక్స్, ఈ అమ్మాయి చాలా బాగుంది. తనలో ఏం లేదమ్మా మాములు అమ్మాయే కాకపోతే ఈ సినిమాలో బాగా చూపించారు అన్నారెవరో.. మేబీ.. అది నిజమే అయి ఉండచ్చు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు నాకు నచ్చింది ఏం మాయచేసావే లో జెస్సీ అంతే. తన వాయిస్ కూడా తన కన్ఫ్యూజ్డ్ స్వభావానికి తగ్గట్లుగా సరిపోయింది అనిపించింది. సినిమాలో చెప్పినట్లు అమ్మాయిలందరిదీ కాంప్లెక్స్ మెంటాలిటీ అబ్బాయిలందరిదీ సింపుల్ మెంటాలిటీ అని నేను చెప్పడం లేదు, నిజ జీవితం లో అమ్మాయిల్లో క్లారిటీ ఉండి సింపుల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళుండచ్చు అలానే అబ్బాయిలు విపరీతమైన ఆలోచనలతో కాంప్లికేట్ చేసుకునే వాళ్ళు ఉండచ్చు, కానీ ఇటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ తో సినిమా చేయాలనే ఐడియా నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ రి విజువల్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేయడం లో తోడ్పడతాయి.

రెండు సినిమాల్లోనూ హాస్య నటుల పై ఆధారపడకుండా ముఖ్య పాత్రలతోనే కాస్త హాస్యాన్ని పండించడం నచ్చింది :-) ఏ మాయ చేసావే లో హీరో సీరియస్ గా చేసే నటన మరియూ మూవ్ మెంట్స్ తో మనం బోల్డు నవ్వుకోవచ్చులెండి అది వేరే విషయం. కానీ మొదటి సినిమా జోష్ తో పోలిస్తే ఈ సినిమాలో ఇతను చాలా బెటర్. కొన్ని సీన్స్ కోసం సినిమాలో ఫీల్ కోసం ఖచ్చితంగా ఈ రెండు సినిమాల డివిడి లు నా లైబ్రరీలో చోటు సుస్థిరం చేసుకున్నాయి. అందుకే ఈ పరిచయం.

16 వ్యాఖ్యలు:

 1. నేను ఈ మధ్యకాలంలొ చూసినవి / నచ్చినవి.. ఈ రెండే.. రెగ్యులర్ సినిమాలకి బిన్నంగా ఉన్నాయ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను మీతో సగమ్మాత్రమే ఏకీభవిస్తాను.
  ముందుగా లీడర్ గురించి. ఇది నాకు బొత్తిగా నచ్చలేదు.
  ఇక నువ్వేం మాయ చేశావో గురించి. నాకు బాగా నచ్చింది. కానీ హీరోయిన్‌ది కాంప్లెక్స్ మెంటాలిటీ అని నాకనిపించలేదు :). చాలా సహజంగానూ మరియూ స్ట్రెయిట్ గానూ వున్నట్లనిపించింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కరెక్ట్ చెప్పారు. లీడర్ లో హీరో ఎంత బావున్నాడో, ఇందులో హీరో అంత చెత్త. నిజానికి ఇతను సినిమా హీరో గా సూట్ కాడు. ఏదో పెద్ద హీరో కొడుకని మనం భరించాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నే లీడర్ ఇంకా చూడలా, ఏ మాయ చేశావేలో వాడు గేట్ దూకడం ఒక్కటే బావుంది ;-p ఆ పిల్లది చపాతీ మొహం దానికన్నా మా కేలేజి అమ్మాయిలె బావుంటారు ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బహుశా ఏది చేయద్దు అనేది చూపిస్తే ఏది చేయాలి అన్నది అసలైన నాయకులే నిర్ణయించుకుంటారు లే అని వదిలేశాడేమో.

  Yes I too feel the same.
  Not only this movie,Even godavari is also like that only.
  What i mean is even after the movie competed,people will still expecting some thing from that movie.

