శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

రామా కనవేమి రా !!

శ్రీ రామ నవమి సంధర్బంగా తోటి బ్లాగరు లందరికీ, పాఠకులకూ, నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతా ఈ పాటికి పూజలు గట్రా ముగించుకుని రేడియో లో కళ్యాణం వింటూ ఉండి ఉంటారు. రేడియో లో వింటం ఏమిటి నా మొహం నేనింకా ఎనభైల లోనే ఉన్నాను !! ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రాం లే కదా... సరే లెండి టీవీ లో చూస్తుండి ఉంటారు. నా మటుకు నాకు శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక ఉషశ్రీ గారి వ్యాఖ్యానం (ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు), ముఖ్యమంత్రి నెత్తిన పెట్టుకుని మరీ తీసుకు వచ్చే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. వాటి తర్వాత వీధి వీధి నా వెలసే నవమి పందిళ్ళు. ఆ పందిళ్ళ లో దొరికే బెల్లం పానకమూ, వడపప్పూ. ఇక ఒకో బజారు లో పోగైన చందాల ను పట్టీ అక్కడ ఉండే కలిగిన వాళ్ళని బట్టీ వాళ్ళ వాళ్ళ శక్తి కి తగ్గట్టు గా ఒకప్పుడు నాటకాలు, కోలాటాలు, డ్యాన్సు లు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత అంటే నేను కాస్త పెద్దయ్యాక 16mm ప్రొజక్టర్ లతో సినిమాలు, ఆ తర్వాత మరికొన్నాళ్ళకి వీధి కొకటి గా వెలసిన దివాకరం వీడియో షాపు నుండి వీడియో క్యాసెట్ లు టీవీ సెట్ లు అద్దెకు తెచ్చి వాటిలో పాత సినిమాలు వేసే వాళ్ళు. ప్రస్తుతం డీవీడీ లతో పైరసీ సినిమాలు వేసే స్థాయి కి ఎదిగి పోయుంటార్లెండి.

అసలీ పానకం వడపప్పు గురించి అడిగితే మీకో చిన్న పిట్ట కధ చెప్పాలి. అంటే అడక్క పొయినా చెప్తా అనుకోండి మరి ఈ బ్లాగే నా సొంత డబ్బా కొట్టుకోడానికి పెట్టుకున్న బ్లాగ్ కదా... కనుక వినండి మరి హ హ "మా తాతలు ముగ్గురు... " అని అంటూ నేను అహనా పెళ్ళంట లో నూతన్ ప్రసాద్ లా నా ఆటో బయోగ్రఫీ అంతా చెప్పబోవడం లేదు లేండి బయపడకండి. నేను ఇంటర్ మీడియట్ నుండీ హాస్టళ్ళ లో ఉండి చదువుకున్నాను. ఇంటర్ విజయవాడ లో కనుక సందు దొరికితే నరసరావు పేట లో ఇంటికి పరిగెట్టే వాడిని. ఇదే అలవాటు వైజాగ్ లో ఇంజనీరింగ్ చేరినా కూడా వదల లేదు. సాధారణంగా పుట్టిన రోజు దగ్గర నుండి చిన్న చిన్న పండగలకు కూడా ఇంటికి వెళ్ళి పోయే వాడ్ని. మహ మహా పరీక్షలని కూడా లెక్క చేయకుండా ఇంటికి వెళ్ళి సరీగ్గా పరీక్ష ముందు రోజో ఆ రోజో ఊర్నుండి దిగిన చరిత్ర మనది. ఇక విషయానికి వస్తే ఇంటరె చదివే టైం లో అవసరం రాలేదు కానీ ఇంజనీరింగ్ లో చేరాక మొదటి ఏడు నవమి కి ఇంటికి వెళ్ళడం కుదర్లేదు. అప్పటికి ఫ్రెషర్స్ పార్టీ అయిపోయినా ఇంకా అడపా దడపా సీనియర్స్ కనిపిస్తే సార్ అని పిలుస్తూనే ఉండే వాళ్ళం అప్పుడప్పుడూ వాళ్ళు కూడా యస్ డీ చెప్పరా అని అడుగుతూనే ఉండే వాళ్ళు..
ఇదిగో వైజాగ్ లో నేను నాలుగేళ్ళు ఉద్దరించిన మా హాస్టల్స్ ఇవే క్లిక్కితే కాస్త పెద్ద ఫోటో తెలుస్తుంది. 7thబ్లాక్ అని ఉన్న దాన్లో మొదట ఏడు ఉన్నాను ఆ తర్వాత కాస్త ముందుకి 4thబ్లాక్ కి వచ్చి అక్కడే మిగిలిన మూడేళ్ళు పూర్తి చేసా.. ఈ మూలనున్నది క్రికెట్ గ్రౌండ్ దాని కధ త్వర లోనే చెప్తా :)

