గురువారం, డిసెంబర్ 17, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 2

రెండో రోజు ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచి ఏడున్నరకల్లా అల్పాహారం కోసం బయలుదేరాను కాస్త కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతమవడంతో మెట్లు ఎక్కిదిగడం పైగా ఎంతదూరమైనా నడకే కావడంతో కాస్త కష్టంగా ఉందనిపించింది, అసలేమన దైనందిన జీవితంలో పక్కసీట్ కు వెళ్ళాలన్నా కుర్చీలోనే జరుగుతూ వెళ్ళేంత బద్దకిష్టులం కనుక అంతే ఉంటుంది లే అని సర్దిచెప్పి అలానే తిరిగేశాను. కిచెన్ చాలా పెద్దగా ఉంది దాని డాబా పైన బోలెడన్ని సోలార్ ప్యానల్స్ ఆకర్షణీయంగా పేర్చి ఉన్నాయ్ వాటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కిచెన్ అవసరాలకు ఉపయోగిస్తారుట. కిచెన్ లో కింద కూర్చుని భోజనం కేవలం పెద్దవాళ్ళకోసం కింద కూర్చోలేని వాళ్ళకోసం ఒక పక్కన కాసిని టేబుల్స్ కుర్చీలు సైతం ఏర్పాటు చేసి ఉంచారు. అల్పాహరం గా నాకు అత్యంత ఇష్టమైన ఉప్మా శనగపప్పు, కొబ్బరి వేసి చేసిన కారప్పొడి తాగడానికి చాక్లెట్ ఫ్లేవర్డ్ రాగిమాల్ట్. ఆహా బ్రహ్మాండం అనుకున్నాను. ఆ కిచెన్ లో మెజారిటీ పనులు చేసేది అంత సేవకులని స్టాఫ్ అతి కొద్దిమంది అని సర్వింగ్ కూరలు తరగడం అన్నీ సేవచేయడానికి ఉత్సాహం చూపే వారిచే చేయిస్తారుట. అదీకాక అక్కడ రోజుకు ఐదువేలమందికి వంట చేస్తారుట, ఇక్కడ దగ్గరలోని కొన్ని స్కూల్స్ కి సైతం భోజనం ఇక్కడినుండే వెళ్తుంది అని తెలుసుకుని ఆశ్చ్రర్యపడిఫోయాను. కిచెన్ టైమింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి అల్పాహారం 7:30 నుండి 8:30 వరకు. మధ్యాహ్న భోజనం 12:30 నుండి 1:30 వరకూ, రాత్రి భోజనం 6:30 నుండి 7:30 వరకూ. శరీరానికి సరైన సమయాలు ఇవైనా నేను పాటించేసంధ్రర్భాలు బహుస్వల్పం ఇక్కడ ఆశ్రమం లో పాటింపచేస్తారు. ఆహారంకూడా చాలా బాగుంది శాఖాహారం శరీరానికి ఆవశ్యకమైన పోషకాలను అందించే మితమైన సాత్విక ఆహారం.


ఇక వంటశాలలో అల్పాహారం స్వీకరించి అక్కడ నుండి వచ్చాక కాస్త రిలాక్స్ అయి కోర్స్ కోసం వెళ్ళాము. మొదట రిజిస్ట్రేషన్ సమయంలో రేపుదయం శంకరహాల్ లో జరుగుతుంది కోర్స్ అని చెప్పారు సరే అని మేమంతా అక్కడికి చేరుకునే సరికి చివరినిముషంలో ఇక్కడ కాదు వేరే చోట అని మళ్ళీ ఇంకోచోటకి మార్చారు. అబ్బే బొత్తిగా పద్దతీ పాడులేకుండా ఏమిటీ ఈ మేనేజ్మెంట్ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ ప్రవర్తించవలసిన విధానమేనా ఇది అని అనిపించింది. ఎట్టకేలకు కోర్స్ మొదలైంది ఒకరినొకరు పరిచయంచేసుకోండి హలో హాయ్ అని కాకుండా  సంఘశ్చత్వమ్ అనే మాటతో పరిచయం చేసుకుందాం అన్నారు. ఏమిటి దాని ప్రత్యేకత అంటే కలసి నడుద్దాం అన్న పదానికి సంస్కృత పదమట. సో ఇక్కడమన అందరం ఒకే గ్రూప్ గా కలసికదులుదాం. అంతే కాదు ఈ మూడురోజులు చిన్న పిల్లలు ఎలాటి ఓపెన్ మైండ్ తో ఉత్సాహంతో నేర్చుకుంటారో అలా నేర్చుకుందాం అని మొదలు పెట్టారు. మా గ్రూప్ కు వచ్చిన టీచర్స్ పేర్లు పంకజ్ & వాసంతి. ఇద్దరు కూడా చాలా చక్కగా ఓపికగా వివరించి నేర్పించారు. నిజంగా మా అదృష్టం అటువంటి టీచర్స్ దొరకడం అనిపించింది.

