అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

సోమవారం, జులై 29, 2013

భాగ్ మిల్కా భాగ్

నాకు నచ్చిన సినిమాలంటూ ఈ బ్లాగ్ లో రాస్తుంటాను కానీ ఒకోసారి మరీ నచ్చిన సినిమాల గురించి అసలు పోస్ట్ రాసే సాహసం చేయను. ఎందుకంటే కొన్ని సినిమాలను చూసి ఆస్వాదించగలమే కానీ విశ్లేషించలేం. అలాంటి వాటిలో “భాగ్ మిల్కా భాగ్” కూడా ఒకటి.

అయితే నేనీరోజు వరకూ వాయిదా వేసినట్లు సినిమా నిడివి గురించి భయపడి చూడకుండా ఎవరైనా మిగిలిపోయి ఒక మంచి సినిమాను మిస్ అవుతారేమోనని ఈ పోస్ట్ రాస్తున్నాను. మూడు గంటల తొమ్మిది నిముషాల ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు ఖచ్చితంగా సాగదీసినట్లు అనిపించవచ్చు. సినిమాలో ఒక అరగంట సులువుగా ట్రిమ్ చేయగల సన్నివేశాలున్నట్లు నాకు కూడా అనిపించింది.

కానీ మనం బయోపిక్ చూస్తున్నాం అనే విషయం గుర్తుంచుకోండి, జీవితంలో జరిగే అన్ని సంఘటనలు ఆసక్తికరంగా ఉండవు కానీ జరుగుతాయి. ఓ అరగంట పాటు బోర్ భరించడానికి సిద్దమైతే రెండున్నరగంటల అద్భుతాన్ని వీక్షించే అవకాశం మీదవుతుంది.

సినిమాలో ఫరాన్ అక్తర్ ఎక్కడా నాకు కనిపించలేదు కేవలం మిల్కాసింగ్ మాత్రమే కనిపించాడు. ఈ సినిమా కోసం తనని తాను మలచుకున్న తీరు తన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది, తన కోసం ఈ సినిమా చూసేయచ్చు. చిన్నప్పటి మిల్కాగా చేసిన మాస్టర్ జప్ తేజ్ సింగ్ కూడా గుర్తుండి పోతాడు. మిల్కా సింగ్ ని చిన్నప్పటి నుండి అమ్మలా చూసుకునే అక్కగా దివ్యాదత్తా చాలా బాగా చేసింది. సోనం కపూర్ ఈజ్ క్యూట్.

ఈ సినిమాలో మనసుని తాకే సన్నివేశాలున్నాయ్, సున్నితమైన ప్రేమ ఉంది, చక్కని హాస్యం ఉంది. అద్భుతమైన నేపధ్య సంగీతం ఉంది, అది సినిమాటోగ్రఫీతో కలిసి ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందంటే సినిమా చూస్తూ అథ్లెట్స్ తో పాటు మనమూ పరిగెడతాం, మిల్కా ఎమోషన్స్ ని మన ఎమోషన్స్ గా ఓన్ చేసుకుంటాం. సినిమా అంతా చిన్న చిన్న ఫ్లాష్బాక్ ఎపిసోడ్స్ తో ప్రసూన్ జోషీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది.

ఒక మనిషి తన పరిమితులను ఎంతవరకూ స్ట్రెచ్ చేయగలడు, తనతో తాను యుద్దంచేసి అన్నిరకాల భయాలను బలహీనతలను జయించి తనని తాను విజేతగా ఎలా నిలుపుకున్నాడు అనేది తెలుసుకోడానికి ఈ సినిమా చూడండి. ఇది ఓ రచయిత ఊహల్లోంచి పుట్టిన పాత్రకాదు నిజజీవితంలోనుండి పుట్టిన పాత్ర.

ఈ సినిమా గురించి సమీక్షలు విశ్లేషణలు చదివింది చాలు, జూలై పన్నెండో తారీఖున విడుదలైన ఈ సినిమా మీరు ఇంకా చూసి ఉండకపోతే వెంటనే ఈ క్రింది ట్రైలర్ చూడండి అది ఏమాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేసినా వెంటనే మీరీ సినిమా చూడండి నిరుత్సాహ పరచదు, ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగులుస్తుంది.

ఈ సినిమా Rottentomatoes రేటింగ్ : 83% ఫ్రెష్  
ఈ సినిమా IMDB రేటింగ్ :  Bhaag Milkha Bhaag (2013) on IMDb


ఆదివారం, జులై 28, 2013

ఈ బాలుడూ మహా చోరుడు సుమీ!!

అవి నేను మా పాత వీధి బళ్ళోనే కొత్తగా నాలుగో తరగతిలో చేరిన రోజులు. ఆ ఏడాది మా బళ్ళో హనుమంతరావ్ అని ఒకడు చేరాడు. నిజానికి వాడి వయసు ప్రకారం వాడు ఏ ఏడోతరగతిలోనో ఉండాల్సిన వాడు కానీ డిటెన్షన్స్ తో బళ్ళు మారి ఇంకా నాలుగులోనే ఉన్నాడు. మా అందరికంటే పెద్దాడవడంతో వాడికి తెలియని విషయం, చేయని అల్లరి ఉండేది కాదు. నాఖర్మ కొద్దీ వాడు నాకు ఆర్యా-2 లాంటి ఫ్రెండ్. నేనెంత వదిలించుకోవాలని చూసినా తుమ్మబంకలా అంటుకునేవాడు.

వాడిదగ్గర నేర్చుకునే కొత్త కొత్త ఆటలు, ఇంకా స్కూల్ దగ్గరలో ముళ్ళకంపల్లోకి సైతం ధైర్యంగా వెళ్ళి కోసుకొచ్చుకున్న సీమ చింతకాయలు, రేగుపళ్ళు, చింతకాయలు లాంటివాటిలో వాటా తీస్కోడం బానే ఉండేది కానీ వీడితో కలిసి అల్లరి చేస్తూ స్కూల్ పక్కనే ఉన్న మా ఇంట్లో వాళ్ళకి నేనెక్కడ దొరికిపోతానో అని అనుక్షణం భయంతో చచ్చేవాడ్ని. వాడికి ఎక్కడెక్కడి డబ్బులు చాలేవి కాదు అమ్మ ఇంటర్వల్ లో కొనుక్కోమని నాకు ఇచ్చే పదిపైసలు బతిమాలో భయపెట్టో వాడే తీసేస్కునేవాడు.

