అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

శుక్రవారం, జనవరి 22, 2016

అమ్మ జ్ఞాపకాలతో...

అపుడు నాకు తొమ్మిదేళ్ళుంటాయేమో.. ఓ మండు వేసవి మిట్ట మద్యాహ్నం.. గుంటూరు నగరం, అరండల్ పేటలో నడిరోడ్డు.. సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.. నేను మాత్రం.. "పో.. పోవోయ్ చుప్పనాతి సూరీడా నీ ఎండ నన్నేం చేయలేదు నా దగ్గర మా అమ్మ చీర చెంగుంది.." అని సూరీడ్ని సవాలు చేస్తూ అమ్మ చీర కొంగులో తల దాచేసుకుని.. అమ్మ చేతిని గాట్టిగా పట్టుకుని వడి వడిగా నడుస్తూ ఉన్నాను.. చుట్టూ ఏవో రంగు రంగుల పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి కాని ఇంత లావు కళ్ళజోడు పెట్టుకున్నా కళ్ళు మసక మసక గా ఉండి సరిగా కనపడడం లేదు.. 

పొద్దున్న వరకూ చక్కగా ఉన్న కంటి చూపుని ఇలా ఐడ్రాప్స్ వేసి మసకబారేలా చేసిన డాక్టర్ గారిని మరో మారు తిట్టుకుంటూ అమ్మ చేతిని మరింత బిగించి పట్టుకుని తన వెంట నడుస్తున్నా.. ఇంతలో ఒక పెద్ద భవనం కనిపించింది.. "వచ్చేశాం నాన్నా ఇదిగో ఇదే.. ఇంత దూరం ఉంటుందనుకోలేదు వెళ్ళేప్పుడు రిక్షాలో వెళ్దాంలే" అంది అమ్మ... లోపలికి వెళ్తే ఫ్యామిలీ సెక్షన్ పైకి వెళ్ళాలన్నారు అబ్బా ఇపుడు భోజనం కోసం మళ్ళీ ఇన్ని మెట్లెక్కాలా.. ఎంచక్కా మా నర్సాపేటలో ఐతేనా రోడ్ మీద నుండి ఇలా అడుగు లోపలికి పెడితే కుర్చీలేసి కూర్చోబెట్టి పరోఠాలు వడ్డించేస్తారు కేరళా హోటల్ వాళ్ళు.. అనుకుంటూ పైకెక్కాను.. 

ఇరుకుగా ఉన్న మెట్లు ఎక్కి పైకి చేరి తలుపు తీయగానే చల్లటి గాలి మొహం మీద హాయిగా తగిలింది.. మనకి జ్వరం వచ్చినపుడు అమ్మ చల్లని చేతితో మొహం మీద తడిమితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా అనిపించింది. ఆహా ఏమి హాయిలే హలా అనుకుంటూ లోపలకి అడుగుపెట్టాను.. కళ్ళలో వేసిన ఐడ్రాప్స్ ఎఫెక్ట్ ఏమో డ్రీమ్ సీక్వెన్స్ లోలా లైట్స్ చుట్టూ హేజ్ లా పరుచుకుని గ్లాస్ పార్టీషన్స్ తో అందమైన ఇంటీరియర్ కళ్ళకి విందు చేసింది. ఊర్లో వీధి చివరి కాకా హోటల్ సెంటర్ లో కేరళా హోటల్ తప్ప తెలియని నాకు ఏదో ఇంద్ర లోకంలోకి అడుగు పెట్టినట్లు అనిపించింది. 