ఇక కోర్స్ కంటెంట్ విషయానికి వస్తే వార్మప్ అనదగిన అతి కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన శ్వాసక్రియ పద్దతిని నేర్పిస్తారు. ఆ తర్వాత మూడు అంచెల ప్రణాయామ నేర్పిస్తారు దాని తర్వాత భస్త్రిక నేర్పిస్తారు. ఇవన్నీ శ్వాస ప్రక్రియలే.. యధాలాపంగా శ్వాస పీల్చడం కాకుండా శ్రద్దగా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ ను అందించడానికి అలానే శ్వాస ద్వారా టాక్సీన్స్ ను శరీరం నుండి బయటికి పంపడానికి ఈ శ్వాస ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ నేర్పాక గురూజీ కంఠస్వరంతో కూడిన క్యాసెట్ ద్వారా సుదర్శనక్రియ నేర్పిస్తారు. ఈ సుదర్శన క్రియ వలన కలిగే అనుభూతిని ఎదుటి వారి ద్వారా తెలుసుకోవడం కంటే స్వయంగా అనుభవిస్తేమరింత ఆనందానికి గురికావచ్చు. అంతేకాక ఆ అనుభూతికూడా ఒకొకరు ఒక విధంగా వివరించారు నిర్దుష్టంగా ఇది అని ఆశించకుండా.. మెదడును క్లీన్ స్లేట్ గా ఉంచుకుని సహజంగా మీ శరీరం ఏవిధమైన అనుభూతిని మీకందించిందో దానిని ఆస్వాదించడం మంచిపద్దతి.

ఈ కోర్స్ ఏదో ఒక కల్ట్ ని ప్రోత్సహించడమో మతాన్ని ప్రోత్సహించడమో చేయదు. దీని ముఖ్యోద్దేశ్యం నిన్ను నువ్వు తెలుసుకో అని నేర్పించడమే. ఆనందాన్ని వాయిదావేయకుండా ప్రతిక్షణాన్ని తక్షణమే ఆనందంగా గడుపు, నువ్వు ఒక మాఫియా డాన్ అయినా నువు చేసే పనిని శ్రద్దగా ఆనందంగా చేయి. అలానే ఇతరులకు సహాయపడు, వారంలో కొన్ని గంటలు ఏదో ఒకరకమైనసేవ తోగడుపు, ఇలాటి మంచి మాటలు, అలవాట్లు చాలా చెప్తారు. అవకాశమున్న ప్రతిఒక్కరు మీకు దగ్గరలో ఉన్న చోట ఈ కోర్స్ చేయండి. వీలైతే బెంగళూరు  ఆశ్రమానికి వచ్చి ఈ కోర్స్ చేయండి ఖచ్చితంగా ఆశ్రమంలోని జీవనశైలి వైవిధ్యంగా ఉండటమే కాక కోర్స్ మీ శరీరానికి మేలు చేస్తుంది అలానే ఈ అనుభవం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కోర్స్ ఒక ఎత్తైతే సాయంత్రంపూట ఆశ్రమంలో గంటన్నరపాటు జరిగే సత్సంగ్ మరో ప్రత్యేకం, భజనలు పాటలలో అంతమంది యువత పాల్గొనడం మనం మరెక్కడా చూడం, వాటితర్వాత గురూజీ ప్రసంగం ఉంటుంది. ఆయన చాలామంచి విషయాలపై ప్రసంగం ఒకోసారి శిష్యుల ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటారు. ఈ సత్సంగ్ జరిగే విశాలాక్షిమంటపంలో నే గమనించిన విశేషమేమిటంటే లోపల హాల్ అంతా దేదీప్యమానంగా వెలుగుతుంటుంది కానీ ఎక్కడాలైట్ కనపడదు, డైరెక్ట్ గా మీ కన్నుల్లోపడి ఇబ్బంది పెట్టదు.