ఆటల్లో పందెంగా నోట్ బుక్స్ మధ్యలో ఉండే తెల్లకాయితపు ఠావులు పెట్టి నిక్కచ్చిగా అవి వసూలు చేసేవాడు. ఒకోసారి అవి చాలక ఇంటర్వెల్ లో క్లాస్ లో ఎవరూ లేని టైం చూసుకుని పిల్లల నోట్సుల్లో పేపర్లు దొంగతనం చేసేవాడు వాడికి పార్టనర్ ని నేను :-) ఇదే నాకు గుర్తుండి నేను చేసిన మొదటి దొంగతనం. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో ఒకోసారి నేను రానురా అని చెప్పి తప్పించుకోడానికి నా నోట్స్ లో పేపర్లు కూడా యధేచ్చగా చింపి  ఇచ్చేసేవాడ్ని. అయితే నా నోట్సులన్నీ ఒకటొకటిగా సైజ్ తగ్గిపోడం మా ఇంట్లో అమ్మానాన్న ఇద్దరూ గమనించారు.  

నన్ను అడిగితే "ఏమీ తగ్గలేదు" అని కాసేపు బుకాయించినా వాళ్ళు పాత కొత్త నోట్సులు కంపేర్ చేసి చూపించేసరికి “నాకు తెలియకుండా ఎవరో కొట్టేస్తున్నారమ్మా...” అని అలవోకగా ఆబద్దమాడేసి ఆ విషయం మర్చిపోయాను. కానీ అలా వదిలేస్తే మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఎందుకవుతారు సైలెంట్ గా నామీద నిఘా పెట్టారు. ఒకరోజు మా హనుమంతు గాడు పేపర్లు నొక్కేయడం నేనేమో గుమ్మంలో కాపలా ఉండి ఎవరైనా వస్తున్నారేమో అని చూస్తూ వాడికి హెల్ప్ చేయడం మా వాళ్ళ దృష్టిలో పడింది. ఇంక అంతే ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చాక అమ్మా నాన్న ఇద్దరి చేతిలో దెబ్బలు పడ్డాయ్. నా లైఫ్ లో నాకు గుర్తున్నంతవరకూ వాళ్ళతో దెబ్బలు తిన్న సంధర్బం అదొక్కటే. అన్నేళ్ళుగా ఎపుడూ చేయిచేస్కోని వాళ్లు ఆపని చేసేసరికి బాగానే బుద్దొచ్చి వెంటనే హెడ్ మాస్టార్ కి కంప్లైంట్ చేస్తానని బెదిరించి హనుమంతుగాడి స్నేహం వదిలించుకున్నా.

అంత మాత్రం చేత నేనేదో బుద్దిమంతుడ్ని అయిపోయాను అనుకుంటున్నారా హహహ :-) బుద్దిసంగతి ఎలా ఉన్నా ఒక విషయం స్పష్టంగా అర్ధమైంది “అల్లరి చేసినా కూడా పెద్దోళ్ళకి దొరికిపోకుండా చేయాలి” అనే విషయం వారం రోజులు తగ్గని వాతల సాక్షిగా బోధపడింది :-) ఐతే అప్పటినుండీ నేను చేసే దొంగతనాలు మా వంటింటికే పరిమితం చేశా. అవికూడా ఆ వయసులోనే ఎంతో ప్లాన్డ్ గా చేసే వాడ్ని.
  
ఉదాహరణకి కోటా ప్రకారం అమ్మ మనకి ఇచ్చే ఒకటి రెండు లడ్డూలు చాలేవి కాదు, అదనంగా తినాలనిపించేది. అప్పుడు అమ్మని అడిగితే “అన్నం తినకుండా అన్నీ చిరుతిళ్ళే తింటావేం రా” అని తిడుతుంది కదా... అందుకని సైలెంట్ గా వంటగదిలో లడ్డూల డబ్బాలోనుండి నాలుగు లడ్డూలు తీసి వాటిలో నుండి కొంచెం కొంచెం తుంచుకుని ఒక చిన్న లడ్డూ చేసుకుని ఆ నాలుగింటినీ తుంచినట్లు తెలియకుండా నంబర్ తేడా రాకుండా మళ్ళీ బుద్దిగా కొంచెం చిన్న సైజ్ లడ్డూల్లాగా చుట్టేసి డబ్బాలో పెట్టేసేవాడ్ని. అపుడు ఒకవేళ అమ్మ తర్వాత చూసుకున్నా కూడా లెక్క తేడా రాదు కదా సో చిన్న చిన్న లడ్డూలు చేశాను గాబోలు అనుకుని సరిపెట్టేసుకుంటుంది కానీ మనమీద అనుమానం పడదనమాట.

అలాగే కారప్పూస/జంతికలు/చక్రాలు లాంటివి ఉన్నాయనుకోండి అవి ప్లెయిన్ డబ్బాలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు ఎన్ని కావాలంటే అన్ని తీస్కోవచ్చు అదే లెవల్ తెలిసేలా అడ్డగీతలున్న డబ్బాలోనో లేక నిండుగా ఉన్నపుడో తీస్కోవాలనుకోండీ అపుడు మనకి నచ్చినన్ని పైపైనుండి తీస్కుని లెవల్ తగ్గినట్లు తేడా తెలియకుండా చక్రాలని చేత్తో కొంచెం పైకి లాగి తేలికగా లెవల్ పైకి కనపడేలా సెట్ చేయాలనమాట. కానీ వీటితో అసలు ఇబ్బంది దొంగతనం చేసేప్పుడుకన్నా జోబులో ఎత్తుగా కనపడో, నోట్లో కర కర మంటూనో దొంగని పట్టించేస్తాయ్. అందుకని ఎత్తుగా కనపడకుండా వాటిని కొంచెం చిన్న ముక్కలుగా నలిపేసి జోబులో పోస్కుని ఒక్కోముక్కని ముందు నోట్లో నానేసి అపుడు చప్పుడు రాకుండా తినాలనమాట.

ఇంత ప్లాన్డ్ గా చేసినా ఒకోసారి దొరికిపోతాం. ఒకసారి ఏమైందంటే అప్పుడు నేను ఏడో, ఎనిమిదో చదువుతున్నాను. అమ్మ సగ్గుబియ్యం వడియాలు చేద్దామని మూడు కేజీల సగ్గుబియ్యం తెప్పించి రామనవమికి పానకం చేసుకునే చిన్న స్టీల్ బిందెలో పోసి ఒక అట్టముక్క దానికి మూతగా పెట్టింది. మనకి ఆటల మధ్యలో ఏదో ఒకటి నమలడానికి ఉండాలి టైంకి వంటింట్లో ఏవీ దొరకలేదు సో సగ్గుబియ్యం కూడా తినేవే కదా ట్రైచేసి చూద్దాం అని చూస్తే భలే ఉన్నాయనిపించింది, ఎక్కువసేపు నమలచ్చు పైగా ప్యూర్ స్టార్చ్ కావడంతో ఎనర్జిటిక్ గా కూడా ఉండేవి. ఇక చూస్కోండి పదినిముషాలకోసారి లోపలికి వెళ్ళడం ఆ అట్టముక్కని చేయి మాత్రం పట్టేట్లుగా కొంచెం పైకి లేపి ఓ గుప్పెడు జోబులో పోస్కుని రావడం.