ఇక అక్కడ ఇచ్చే మంచినీళ్ళ నుండి భోజనం అయ్యాక ఇచ్చిన పాన్ వరకూ నాకు ప్రతీదీ అద్భుతమే.. వేటికవే ప్రత్యేకంగా ఉన్న అరలు గా ఉన్న ప్లేట్ లో పప్పు వేపుడు ఇగురు సాంబార్ రసం పెరుగు అంటూ పలు రకాల కూరలు వాటన్నిటికి ముందుగా పలావ్ రైస్ చిన్న చిన్న పూరీలు చిన్న గ్లాసుడు ఫ్రూట్ జ్యూస్ అన్నీ వేటికవే ప్రత్యేకం.  ఇక నేతి మైసూర్ పాక్ మాధుర్యమైతే మాటల్లో చెప్పలేను.. దాని ఘుమఘుమలూ కమ్మటి రుచీ ఇప్పటికీ ఇంకా ఫ్రెష్ గా గుర్తొస్తుంటాయి. పాపం అమ్మ కొంచెం రుచి చూసి తన స్వీట్ కూడా నాకే ఇచ్చేసింది. 

ఒక్క మైసూర్ పాకేనా.. ఏదైనా అమ్మ నాతో షేర్ చేస్కోవాల్సిందే.. అసలదేంటో కానీ చిన్నపుడు నేను ఎన్ని తినుబండారాలు ఎంత తిన్నా అంత రుచి ఉండేది కాదు కానీ అమ్మ ప్లేట్ లోంచి తీసుకుంటే వచ్చే రుచే వేరు. నా భోజనం అంతా ఐపోయాకైనా సరే అమ్మ తింటూంటే పెరుగన్నం లోంచైనా ఓ ముద్ద తింటే కానీ కడుపు నిండినట్లు అనిపించేది కాదసలు. ఇక ముద్ద పప్పు ఆవకాయ నెయ్యి కలిపి వేళ్ళకంటిన గుజ్జు గోరుముద్దలు చేసి తినిపిస్తే మహాప్రభో ఆ రుచి ఇన్నేళ్ళలో ఇంక వేటికీ రాలేదంటే నమ్మండి. అంతెందుకు అదే ముద్దలు మనంతట మనం తిన్నా ఆ రుచి మాత్రం రాదు.

 
చిన్నతనంలో ఎక్కువగా బజారు వెళ్ళాలన్నా ఊళ్ళు తిరగాలన్నా నాన్న వెంటే వెళ్ళే వాడ్ని కానీ ఒకోసారి నాన్న బాగా బిజీగా ఉండి వీలు పడనప్పుడు అమ్మ తీస్కెళ్ళాల్సి వచ్చేది. ముఖ్యంగా నేను చిన్నతనం నుండే ఇంత లావు కళ్ళద్దాలు పెట్టుకోవాల్సి వచ్చేది కదా సో అప్పట్లో మేమున్న నర్సరావుపేటలో మంచి డాక్టర్ లేరని చెప్పి గుంటూరులో దయాకర్ గారి దగ్గర చెక్ చేయించే వాళ్ళు మొదటిసారి అమ్మా నాన్నా ఇద్దరూ వచ్చినా ఆ తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఓ సారి వీలుని బట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను తీస్కెళ్ళి చెకప్ చేయించేవారు. 

ఐతే చిన్నతనం కావడంతో వైద్యానికి వెళ్తున్నామన్న స్పృహ కంటే ఎక్కువగా అదేదో సరదాగా పిక్నిక్ కి వెళ్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు, అమ్మ తీస్కెళ్తే అది మరీ ఎక్కువ. రైల్లో ప్రయాణం మొదలు బోలెడన్ని కథలు కబుర్లు వింతలూ విశేషాలు ఓహో అద్భుతం. ఒకోసారి నాన్నారితో వెళ్ళినపుడు మాంచి సినిమా చూసే అవకాశం వస్తే అమ్మతో వెళ్ళినపుడు గీతాకేఫ్ లోని ఏసీ రెస్టారెంట్ లో కమ్మటి భోజనం చేసే అవకాశం దొరికేది. అదిగో అలాంటి ఓ సందర్బంలో మొదటి సారి చేసిన గీతాకేఫ్ భోజనం గురించే పైన చెప్పినది..