అలాంటి టైం లో ఎందుకో గుర్తు లేదు కానీ శ్రీరామ నవమి కి హాస్టల్ లోనే ఉండాల్సి వచ్చింది. మా మెస్ వాడు పానకం వడపప్పు లాటి పనులేమీ పెట్టుకోకుండా ఎప్పటిలానే సగం ఉడికిన క్యాబేజీ నీళ్ళ కూర, డేగిసా లో వలేసి పడితే కాని కూరగాయ ముక్కలు దొరకని మిక్సుడు వెజిటబులు సాంబార్ చేసేసి చేతులు దులిపేసుకున్నాడు. నవమి రోజు ఎదో తిండి తింటే తిన్నాం కానీ పానకం వడపప్పు లేకుండా ఏమిటి రా రామా!! అని అనుకుని. బయట ఎక్కడకో వెళ్ళి పందిళ్ళ లో తాగడం కాదు అని నేనే పూనుకుని. మెస్ వాడ్ని బతిమి లాడి కొన్ని గిన్నెలు, ఐస్ వాటర్ సంపాదించి భారి ఎత్తున పానకం తయారు చేసేసి మా బ్లాక్ లో సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా అందరికీ పంచేసా... చేసిందంతా ఖాళీ చేసేసినా ఒక్కోళ్ళు ఒక్కో కామెంట్, ఒకడు మిరియాలు ఎక్కువయ్యాయంటే ఇంకోడు బెల్లం తక్కువైందంటాడు మరొకడు యాలుకలు నలగలేదు బాసు పంటికింద తగుల్తున్నాయ్ అంటాడు. మొత్తం మీద ఆ తర్వాత కొన్ని రోజులు మా సీనియర్స్ ఇక నన్ను యస్ డీ అడగాల్సిన అవసరం లేకుండానే పానకం కేండిడేట్ గా గుర్తు పెట్టుకున్నారు :)

సరే ఇంకా రామనవమి అనగానే నాకు సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట గుర్తొస్తుంది. ఆ పాటా, ఇంకా పందిళ్ళ లో క్రమం తప్పకుండా వేసే లవకుశ లో పాటలు భాస్కర్ గారు తన టపా లో అల్రెడీ వేసేసారు (ఆ టపా ఇక్కడ చూడండి) ఇవేకాక ఇంకా సీతారామ కల్యాణం అనగానే ఖచ్చితంగా ఓ రెండు హరికధలు గుర్తుకు వస్తాయి. ఈ రెండూ సోషల్ సినిమాలకు సంభందించినవైనా అందులో సీతా రాములను చూపించక పోయినా ఆ వర్ణన, సంగీతం, గాత్రం మనల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వాటిలో మొదట గుర్తు వచ్చేది వాగ్దానం సినిమా లో ఘంటసాల గారు గానం చేసిన సీతా కళ్యాణం హరికధ. రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే నమ్మండి. ఈ పాట నాకు పూర్తిగా ఎక్కడా దొరక లేదు. దొరికిన వెంటనే పోస్ట్ చేస్తాను.

ఇక రెండోది స్వాతి ముత్యం సినిమా లోనిది. విశ్వనాధ్ గారి దర్శకత్వం, కమల్ అభినయం, హరికధ, భజన, కోలాటం అన్ని కలిపి ఇళయరాజా గారు స్వరకల్పన చేసిన ఈ పాటను బాలు గారు అలరిస్తారు. నాకు ఈ పాట చాలా ఇష్టమ్ ఎక్కువ సార్లు వినడం వలనో ఏమో దదాపు నోటికి కంఠతా వచ్చు :) కాలేజ్ లో కూడా ఒకరిద్దరు ఫ్రెండ్స్ అడిగి మరీ ఈ పాట పాడించుకునే వారు నా చేత... ఈ పాట శ్రీరామ నవమి సంధర్బంగా మీ కోసం.చిత్రం: స్వాతిముత్యం (1986)
గానం : బాలసుబ్రహ్మణ్యం, జానకి
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజ

రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి..
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమి రా !!

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

||రామా కనవేమి రా||

ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సా నిదమ ప మగరిస
ఒసపరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు తా తకిట తక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దమప మా గరిగ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ.. ఆహ..
క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే.. ఒక యుగమై...
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా..కనవేమిరా..

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడక తైయ్యకు తా ధిమి తా..