ఇలా ఓ పదిరోజులు పోయాక ఓ ఆదివారం ఉదయం వడియాల కోసం అమ్మ అన్నీ సిద్దం చేస్కుని సగ్గుబియ్యం తీస్కురమ్మంది. నేను కొంచెం టెన్షన్ పడ్డా అయినా “ఆ నేనెన్ని తినుంటా రోజుకి కొన్ని గుప్పెళ్ళేగా మహా ఐతే ఒక అరకేజీ తగ్గుంటాయ్ అమ్మకి తెలీదులే” అనుకుని సైలెంట్ గా బిందె తీస్కొచ్చి ఎదురుగా పెట్టా. మూత తీసిన అమ్మ షాక్... బిత్తరపోయి లోపలికి చేయిపెట్టి బిందెను అటూ ఇటూ తిప్పి ఎంతచూసినా అరకేజీనే ఉన్నాయ్. నేను అరకేజీ తిన్నాననుకుని రెండున్నర కేజీలు తినేసి కేవలం అరకేజీ మిగిల్చానన్న విషయం నాకు అర్ధమైంది. సరుకుల్లో మూడుకేజీలు రాస్తే అరకేజీనే తెచ్చారా అని మొదట సందేహపడ్డారు కానీ మెల్లగా నన్నడిగారు “ఏం జరిగింది నాన్నా?” అంటూ.

ఆబద్దమాడితే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా  తెలుసు కాబట్టి నిజం చెప్పేసి అన్ని తిన్నాననుకోలేదమ్మా అని అమాయకంగా ఫేస్ పెట్టేశాను. ఇక ఆ రోజంతా ఒకటే నవ్వులు, “అన్ని తిని ఎలా అరిగించుకున్నావురా అది కడుపా గ్రైండరేమైనా మింగేశావా?" అని జోకులేసినా ఎక్కడ వాతం చేస్తుందో అని భయపడి వాము, అల్లం మురబ్బా లాంటివి తెప్పించి పెట్టి నాల్రోజులు జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు ఇదే విషయం మీద నాపై జోకులు పడ్డాయనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుకదా. దెబ్బలకన్నా జోకులు చాలా మేలులే అని భరించేశా అనుకోండి.

సరే ఇక అలా అలా పెరిగి పెద్దయ్యాక ఇంజనీరింగ్ లో చేరిన తర్వాత ఎపుడైనా డిన్నర్ కోసం పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళినపుడు వాళ్ళు చివర్లో స్వీట్ సోంఫ్ ఇస్తారు కదా అది ఖర్చీఫ్ లోనో వాడే ఇచ్చే పేపర్ నాప్‌కిన్స్ లోనో పొట్లం కట్టేసి తీస్కొచ్చేయడం బాగా అలవాటైంది. డిమ్ లైటింగ్ ఉండేదేమో ఈ కొట్టేసే కార్యక్రమం నిర్విఘ్నంగా పక్కటేబుల్ వాడిక్కూడా తెలియకుండా చేసేసే వాడ్ని, అది కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశా ఎప్పుడూ ఎవరికీ దొరకలా.

అయితే అసలు క్లెప్టోమానియా అని అనుమానించేంత సంఘటన నాకు ఉద్యోగం వచ్చిన కొన్నేళ్ళకి జరిగింది. అప్పట్లో వృత్తిరీత్యా తరచూ ఇండియాలోనూ అమెరికాలోనూ రకరకాల ఊర్లు తిరుగుతూండేవాడ్ని కంపెనీ డబ్బులే కాబట్టి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో బస చేసే వాడ్ని. ఆ హోటల్స్ లో వాళ్ళు ఇచ్చే హాండ్ టవల్స్, ఒకటీ అరా చిన్న చిన్న డెకరేటివ్ ఆర్టికల్స్, రూం సర్వీస్ కి తెచ్చిన కట్లెరీలో ఆసక్తికరమైనవి ఉంటే అవి ఇలాంటి వాటిలో ఏదో ఒకటి సైలెంట్ గా బాగులో సర్దేసే వాడ్ని, అదికూడా అస్సలు అనుమానం రాకుండా పొరపాటున సర్దినట్లు సర్దేవాడ్ని. ఇది తరచుగా ప్రతి ట్రిప్ లో చేయకపోయినా అప్పుడప్పుడూ హోటల్ కి ఒక ఐటం చొప్పున సావనీర్ లాగా కలెక్ట్ చేసేవాడ్ని. అయితే ఇదంతా పూర్తి స్పృహలో కాకుండా ఏదో యధాలాపంగా జరిగిపోతుండేది కానీ అదృష్టవశాత్తు ఎపుడూ దొరికిపోలేదు.

అలాంటి టైంలో ఒక సారి ఇల్లుమారుతున్నపుడు ఇలా కలెక్ట్ చేసినవి అన్నీ ఓ పది వస్తువులు వరకూ కప్ బోర్డ్ లో ఒకే చోట కనిపించేసరికి అప్పుడు సడన్‌గా షాక్ కొట్టింది. “అరే నాన్న సావనీర్స్ అనేవి నువ్వు తెచ్చుకునేవి కాదురా వాళ్ళు ఇచ్చేవి, ఇది పూర్తిగా దొంగతనమే” అని ఎరుక వచ్చేసరికి ఒక్కసారిగా చాలా ఎంబరాసింగ్‌గా ఫీల్ అయ్యాను. ఒకవేళ దొరికి ఉంటే నా పరువుతో పాటు నేను పని చేస్తున్న కంపెనీ పరువు కూడా ఏమయ్యేదో తలచుకుంటేనే ఒళ్ళు జలదరించింది. ఇలా లాభంలేదని వాటినన్నిటిని అక్కడే డస్ట్ బిన్ లో పడేసి అప్పటినుండీ ఇలాంటి టెండెన్సీ పట్ల కాస్త ఎరుకతో అప్రమత్తంగా ఉండటం ప్రారంభించాను. ఆ తర్వాతెపుడూ మళ్ళీ రిపీట్ అవలేదు. ఆఖరికి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సర్వీస్ మొదలెట్టిన కొత్తలో ఫ్లైట్లో కాంప్లిమెంటరీ హెడ్ ఫోన్స్ ఇచ్చినా కూడా అవి కాంప్లిమెంటరీనే కదా అని ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేస్కున్నాక కానీ ఇంటికి తెచ్చుకోలేదు.       