నేను ఈ గురువారం నుండి సోమవారంవరకూ (17th thru 21st) పార్ట్ 2 కోర్స్ చేయడానికి మరలా ఆశ్రమానికి వచ్చాను ప్రస్తుతం ఆశ్రమం నుండే ఈటపా ప్రచురిస్తున్నాను. ఆశ్రమ రిసెప్షన్ లో వెల్కం హోం  అని ఉంటుంది అచ్చంగా అలాగే నేను మా ఇంటికి వచ్చినట్లు ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా ఈ కోర్స్ కూడా నాకు ఆనందాన్ని అందిస్తుంది అని అనుకుంటున్నాను.

ఆసక్తి ఉన్నవారు మరిన్ని వివరాలకొరకు ఈ వెబ్సైట్స్ చూడండి.

  http://www.artofliving.org/intl/Portals/0/press/PressKit/TheArtofLiving-AnOverview.pdf

  http://www.artofliving.org/

బెంగళూరు లోని కోర్స్ వివరాల కొరకు ఇక్కడ నొక్కండి

10 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వివరించారు. నిజమే సుదర్శన క్రియ ఎవరికి వారు చేసి అనుభవించాలి. కోర్సు చెయ్యటమే కాదు తర్వాత దానిని రోజూ ఆచరిస్తేనే ఫలితం బాగుంటుంది (మీకు చెప్తున్నాను కాని నేను ఓ సంవత్సరం చేసి మానేసాను:))))).

    రిప్లయితొలగించండి
  2. మంచి విషయం తెలియచేశారు ...మీరుపొందిన ఆనందాన్ని మా అందరితో పంచుకోవడమే కదా సంఘశ్చత్వమ్?

    రిప్లయితొలగించండి
  3. వేణు, గురూపదేశం, సత్సంగ్ అన్నవి అందుకే ముఖ్యం. నేను సహజమార్గ్ లో జీవితంలోని సరళతని నేర్చుకున్నాను. బసంత్ పంచమికి జరిగే సామూహిక ప్రోగ్రాంస్ వలన స్వఛ్ఛంద సేవకులు, పరిమిత సదుపాయాలతో గడపటం తెలుసుకున్నాను. చాలా హంబుల్ గా జీవించటం అలవడుతుంది. ఆ రకంగా మీది నాది వేర్వేరు బాణి. అయినా గానీ, ధ్యానం వలన మనసుని నిగ్రహించటం కాదు నియంత్రించటం అన్నది అలవడుతుంది. మీరు వున్న ఈ కోర్స్/కాంప్ మీరనుకున్న సత్ఫలితాలని ఇవ్వాలని కోరుకుంటూ...

    రిప్లయితొలగించండి
  4. మీరు ఇలా ఊరించి ఊరించి వ్రాయడం ఏమీ బాలేదని తెలియచేసుకుంటున్నాను అధ్యక్షా...!!! :)

    రిప్లయితొలగించండి
  5. ఫోటోలతో సహా చాలా చక్కగా వివరించారు వేణూ.. అసలు ఆ ప్రాంగణంలోకి అడుగుపెడుతూనే సగం ప్రశాంతత వచ్చేస్తుందేమో కదా! ఇవాళ్టి ఒత్తిడి ప్రపంచంలో ఇలాంటి కోర్సెస్ చాలా ఉపయోగపడతాయి.. అయితే పార్ట్ 2 వివరాల కోసం చూస్తుంటాము మరి :-)

    రిప్లయితొలగించండి
  6. Karthik Thanks a lot. You are absolutely right. Ashram Rocks!!