  I liked the dialogues in leader movie.

  And for "Ee maya chesave" the heroine is plus.
  And the last scene b/n hero and herine.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. లీడర్ సినిమా లో నాకు బాగా నచ్చిన సీన్ . హీరో ....తన పదవి కాపాడుకోటానికి ఒక పేద పిల్లమీద అత్యాచారం చేసిన వ్యక్తిని కాపాడతాడు. ఆ సందర్భంగా అతను అనుభవించే మనసిక వ్యధ, పశ్చాత్తాపం ,ఆ అమ్మాయి కుటుంబానికి సాయం చేస్తానని అన్నప్పుడు ఆ వృద్దుడు అంటాడు చూడండి ...."వద్దు బాబూ బస్సులోపోతాం ...నలుగురూ తోడుంటారు " అని నాకయితే కల్లల్లో నీళ్ళు తిరిగాయి.
  అంతేకదా ...... మనిషికి మనిషే తోడు . మనలాంటి వారు మనచుట్టూ వున్నారన్న ధైర్యం .
  ఏం మాయచేసావే ......తెలుగు సినీ హీరోల అందం గురించీ రాజకీయనాయకుల నీతి గురించీ ఏం చెపుతాం లెండి !
  హీరోయిన్ పాత్రకి అంత అవసరం కాకపోయినా చక్కగా చీరలు కట్టుకుంది.( పాత్ర డిమేండ్ మేరకు ఏం చెయ్యడానికైనా సిద్దం అనే హీరోయిన్లున్న ఈ కాలంలో) . హీరోయిన్ డబ్బింగ్ బావుంది. కొంచెం మలయాళీ యాస కలిసినట్టుంది . హీరో గొంతు అస్సలుబాగోదు పాపం ఏం చేస్తాడు లెండి .
  పైన మీరు చెప్పిన అన్ని కారణ్ణాల వల్లా ( ఫైటింగులు, సెపరేట్ కామెడీ గట్రా......) ఈ సినిమా బావుంది అనక తప్పదు. తెలుగు సినిమా నుంచీ ఇంతకంటే ఎక్కువ ఆశించడం కూడా అమ్మయకత్వమే అవుతుంది
  అయ్యోరామా .....ఇదేంటీ , కామెంట్ వెయ్యబోయి టపా వేశేసాను . శ్రీకాంత్ గారూ మీ టపాకొచ్చిన సగం కామెంట్లు నాకే చెందుతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. లీడర్ సినిమా నేను ఇంకా చూడలేదు.బావుంది అని విన్నాను. కానీ నాకు ఏం మాయ చేసావే నచ్చలేదు. నేను తమిళ్, తెలుగు రెండిట్లోనూ చూసాను. మీరన్నట్టు తెలుగులో హీరో ఈ సినిమకై జీరో యే. కానీ తమిళ్ లో శింబు బాగా చేసాడు. పెద్దగా ఫైట్లు, రక్తపాతాలు, కుళ్ళు జోకులు లేకుండా సినిమా ఉంది కాబట్టి మిగతావాటితో పోలిస్తే బెటరే. కానీ కాన్సెప్ట్ నాకు నచ్చలేదు. అసలు హీరొ ఎందుకు ఆ అమ్మయిని లవ్ చేస్తాడొ, అంత క్రేజీగా ఎందుకు ఉంటాడో ఏమీ వివరంగా చెప్పలేదు. love at first sight అంతే. ఈ love at first sight కథలు ఎన్నాళ్ళనుండో మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా ఎన్నాళ్ళు? ఇందులో చూపించిన పాత్రలు నిజజీవితానికి దగ్గరా పాత్రలు కావు. హీరోయిన్ ఉన్నంత కంఫ్యూసన్ గా కొద్దిమంది మాత్రమే ఉంటారు అబ్బయిలైనా, అమ్మాయిలైనా సరే. కలిసి జీవించాలనుకునే అమ్మయికి ఇంత కంఫ్యూసన్ ఉంటే ఏ అబ్బయికైన చిరాకు వేస్తుంది. ఈ కంఫ్యూసన్ ఆ అమ్మయి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.తన మనసుకి స్థిరత్వం లేదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అటువంటి అమ్మయిని పిచ్చి పిచ్చి గా ప్రేమించడంలో అర్థం లేదు. అసలు ఏమి చూసి ప్రేమించాడు. ఒక మనిషికి స్థిరమైన వ్యక్తిత్వం కంటే ఆభరణం ఇంకొకటిలేదు కదా. అదే లోపించినప్పుడు ఇంక ప్రేమ ఏమిటో. నాకాయితే సినిమా నచ్చలేదు. పైగా బోర్ కొట్టింది కూడా.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "ఏం మాయ చేసావే" బావుంది. "లీడర్" సినిమా నేను ఇంకా చూడలేదు.బావుంది అని విన్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నేనింకా రెండూ చూడలేదండీ :(
  ఎందుకో ధైర్యం సరిపోవడం లేదు..