అవండీ నాలోని తీఫ్ తిరుమలై కబుర్లు. నిన్న నా క్లాస్మేట్స్ చేసిన దొంగతనం గురించీ, ఈరోజు నేను చేసిన సరదా దొంగతనాల గురించీ విన్నారు కదా ఇక ఓ సీరియస్ దొంగతనం (నేను చేసింది కాదులెండి) గురించి వచ్చేనెల్లో తెలుసుకుందాం. నెలా అని అలా ఆవలించకండి... మరి మూడ్రోజుల్లో నెలమారిపోతుంది :-)

శుక్రవారం, జులై 26, 2013

హాస్టల్ – 11 (ఇంటిదొంగను ఈశ్వరుడైనా...)


ఇది నా హాస్టల్ కబుర్లు టపాల సిరీస్ కు కొనసాగింపు. ఆ సిరీస్ గురించి తెలియని వారు ఇక్కడ క్లిక్ చేసి ముందు పది టపాలు చదవచ్చు. 

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెత మీరు వినే ఉంటారు కదా... ఆ ఈశ్వరుడు పట్టలేడేమోకానీ మా AO గారు తలుచుకుంటే మాత్రం పట్టేస్తారు. AO అంటే మా ఇంటర్మీడియెట్ కాలేజ్ Administrative Officer. నిజానికి ప్రిన్సిపల్ అనే పిలవాలి కాకపోతే ఆయనే మా కాలేజ్+రెసిడెన్షియల్ హాస్టల్+పక్కన ఉన్న చిన్న హైస్కూల్ అడ్మినిస్ట్రేషన్ పనులు అన్నీ కూడా చూసుకుంటుంటారు కనుక AO అని ఫిక్స్ చేశారు.

ఆయనపేరు ప్రభాకర్, చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు, నిండైన రూపం, కళ్ళద్దాలుపెట్టుకుని, గుబురుమీసాలతో అప్పుడప్పుడు కొన్నిరోజులు నిండుగా గడ్డంపెంచి, ఎక్కువ రోజులు క్లీన్ షేవ్‌తో, ఎప్పుడూ మడతనలగని ఇస్త్రీబట్టలతో లైట్‌కలర్ షర్ట్‌ని డార్క్‌కలర్ ట్రౌజర్‌లోకి నీట్‌గా టక్‌ చేసి చూపులకి కొంచెం పొట్ట పెంచిన మళయాళ హీరో మమ్ముట్టీలా కనిపిస్తారు.

చూడటానికి హీరోలాగా కనిపిస్తారు కానీ మాపాలిట పెద్ద విలన్, ఛండశాసనుడు. అసలు నేను అక్కడ చదివిన రెండేళ్ళలో ఆయన నవ్వుతుండగా ఓ పదిసార్లకన్నా ఎక్కువ చూసి ఉండను. నేనేమిటీ ఎవ్వరూ చూసి ఉండరు ఇక ఆయన చేతిలో దెబ్బలు తినని స్టూడెంట్ అంటూ ఎవరూ ఉండేవారు కాదు, ఏదోరకంగా అందరమూ ఆయన కోపాన్ని చవిచూసినవాళ్ళమే. పైకి ఆయన్ని అందరమూ తిట్టుకున్నా చాలామందికి సీక్రెట్ గా ఆయనంటే ఒక హీరోవర్షిప్ ఉండేదని నా అనుమానం.

సరే ఇక మన కథానాయకుడు అదేనండీ మా తీఫ్ తిరుమలై దగ్గరకి వస్తే మావాడు ఓ మోస్తరు పొడవు, బక్కపలచని పర్సనాలిటీ, తెల్లటి తెలుపు చటుక్కున చూస్తే బాలీఉడ్ బడ్డింగ్ హీరోలా ఉంటాడు దానికి తోడు పరమ అమాయకమైన ఫేస్. కానీ మావాడు శివలో నాగార్జునలా ఒక గ్యాంగ్ ని వేస్కుని తిరుగుతుండేవాడు. ఆయన గ్యాంగ్ అన్నీ మంచి పనులు చేస్తే మా వాడి గ్యాంగ్ రాత్రుళ్ళు హాస్టల్ గోడదూకి వెళ్ళి పరోఠాలు, బిర్యానీ తెచ్చి అమ్మడం, మధ్యలో తగిలిన చెరుకు తోటలో చెరుకు గడలు కొట్టుకొచ్చి ఇవ్వడం, ఇంకా ఇలాంటి కృష్ణలీలలు కొన్ని చేసేవాడు.


మా క్యాంపస్ మొత్తానికి ఒక చిన్న క్యాంటీన్ కమ్ ప్రొవిజినల్ స్టోర్ ఒకటి ఉండేది పక్కన ఫోటోలో చూపించినంత పోష్ సెటప్ కాకపోయినా అప్పట్లో మా రేంజ్ కి అది పోష్ సెటప్ తోనే ఉండేది ఒక వైపు కౌంటర్ అందులోనే ఒక వైపు కుర్చీలు టేబుల్స్ వేసి ఉండేవి కౌంటర్ లో బేకరీ ఐటంస్ తో పాటు స్టూడెంట్స్ కి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు సబ్బులు, షాంపూలూ, పేస్టులు, బ్రష్షులు, బుక్స్, పెన్సిల్స్ ఇతరత్రా అన్నీ స్టాక్ మెయింటెయిన్ చేసేవాళ్ళు. ఆ ఓనర్స్ రాత్రి ఎనిమిది గంటలకు క్యాంటీన్ మూసేసి పక్కన ఉండే పల్లెకి వెళ్ళిపోయేవాళ్ళు.

క్యాంటీన్ మెయిన్ గేట్ కి దగ్గరలో ఉండడంతో అక్కడి సెక్యూరిటీనే క్యాంటీన్ కు సైతం సెక్యూరిటీ అనమాట. ఐతే వాళ్ళు గేట్ దగ్గర కూర్చుంటారు కదా బయటనుండి వచ్చే వాళ్ళని ఆపగలరు కానీ క్యాంటీన్ వెనక వైపు హాస్టల్ నుండి ఈజీ యాక్సెసిబుల్ గా ఉండేది కనుక హాస్టల్ నుండి ఎవరైనా ఎంటర్ అయితే ఏం చేయలేరు. మా తీఫ్ తిరుమలై ఈ విషయం గమనించాడు ఆలశ్యం చేయకుండా ఒక రోజు ప్లాన్ గీసేశాడు. విజయవంతంగా అమలు పరిచాడు. ఎంత విజయవంతంగా అంటే చోరీ జరిగినట్లు వాళ్ళకే తెలియనంతగా మానేజ్ చేశారా గ్యాంగ్.