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||

సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే ||2||
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె ||2||
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కన వేమిరా ఆ.. ఆ.. ఆ..
రామా కనవేమి రా

10 వ్యాఖ్యలు:

 1. శ్రీకాంత్ గారూ..
  మీరెంతో అందంగా వర్ణించిన ఘంటసాల గారి 'సీతాకల్యాణం' హరికథ నా బ్లాగులో పెట్టాను.
  విని ఆనందించండి. నాక్కూడా ఇవ్వాళ సీతారామ కళ్యాణం పాట, స్వాతి ముత్యం పాట బాగా గుర్తొస్తున్నాయి. పొద్దున్నుంచీ అవే వింటున్నా :) రామా కనవేమిరా పాట చక్కగా మొత్తం రాశారు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అపచారం అపచారం ఎంత అపచారం జరిగిపోయిఉండేది.. ఈ రోజు నవమనే విషయం ఎలా మర్చిపోయాను...కూడలి చూడకపోతే నిజానికి పండగ చేసేదాన్నే కానేమో .. ప్రొద్దున్నే బాస్కర రామ రాజుగారి వడపప్పు,పానకం పోస్ట్ చూడగానే పరుగున పానకం ,వడపప్పు చేసి స్వామికి పూజ చేసి మీ పుణ్యమా అని రాములవారు కళ్యాణం కూడా విన్నాను .. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీరామ నవమి శుభాకాంక్షలు వేణు గారు !నేస్తం గారు కంగారు పడకండి రేపు అనుకుంటా పండుగ !

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వేణు శ్రీ గారు , సీతారాముల కళ్యాణ వైభోగాన్ని అందంగా వర్ణించారు .మీరుపాడినది పెట్టరనుకున్నా ...ప్చ్ .. :)
  మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలండీ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఆలస్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు :) ఇప్పుడే చూస్తున్నా టపా :( స్వాతి ముత్యం సాంగ్ సూపర్ సాంగ్ .. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మధుర వాణి గారు నెనర్లు, సీతాకళ్యాణం పాట ఇచ్చినందుకు ధన్యవాదాలండీ.

  నేస్తం నెనర్లు, నేను క్యాలెండర్ ప్రకారం శుక్రవారం అనుకున్నానండీ కానీ భద్రాద్రి లో కళ్యాణం శనివారం చేసారుట కనుక శనివారమే పండగట.

  శ్రావ్య గారు నెనర్లు.

  పరిమళం గారు నెనర్లు, నాకు అంత లేదండీ అప్పుడంటే ఏదో పాడేసేవాడ్ని యూత్ కాబట్టి ఎలా ఉన్నా తలాడించే వాళ్ళు. కానీ సాధన బొత్తిగా లేని ప్రస్తుత సమయం లో పాడితే అంతా కలిసి "నను బ్రోవమని చెప్పవే... సీతమ్మ తల్లీ...ఈ వేణు గాడి పీడ నుండి..." అని నా బుర్ర రామకీర్తన పాడేస్తారు.

  చైతన్య గారు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ప్చ్, ఎంత తేలిగ్గా నన్ను ఆ గతంలోకి పంపేసారు? అబ్బా పానకమంత తీయని జ్ఞాపకాలు, వడపప్పంత ఆరోగ్యకరమైన వేడుకల స్మృతులు. నాకు అమ్మమ్మాగారి వూర్లో వంతులు పందాలు వేసుకుని రెండో మూడో జట్లగా విడిపోయి బిందెలకొద్దీ పానకం పంపే కుర్రకారు జనం గుర్తుకొచ్చారు. ఇక నాన్న గారు పనిచేసే కాలనీల్లో మాకు ఎలాగూ తగిన గుర్తింపు, నాన్న గారి ప్రమేయంతో జరుపబడే గుడి కార్యక్రమాల్లో ప్రాముఖ్యత వుండేది. వడ్డించువాడు మన వాడైతే అన్న రీతిలో పూజారి గారు, ఆయన కుమారులు మా ముఖాలు బాగా గుర్తు పెట్టుకునేవారు. అదొక ఆనందం, గర్వం, ఎక్కడున్నా ఆయన మా దగ్గరికి వచ్చి తీర్థ, ప్రసాదాలు ఇచ్చి వెళ్ళేవారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఉష గారు మీ ఙ్ఞాపకాలను ఇక్కడ పంచుకున్నందుకు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. meeru paadina paata kooda pettochu kadandi.vini santoshistaamu, mee gonthulo.

  post boldantha bagundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు సుమలత గారు. హ హ నా గొంతు విని సంతోషించలేరనే నమ్మకంతోనే పెట్ట లేదండీ :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.