  ప్రత్యుత్తరంతొలగించు
 10. డివిడి ఇంత తొందరగా రిలీజ్ చేసారా రెండు సినిమాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నెలబాలుడు గారు నెనర్లు :-)

  ఇండియన్ మినర్వా గారు నెనర్లు :-) హీరోయిన్ ది కాంప్లెక్స్ మెంటాలిటీ కాదంటారా హ్మ్..

  రవిగారు నెనర్లు :-) మరే వారసుల్ని భరించాల్సిన ఖర్మ ఎప్పటికి తప్పేనో..

  నేను గారు నెనర్లు :-) హ హ వాడ్ని చూసి భరించలేక జనాలు థియేటర్ గేట్లు దూకి ఎలా పారిపోవాలో చూపించాడు లెండి మీకు కూడా అందుకే ఆ సీన్ నచ్చి ఉంటుంది :-D మీ ఇంట్లో చపాతీలు అంత అందంగా చేస్తారాండీ :-) హీరోయిన్ కన్నా మీ కాలేజి అమ్మాయిలే బాగుంటారా :-) మీ కాలేజి అడ్రస్ ఏదో కాస్త చెప్తారా ప్లీజ్ :-)

  t గారు నెనర్లు :-) మీరన్నది అర్ధం కాలేదండీ. గోదావరి లో రాజకీయం త్రెడ్ గురించి చెప్తుంటే అది అలా ఒదిలేయడమే ఉత్తమం ఎందుకంటే అది ప్రేమ కథ. ప్రేమ కథ ని ఒక కొలిక్కి తెచ్చి ముగించాడు కదా, ఇంకా అందులో ఎదురు చూడటానికి ఏముంది.

  లలిత గారు నెనర్లు :-) మీ అభిప్రాయాలను వివరంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. లీడర్ లో మీరు చెప్పిన ఆ సీన్ మొత్తం చాలా బాగా తీసాడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. సౌమ్య గారు నెనర్లు :-) love at first sight అనేది ఒక డిబేటబుల్ టాపిక్ అండీ . నేను కూడా ఆ కాన్సెప్ట్ కధల్లోనూ ఊహల్లోనూ తప్ప నిజ జీవితంలో నమ్మను కనుక నేను వాదించలేను కానీ ఈ సినిమాలో ముందే చెప్పాడు love just happens ఒక వెల్లువలా ముంచెత్తేయాలి ప్రేమంటే అని. ఈ ప్రేమ కథ అలా ఏర్పడిన ఒక ప్రేమ గురించి అంతే... ఆ కంఫ్యూజన్ లో కూడా ఒక క్యూట్ నెస్ ఉందండీ. తల్లిదండ్ర్లుల పై ప్రేమని వదులుకోలేక కార్తీక్ పై ప్రేమనీ వదులుకో లేక ఏర్పడిన కంఫ్యూజన్ అది. దానికి తను ఇచ్చిన సొల్యూషన్ కూడా నాకు నచ్చింది. అతని ప్రేమ కు మూలం తొలిచూపు ఆకర్షణ అయినా రెండేళ్ళు మాట్లాడుకోకపోయినా ఆ ఇద్దరి మనసుల్లోనూ ఆ ప్రేమ తాలూకు ఘాడత అలానే ఉంది.