ఎలా ఎంటరయ్యే వాళ్ళో తెలీదు కానీ దొంగతనం జరిగిన ఆనవాలేవీ మిగిల్చే వారు కాదు, వెళ్ళినవాళ్ళు కూడా స్వల్పంగా తీస్కొచ్చేవాళ్ళట అంటే కేవలం ఒక వారం పదిరోజులకు సరిపడా స్టఫ్ మాత్రమే తెచ్చేవాళ్ళు. ఎంత జాగ్రత్తగా అంటే ఓనర్స్ సరుకులో తేడా వచ్చినా లెక్కల్లో ఏదో తేడా జరిగిందని అనుకునే వాళ్ళే కానీ దొంగతనం అనుకునే వాళ్ళుకాదు. అలా అవసరమైనపుడల్లా స్టోర్ రూంకి వెళ్ళి తెచ్చుకుంటున్నట్లు తెచ్చుకోవడం మొదలెట్టారు ఇలా కొన్ని రోజులు జరిగాక ఓసారి ఎక్కువ తేవడం జరిగిందో లేక రిపిటీషన్ వల్లనో ఓనర్ వాళ్ళకి అనుమానం వచ్చి మా A.O. గారికి కంప్లైంట్ చేశారు. 

మా చండశాసనుడు గారికి ఒక అలవాటుంది పిల్లలు అక్రమమైన పనులేమన్నా చేస్తున్నారేమో అని చెప్పకుండా  ఉన్నట్లుండి హాస్టల్ లో రూంస్ మొత్తం మెరుపు తనిఖీలు చేయిస్తుంటారు. వాటిల్లో మా వాళ్ళు తెచ్చే దొంగ సరుకు ఎపుడూ బయటపడేది కాదు. సరే తక్కువ తెస్తున్నారు కదా అందుకే దొరకట్లేదేమోలే అనుకునే వాళ్ళం మేము. ఆరోజు కూడా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి రూముల్లో గోలగోలగా టైంపాస్ చేస్తున్నాం ఉన్నట్టుండి “రేయ్..” అంటూ సింహఘర్జన వినిపించింది. అరక్షణంలో అందరం కలుగులో నుండి బయటపడ్డ చిట్టెలుకల్లా రూముల్లోనుండి కారిడార్ లోకి వచ్చేశాం.

పొడవాటి కారిడార్ చివర నుంచుని ఉన్న మా ఛండశాసనుడు “అందరూ ఒక్క నిముషంలో మీ ట్రంకులు తాళాలు తీసి అక్కడే పెట్టి బయటకి వెళ్ళి నుంచోండి, ఒక్కొక్క రూం వాళ్ళని పిలుస్తాను” అని చెప్పారు. సాథారణంగా ఇలాంటి తనిఖీలు వార్డెన్స్ మీద, కొందరు ముఖ్యులైన స్టూడెంట్స్ మీదా వదిలేసి సూపర్వైజ్ చేసే ఆయన ఈ రోజు స్వయంగా రంగంలోకి దిగి ఒకో రూంలో తను కూడా నుంచుని అన్నీ తీయించి చూస్తున్నారు. మాకెవరికీ క్యాంటీన్ ఓనర్ కంప్లైంట్ చేసిన విషయం తెలీదు. నింపాదిగా నుంచుని వేడుక చూస్తున్నాము.


మా తీ.తి గాడి రూం తనిఖీ మొదలైంది, అప్పటికే ఆ రూం వాళ్ళమీద అనుమానముందేమో మరింత జాగ్రత్తగా ఎక్కువ సమయం తీస్కుని వెతికారు కానీ ఏవీ దొరకలేదు పక్కరూం అయిన మమ్మల్ని ఆల్రెడీ పిలవడంతో మేం వెళ్ళి రూం బయట నుంచుని ఎదురు చూస్తున్నాము. A.O. గారు బయటకు వస్తూ యథాలాపంగా తల ఎత్తి గుమ్మం పైకి చూసి ఒక్క నిముషం ఆగి వార్డెన్ గారిని పైన ఉన్న ఎలెక్ట్రిక్ స్విచ్ బోర్డ్ ఓపెన్ చేయమన్నారు.

ఇప్పుడంటే ఎలెక్ట్రిక్ వైరింగ్ అంతా కన్సీల్డ్ గా గోడల్లోంచే లాగేస్తున్నారు కానీ పాత బిల్డింగులకి బయటనుండే ఇచ్చే వారు ఆ వైర్లన్నీ ఒక స్విచ్ బోర్డ్ లోనికి వెళ్ళేవి అది ఒక పెద్ద సూట్ కేస్ తరహాలో తెరచి మూయగల గొళ్ళెం ఉన్న చెక్కబాక్స్ దాని పైన అన్ని రకాల స్విచ్ లు ప్లగ్ పాయింట్స్ బిగించి ఉండేవి. ఆ బోర్డ్ తెరిచినపుడు లోపల వైర్లు ఉన్నాకానీ బోలెడంత ఖాళీ కూడా ఉండేది పైనున్న బొమ్మలో చూపించినట్లు. సో వార్డెన్ మా తీ.తి గాడి రూంలోని ఆ స్విచ్ బోర్డ్ తెరవగానే పైనుండి చాక్లెట్లు, బిస్కట్లు, సబ్బులు, బ్రష్షులు, పేస్టులు వర్షంలా కురవడం మొదలైంది. సో ఇన్ని రోజులు ఆ బోర్డ్ లో దాచడం వల్ల ఎవరికీ దొరకలేదన్న విషయం ఛండశాసనుడితో పాటు మాక్కూడా అర్ధమైంది.

ఇక తనిఖీలు ఆపేసి ఆయన రెగ్యులర్ ఫార్ములా ఉపయోగించారు. “ఎవరు చేశారో చెప్తారా లేక రూంలో ఉన్న అరడజను మందికీ కోటింగ్ ఇచ్చి సస్పెండ్ చేయమంటారా” అని అడిగేసరికి దొంగల గ్యాంగ్ బయటపడింది. ఇక వాళ్ళని అక్కడికక్కడే ఉతికారు చూడండీ.. నా సామిరంగా.. ఒక్కొక్కళ్ళ ఒళ్ళు వాతలు తేలి రంగుమారిపోయింది ఆ తర్వాత పదిరోజులు సస్పెండ్ కూడా చేశారు. ఇంతా చేసి వాళ్ళంతా కూటికి లేక చేస్తున్నారా అంటే కాదు అందరూ లక్షాధికారుల పిల్లలే డబ్బుకు కొదవలేదు కేవలం థ్రిల్ అండ్ సరదా. ఇంకా చెప్పాలంటే క్లెప్టోమానియా ఏమో అని నాకు ఒక డౌట్. అదేంటో మీకు తెలియకపోతే వికీలో ఇక్కడ చూడండి.