ఏసీ సినిమా హళ్ళు కూడా పెద్దగా లేని ఎనభయ్యో దశకంలో ఏసీ రెస్టారెంట్ లో భోజనం అంటే మాటలు కాదు. అక్కడి పరిసరాల గురించి భోజనం గురించి భోజనంతో ఇచ్చే నేతి మైసూర్ పాక్ గురించీ స్కూల్లో ఫ్రెండ్స్ కి కథలు కథలుగా వర్ణించి చెప్పే వాడ్ని ఊరెళ్ళివచ్చాక. అసలు ఒక్క ప్రయాణమేంటిలే అమ్మతో గడిపిన ప్రతి క్షణమూ అపురూపమే కదా.

శుక్రవారం, జనవరి 01, 2016

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నేటినుండి కొత్త సంవత్సరం మొదలవుతుంది కదా... 2016కు మనసారా స్వాగతం పలుకుతూ "నిన్నకీ నేటికీ ఏం మారిందనీ గోడమీద కాలెండరు తప్ప" అంటూ నిరుత్సాహపరిచే ఆలోచనలకు తావివ్వకుండా.. నిన్నటికన్నా రేపు మెరుగ్గా ఉంటుందనే నమ్మకమే నేటికి ఇంధనం కనుక ఆశావహ దృక్పధంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ బ్లాగ్ మిత్రులు అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ కొత్త ఏడాదిలో మీ దిగుళ్ళు వందోవంతవ్వాలనీ సంతోషాలు వందింతలవ్వాలనీ మనసారా కోరుకుంటున్నాను.

బ్లాగులకు సంబంధించినంత వరకూ 2015 వెళ్తూ వెళ్తూ మిగిల్చిన విషాదం కూడలి అస్తమయం. ఇన్నేళ్ళగా తెలుగు బ్లాగులకు నిర్విరామంగా అందించిన సేవలను నిలిపివేస్తూ కూడలి మూసివేయాలనే నిర్ణయం వెనుక కారణం తెలియదు కానీ తెలుగు బ్లాగులకు వారు అందించిన సేవలను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. నా బ్లాగ్స్ కు సంబంధించినంత వరకూ ఎన్ని అగ్రిగేటర్స్ వచ్చినా కూడా నిన్న మొన్నటి వరకూ ట్రాఫిక్ సోర్స్ లో ప్రధమంగా నిలిచింది "కూడలి" మాత్రమే. 

నేను బ్లాగు వ్రాయడం ప్రారంభించిన తొలిరోజుల్లో అంటే 2008 టైమ్ లో కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నంత సేపు ఒక విండోలో కూడలి నిత్యం ఓపెన్ చేసే ఉంచేవాడ్ని. అలాగే ఏదైనా కొత్త పోస్ట్ వ్రాసిన ప్రతిసారి అందులో కనిపించేవరకూ రిఫ్రెష్ చేస్తూ చెక్ చేసుకునే వాడ్ని. అటువంటి కూడలిని ఈ మధ్య తెరిచినది చాలా తక్కువ సార్లే అయినా కూడా ఇకపై పని చేయదని తెలిసి దిగులుగా అనిపిస్తుంది.

తెలుగు బ్లాగుల గురించి అసలేమీ తెలియని రోజుల్లో వ్రాసే వారిని అందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఒకరితో ఒకరికి పరిచయాలను పెంచుకోవడంలోనూ మరిన్ని బ్లాగుల గురించి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. కూడలే కనుక లేకపోతే నేను చాలా మంది ఆత్మీయ మిత్రులను కలుసుకోగలిగి ఉండేవాడ్ని కాదు. బ్లాగులు వ్రాసే అలవాటే చాలా వరకు తగ్గిపోయిన  ఈ రోజుల్లో కూడలి నిర్ణయం సబబే అనుకోవచ్చేమో. ఏదేమైనా ఇన్నేళ్ళగా కూడలి అందించిన సేవలకు వీవెన్ గారికి తనకి సాయపడిన ఇతర నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.