  పద్మార్పిత గారు నెనర్లు :-)

  మురళి గారు నెనర్లు :-) ధైర్యంగా వెళ్ళి చూడండీ అని నేను చెప్పలేకపోతున్నానండీ.. రెండిటిలోనూ దేని లోపాలు దానికి ఉన్నాయి. అలానే మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంత మేరకు రిస్క్ తీసుకోవాలనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.

  హరే కృష్ణ గారు నెనర్లు :-) లేదండీ ఈ సినిమా డివిడి లు ఇంకా రిలీజ్ అవ్వలేదు. అయ్యాక నా లైబ్రరీ లో చోటు ఇప్పుడే సుస్థిరం చేసుకున్నాయి అని చెప్తున్నాను. అంటే నే కొనాల్సిన డివిడి ల లిస్ట్ లో ఇది కూడా చేరిందనమాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. thanks for the reviews.
  meeku ivi online lo ekkada choodacho telusaa ? telisthe link ivvagalaraa ? ippatlo theater ki velle paristhithi ledu. dvd eppudu vacheno? ee lope chooseddamani aasa.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అఙ్ఞాత గారు వ్యాఖ్యకు నెనర్లు. క్షమించండి లింకులు ఇచ్చి పైరసీని ప్రోత్సహించలేను. గూగులమ్మను అడగండి దొరకచ్చేమో..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. లీడర్ సినిమాలో కమ్ముల చెప్పాలనుకున్న విషయాన్ని ఇంప్రెసివ్ వే లో తీసుంటే సినిమా బాగుండేది. ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పించి,ఒప్పించేలా ఉండాలి సినిమా..అప్పుడే చెప్పాలనుకున్న పాయింట్ జనాలుకు రీచ్ అవుతుందని నా ఫీలింగ్..అయితే మంచి సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

  ఇక ఏ మాయ చేశావో లో నాకు కూడా హీరోనే అందులో జీరో అనిపించింది. అతను మూతి దగ్గర ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చాలా చైల్డిష్ గా ఉన్నాయి. మాన్యు ఫేక్చరింగ్ డిఫెక్ట్ అయితే ఏమీ చేయలేం అనుకోండి..:P
  ఇంక జెస్సీకోసం సినిమా ఎన్ని సార్లు చూసినా తప్పేలేదు నా దృష్టిలో :P..ఆ రోల్ కు ఆ అమ్మాయి చక్కగా సూటయ్యింది. సినిమా కాన్సెప్ట్ కూడ బాగుంది.

  అవునూ..ఇందాక కామెంట్లో నేను గారి కాలేజ్ అడ్రస్ అడుగుతున్నట్టున్నారు...అడ్రస్ తీసుకున్నాక నన్ను కూడ పిలవడం మర్చిపోకండేం..:-)

  @మురళి గారు,
  రెండు సినిమాలు మరీ అంత భయపడేటట్టు ఉండవండి...ఒకసారి చూడొచ్చు..ఒక్క వారసుల సినిమాలు అనే విషయం పక్కన పెట్టేస్తే అంతకు మించి చూడదగ్గ అంశాలు ఈ రెంటిల్లో బాగానే ఉన్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. శేఖర్ గారు నెనర్లు :-) విపులంగా మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు :-) అలాగే తప్పకుండా నేను గారు అడ్రస్ చెప్తే మిమ్మల్ని కూడా పిలుస్తాను :-)

  మురళి గారు అన్నట్లు మీరు ఉషాపరిణయమో ఏదో ఈటీవీ సుమన్ సినిమా చూసినట్లున్నారు కదా :-) ఆ దృష్టితో ఆలోచిస్తే మీరు ధైర్యంగా చూసేయచ్చేమో :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.