ఈ గ్యాంగ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యానేమో తెలీదు కానీ ఈ క్లెప్టోమానియా పురుగు తర్వాత రోజుల్లో ఒకసమయంలో నన్నుకూడా కుట్టింది... సో నాలో ఉన్న ఆ తీఫ్ తిరుమలై గురించి త్వరలో...

బుధవారం, జులై 24, 2013

అత్తారింటికి దారేది – Audio My view.


మనమందరం చిన్నపుడు ఆడుకునే ఆటగుర్తుందా. అరచేతిని తీస్కుని అందులో సున్నాలు చుడుతూ ఆకేసి అని చెప్పి ఆ తర్వాత ఒక్కో వేలు ముడుస్తూ అన్నమేసి, పప్పేసి, నెయ్యేసి అని చెబుతూ అన్ని వేళ్ళు ముడవడం అయ్యాక మన వేళ్ళతో అవతలి వాళ్ళ చేతిమీదుగా నడకసాగిస్తూ అత్తారింటికి దారేది దారేది అని భుజం వరకూ తెచ్చి కితకితలు పెట్టి నవ్వించేవాళ్ళం. చివర్లో కితకితలు పెడతారని తెలుసుకాబట్టి చివరి వరకూ నవ్వకుండా ఉండడమనేది అసాధ్యం ఆట మొదలెట్టగానే ఆటోమాటిక్ గా నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఆ విధంగా అద్యంతం నవ్వులు కురిపించే ఆట అది.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కథ ప్రకారం ఆ ఆటలోని మాట “అత్తారింటికి దారేది” అని టైటిల్ గా పెడదామని అనుకున్నారుట త్రివిక్రం, కానీ పవర్ స్టార్ సినిమాకి పంచ్ అండ్ ఫోర్స్ ఉన్న టైటిల్ కాకుండా ఇలాంటి సాఫ్ట్  ఫామిలీ టైటిల్ పెడితే ఎలా ఒప్పుకుంటారు ఫాన్స్ అయినా హీరోగారైనా అని సందేహిస్తూనే పవన్ కి సజెస్ట్ చేస్తే “మనం సినిమాలో అదే కదా చెప్తున్నాం సందేహించడమెందుకు పెట్టేయండి” అని సెలవిచ్చారుట హీరోగారు. సాధారణ పరిస్థితులలో ఇది పెద్ద విషయమేం కాదు కానీ ఫామిలీలు వారసత్వపు హవా నడుస్తున్న ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో అంత ఫాలోయింగ్ ఉన్న ఒక వారసత్వపు హీరో ఆభేషజాలను వదిలేసి ఇలా ఆలోచించడం బాగుందనిపించింది నాకు.

అలాగే ఆడియో ఫంక్షన్ అనగానే పరిశ్రమ పెద్దలంతా వచ్చి ఈ సినిమా అంతా ఇంతా ఈ హీరో తోపు తురుము వందరోజులు వెయ్యిరోజులు ఆడుద్ది అని హోరెత్తించేసి పాటల గురించి సంగీత దర్శకుడి గురించి కానీ ఇతర క్రూ గురించిగానీ లిరిక్ రైటర్స్ గురించి కానీ ఒకరిద్దరు మొక్కుబడిగా చెప్పడం తప్ప అసలు పట్టించుకోరు. కానీ ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఫ్యామిలీలను వందిమాగధులను పక్కనపెట్టి సినిమాకి పని చేసిన తారాగణం మరియూ టెక్నీషియన్స్ ని మాత్రం పిలిచి పండగ చేస్కుని సినిమా గురించి ప్రేక్షకులకు పరిచయం చేయడం నాకు నచ్చింది.

అలాగే స్టేజ్ మీద సైతం కోటా, ఎమ్మెస్, నదియా, రఘుబాబు లాంటి వారికి విలువనిచ్చి ఆడియో సిడిని సైతం  దేవీశ్రీప్రసాద్ తోనే ఓపెన్ చేయించడం నాకు భలే నచ్చింది. పాపం అన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన దేవీ కూడా ఇలా తనే ఓపెన్ చేయడం ఇదే మొదటి సారవడంతో కాస్త తడబడడం మనం గమనించవచ్చు. మిగిలిన సినిమాలు కూడా ఈ ట్రెండ్ ని అందిపుచ్చుకుంటే  బాగుంటుంది. ఈ ఫంక్షన్స్ లో విసుగొచ్చే మరో అంశం కొత్తపాటలకి రికార్డ్ డాన్సులని తలపించే స్టేజ్ డాన్సులు, అవికూడా తీసేస్తే బాగుంటుంది.
 
సరే ఇక పాటల విషయానికి వస్తే జల్సా, గబ్బర్ సింగ్ సినిమాలను దృష్టిలో పెట్టుకుని వాటిని మించి ఉంటాయని ఆశిస్తున్న అభిమానులను ఒక రకంగా ఈపాటలు నిరాశ పరిచాయనే చెప్పచ్చు. కానీ సినిమా కంటెంట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే పాటలు వాటికి ఇచ్చిన సాహిత్యం అన్నీకూడా సరదాగా సాగి సినిమా కూడా ఎలా ఉండబోతున్నది అనేదానిపై ఒక అంచనాను ఏర్పరచాయి. మెలొడీకి ప్రాధాన్యతనిస్తూ ఆర్కెస్ట్రేషన్ ను కూడా తగ్గించి సంధర్బానుసారంగా కథలో ఒదిగిపోయేలా కంపోజ్ చేశారని అనిపించింది. సినిమా చూశాక ఈ పాటలకు కనెక్ట్ అయి అవి మరింత సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.

ఆరడుగుల బుల్లెట్టూ : శ్రీమణి రాసిన ఈ పాటను విజయప్రకాష్ పాడాడు మొదట వచ్చే సాకీ మాత్రం కార్తికేయన్ పాడాడు. పదునైన పదాలతో అంతే పదునైన మ్యూజిక్ తో సాగిన ఈ పాట ఈ ఆల్బంలో అన్ని పాటలకంటే ఎక్కువ అలరిస్తుంది. హీరోని కీర్తిస్తూనే కథలో తన పాత్ర ఏంటో స్పష్టం చేసే పాట. మూలాలను మరచి వదిలి వెళ్ళిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిన కథానాయకుడి పాత్ర గురించిన పాట. నాకు చాలా నచ్చింది.  