    ఫణి గారు నెనర్లు.

    సిరిసిరిమువ్వగారు నెనర్లు :-) మీరు చెప్పినది అక్షరసత్యం కేవలం కోర్స్ చేసి వదిలేయడం వలన ఉపయోగంలేదు. ఆ సాధన క్రమం తప్పకుండా చేస్తే దాని ఫలితాలను మరింత పొందగలుగుతాం. మీరు సంవత్సరం రోజులపాటు క్రమంగా చేశారంటే గ్రేట్ :-) నేను ఎన్నాళ్ళు కొనసాగించగలనో చూడాలి.

    పరిమళంగారు నెనర్లు. మంచి మాట చెప్పారు నిజమే.

    ఉషగారు నెనర్లు. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు. మంచి విషయాలను పంచుకున్నందుకు మరోమారు నెనర్లు.

    మేధగారు నెనర్లు. బేసిక్ కోర్స్ ఆశ్రమంలో ప్రతి శుక్రవారం ఉంటుందండీ ఒక వారాంతం గురువారం సాయంత్రం వెళ్ళి రిజిష్టర్ చేసేసుకోండి. ఆశ్రమం తప్పక చూడాల్సిన ప్రదేశం, మీరు శాఖాహారులైతే అక్కడి భోజనం కూడా చాలా నచ్చుతుంది. మనకి మనం తప్పక ఇచ్చుకోవలసిన అతివిలువైన గిఫ్ట్ ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్.

    నిషిగంధ గారు నెనర్లు. నిజమే అక్కడి వేదపాఠశాలలోనూ, కోర్స్ చేసేవారు అంతా నిత్య ఓంకారనాదాలు పలుకుతూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆశ్రమ వాతావరణమంతా ఓ విధమైన వైబ్రేషన్ తో నిండి ఉంటుంది. నిజంచెప్పాలంటే నేను అక్కడ ఉన్నన్ని రోజులు నా కష్టాలు ఆఫీసు లో విషయాలు అన్నీ మరచి ఆనందంగా గడిపాను. ఆశ్రమం నుండి బయల్దేరి అక్కడి నుండి దూరమయ్యే కొద్దీ ఒక్కోటిగా మళ్ళీ అన్ని అలోచనలు వచ్చి మనసును చేరుకున్నాయి.

    రిప్లయితొలగించండి
  7. మీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుభవాలు బాగున్నాయండీ .. నిన్న మీ బ్లాగ్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పోస్టులు చదువుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది.. మా వారికి చాలా మంచి ఫ్రెండ్ ఒకరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ .. ఆయనెప్పుడూ కార్లో కానీ, ఇంట్లో కానీ "జియా ధడక్ ధడక్ జాయె" అనే హిందీ పాట వింటూ అదొక తన్మయత్వాన్ని అనుభవించేవాడు .. నాకేమీ అర్ధం ఆయ్యేది కాదు .. వీళ్ళు ఆధ్యాత్మిక గురువులు కదా ఈ పాట ఎలా నచ్చుతుంది అనుకునే దాన్ని .. ఒకసారి నా సందేహాన్ని అడిగేస్తే ఆపాట శ్రీ శ్రీ రవిశంకర్ గారికి ఇష్టమైన పాటట ..
    ఆశ్రమంలో డాన్స్ కూడా చేస్తారని చెప్తూ ఆ వీడియో చూపించారు .. మీరు కూడా వీలైతే చూడండి


    Guruji Rocking Jiya Dhadak Dhadak - Ashram Satsang


    https://www.youtube.com/watch?v=qIaXM_aBV48

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ రాజ్యలక్ష్మి గారు, అవునండీ ఆశ్రమంలో సత్సంగ్ సమయంలో కోలాహలం చూడాల్సిందే వయసుతో సంబంధం లేకుండా అందరినీ సంతోషంగా ఉల్లాసంగా ఉండమని ప్రోత్సహిస్తారు గురూజీ. చాలా భజనలకు మంచి ఉత్సాహమైన డాన్సులు చేస్తుంటారు అందరూ.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.