నిన్ను చూడాగానే : దేవీశ్రీ ప్రసాద్ రాసి, స్వరపరచీ, పాడిన గీతమిది. మరదల్ని చూసి తన పరిస్థితేమైందో తెలియజేస్తూ తనతో వచ్చేయమని పిలుస్తూ టీజ్ చేస్తూ అల్లరిగా సాగే పాట. “కృష్ణా రాధలా నొప్పీ బాధలా కలిసుందాం” అంటూ “కాల్చే ప్రమిదలా ముంచే వరదలా చంపావే మరదలా” అంటూ సాగే లైన్స్ నవ్విస్తాయి. మెలొడీలోనే స్లోగా క్రేజీగా సాగే పాట ఇది.

దేవ దేవం భజే : ఇక మిగిలిన నాలుగు పాటలు రామజోగయ్య శాస్త్రిగారే రాశారు. ఒకటిన్నర నిముషం పాటు సాగే ఈ బిట్ సాంగ్ లో సైతం రాముడ్ని కీర్తిస్తూనే హీరో గుణగణాలను వర్ణిస్తూ సాగుతుంది. ఫాన్స్ కి అప్పీలింగ్ గా లేకపోవచ్చేమో కానీ సినిమాలో సందర్బానుసారంగా అర్దవంతంగా ఉంటుందని అనుకుంటున్నాను.

బాపు గారి బొమ్మో : ఆరడుగుల బుల్లెట్ తర్వాత ఆకట్టుకునేది ఈ పాటే. రామజోగయ్య శాస్త్రిగారు రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. మాంచి మెలోడీ ఇది కూడా కథానాయిక గురించి వర్ణిస్తూ టీజింగ్ గా తను ఎలాంటి మాయ చేసిందో తనని ఎలా కట్టిపడేసిందో చెప్తూ సాగే పాట. మాంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది.

కిర్రాకు పుట్టించావే : ట్రాక్ లిస్ట్ విన్నపుడు తెలంగాణాలో కత్తి/కేక లాంటి పదాలకు బదులుగా వాడే కిరాక్ అనే పదాన్ని ఉపయోగించి రాశారనిపించింది కానీ పాట పూర్తి సాహిత్యం ముఖ్యంగా పిచ్చెంకించావే అంటూ కిర్రాకు పుట్టించావే అనడం చూస్తే క్రాక్ ని అలా కిర్రాకు అని పలుకుతూ రాసుకున్నారేమో అనిపించింది. మొత్తానికి హుషారైన బీట్ తో సాగే ఈ పాట కుర్రకారుని ఒక ఊపు ఊపే ఆవకాశం మెండుగా ఉన్నపాట. పాడింది నరేంద్ర. అత్తరేదొ చల్లినావె అత్తగారి పిల్లా.. సిత్తరాల నవ్వుపైన రత్తనాలు జల్లా.. లాంటి లైన్స్ పాడినపుడు వాయిస్ లైట్ గా మార్చి హుషారు తెప్పించేలా పాడాడు.    

టైం టు పార్టీ : ఈ పాటకు మాల్గాడి శుభ స్వరం ఎసెట్ అయింది. మంచి పార్టీ సాంగ్, హెవీ ఆర్కెస్ట్రేషన్ లేకుండానే హుషారు తెప్పించే పాట. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సరదాగా క్రేజీగా సాగాయి. రాప్ తో పాటు పాటలో కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడారు. కుర్రకారుని అలరించే మంచి పార్టీ సాంగ్ ఇది.  

ఈ పాటలు వినడానికీ సాహిత్యం (లిరిక్స్) తెలుసుకోడానికి నా పాటల బ్లాగ్ “పాటతో నేను” లో ఇక్కడ చూడండి.

ఆదివారం, జులై 14, 2013

సాహసం...


తనది పదేళ్ళ సినీ కెరీర్ కానీ తీసింది ఐదే సినిమాలు సంపాదించిన ఖ్యాతి మాత్రం అనంతం. ఐతే-2003, అనుకోకుండా ఒకరోజు-2005(ఇదే కాన్సెప్ట్ తో నాలుగేళ్ళ తర్వాత 2009 లో హాంగోవర్ అనే హాలీఉడ్ సినిమా వచ్చింది), ఒక్కడున్నాడు-2007 (ఇందులో ప్రధానాంశం గుండె మార్పిడి ఐతే లివర్ మార్పిడి ప్రధానంశంగా ఇదే తరహాలో ఐదేళ్ళ తర్వాత 2012 లో హాలీఉడ్ సినిమా విడుదలైంది), ప్రయాణం-2009, ఇపుడు 2013 లో సాహసం.


ఒక సినిమా హిట్ అవగానే అలాంటి సినిమాలే వందలకొద్దీ నిర్మించే అలవాటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను తీసిన సినిమా మళ్ళీ తీయడం దేవుడెరుగు తీసిన జొనర్ లో మళ్ళీ తీయకుండా ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ కన్నా కథా కథనాలపై దృష్టి నిలిపి మంచి సినిమాలు తీస్తూ తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తున్న ఆ దర్శకుడి పేరు చంద్రశేఖర్ యేలేటి. తెలుగు సినీ జగత్తుకు దిశానిర్దేశం చేయగల అరుదైన ప్రతిభావంతులైన దర్శకులలో ఈతనిది ఒక విశిష్టమైన స్థానం..

తను యాక్షన్/అడ్వంచర్ జెనర్ లో మాస్ హీరో గోపీచంద్ తో చేసిన సరికొత్త ప్రయత్నం “సాహసం” సైతం కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ ట్రాక్, గ్లామర్, అనే ఎండమావుల వెంట పరిగెట్టకుండా కథా కథనాలు టెక్నికల్ వాల్యూస్ పై ఫోకస్ చేస్తూ తనపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆకట్టుకుంటుంది. ఇదే జెనర్ లో హాలీఉడ్ లో వచ్చిన నేషనల్ ట్రెజర్, ఇండియానా జోన్స్ వంటి సినిమాలని గుర్తుచేసినా కూడా చక్కని ప్లాట్ తో, నెరేషన్ తో, సునిశితమైన హాస్యంతో, టెక్నికల్ బ్రిలియన్స్ తో ప్రేక్షకులని కట్టిపడేసే చిత్రం సాహసం.


కథ విషయానికి వస్తే నిజాయితీ పరుడైన గౌతం(గోపీచంద్) ఒక సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. “నాది కానిది కోటి రూపాయల విలువైనదైనా నాకొద్దు, నాదన్నది అర్ధరూపాయైనా ఒదులుకోను” అంటూండే గౌతం పేదరికంతో విసిగి వేసారి ఎలాగైనా బోలెడు డబ్బు సంపాదించాలని అదృష్ట రత్నాలనీ లాటరీ టిక్కెట్లనీ నమ్ముకుని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ నేపధ్యంలో తన తాత తమకోసం కూడబెట్టిన కొన్ని వజ్రాలు ఆభరణాలు పాకిస్థాన్ లోని హింగ్లజ్ దేవి గుడి దగ్గరలో ఉన్నాయని తెలుసుకుంటాడు. శ్రీనిధి(తాప్సి) ఒక భక్తురాలు ప్రపంచం త్వరలోనే అంతమైపోతుందనీ ఆలోపే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాలను దర్శించుకోవాలనీ తిరుగుతుంటుంది. తన తదుపరి మజిలీ పాకిస్థాన్ లోని హింగ్లజ్ దేవి ఆలయం. గౌతం కూడా శ్రీనిధితో కలిసి పాకిస్థాన్ బయలుదేరుతాడు.

ఇదిలా ఉండగా పాకిస్థాన్ లో ఒక చోట కనిష్కుల కాలం నాటి గుప్తనిధి నిక్షిప్తమై ఉందని తెలుసుకుని ఆనాటి సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని తన దేశాభివృద్దికి ఆనిధిని ఇవ్వాలని ఒక గ్రూప్ తో తవ్వకాలు జరుపుతుంటాడో ఆర్కియాలజీ ప్రొఫెసర్. అతనిని బెదిరించి ఆ ఆర్కియాలజీ సైట్ మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని నిధి కోసం ఎదురు చూస్తుంటాడు అక్కడి టెర్రరిస్ట్ సుల్తాన్(శక్తి కపూర్). వీళ్ళు వెతుకుతున్న నిధీ, గౌతం వెతుకుతున్న నిధీ ఒకటేనా? అసలు గౌతం తాత ఆస్థి కుటుంబానికి చెందకుండా అక్కడెక్కడో పాకిస్థాన్లో ఎందుకు ఉంది. చివరికి గౌతం ఆ నిధిని కనుగొనగలిగాడా అనే వివరాలు తెలుసుకోవాలంటే మీరు “సాహసం” సినిమా చూడాలి.


ఈ సినిమా టెక్నీషియన్స్ సినిమా అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డైరెక్షన్, కళాదర్శకత్వం చేసిన ఎస్. రామకృష్ణ నుండి అద్భుతమైన పనిని రాబట్టుకున్నాడు యేలేటి, పాకిస్థాన్ వాతావరణాన్ని తలపించే సెట్స్ కానీ క్లైమాక్స్ లో నిధికి దగ్గరలో ఉపయోగించిన సెక్యూరిటీ సిస్టంస్ వాటిలో కూడా గ్రాఫిక్స్ కన్నా ఆర్ట్ డైరెక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత శాందత్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది లఢఖ్ లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు, ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాల ఫ్రేమింగ్ కెమేరా యాంగిల్స్ చాలా బాగున్నాయ్ కొన్నిచోట్ల చూడడానికి రెండుకళ్ళు సరిపోవన్నట్లుగా అనిపించింది. శ్రీ సంగీతంలోని పాటలు నిరుత్సాహ పరిచాయి ఉన్న రెండు పాటలు కూడా ఆకట్టుకునేట్లు లేవు, బాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కొంచెం తడబడినా ఓవరాల్ గా సినిమా మూడ్ కి సరిపోయింది. సెల్వ స్టంట్స్ చాలావరకూ రియలిస్టిక్ గా ఉన్నాయి.

గోపీచంద్ కి అన్ని షేడ్స్ ఉన్న మంచి పాత్ర దొరికింది తన ఫిట్నెస్, నటన, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఇంతకాలం ఎక్కువగా గ్లామరస్ రోల్స్ కి పరిమితమైన తాప్సీ ఈ సినిమాలో భక్తురాలి పాత్రలో పక్కింటమ్మాయిలా కనిపించడం పెద్ద రిలీఫ్. ఎంతటి కౄరుడైనాకానీ ఊహాతీతమైనవి కళ్ళముందు జరుగుతుంటే ఖంగారుపడడం కామన్. అలాంటి చిత్రమైన విలన్ పాత్రలో శక్తికపూర్ మెప్పించాడు మొదటి సగంలో భయపెట్టి చివరి నలభై ఐదు నిముషాలలో అక్కడక్కడా ప్రేక్షకులని నవ్వించాడు. నారాయణరావు గారు చాన్నాళ్ళ తర్వాత గోపీచంద్ తండ్రిపాత్రలో కనిపించారు. సుమన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అమృతం సీరియల్ లోని సర్వం ఒక చిన్న పాత్రలో ఉన్న కాసేపు నవ్వించాడు. ఆలీ పాత్రని కామెడీ కోసం కన్నా ఒక సపోర్టింగ్ రోల్ కోసమే ఉంచినట్లు అనిపించింది.       


నా మొదటి రెండు సినిమాలలో లాగా ట్విస్టులు ఫ్లాష్బాకులతో స్క్రీన్ ప్లే జిమ్మిక్కులు ఏవీ ఇందులో ఉండవు ఇది లీనియర్ నెరేషన్ లో చెప్పిన ఒక మాములు యాక్షన్/అడ్వంచర్ కథ అని దర్శకుడు ఈ సినిమా గురించి మొదటి నుండీ చెప్తూనే ఉన్నాడు. సినిమా అలాగే ఉంటుంది, మొదటి నుండి పాత్రలను పరిచయం చేస్తూ సాధారణమైన స్క్రీన్ ప్లేతో కథకు అవసరమైన పాత్రలూ సన్నివేశాలతో ముందుకు నడుపుతాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళలేదు. నెరేషన్ కి అడ్డంరాకుండా కేవలం రెండే పాటలు పెట్టాడు ఒకటి హీరో వ్యక్తిత్వాన్ని చూపిస్తూ టైటిల్స్ కి నేపధ్యంగా సాగే పాట, మరోటి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమని చూపించడానికి వాడుకున్న డ్యూయట్.

కథలోని ఒక్కో పాయింట్ రివీల్ చేస్తూ వాటిని ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఆసక్తిగా మొదటిసగం కొనసాగుతుంది ఇంటర్వెల్ కి ముందు కొంచెం తగ్గిన నెరేషన్ తర్వాత రోమాన్స్ కోసం ఉపయోగించుకున్న హార్స్ రైడింగ్ సీన్స్ రీరికార్డింగ్ తో సహా చప్పగా ఉండడంతో మరింత దెబ్బతింటుంది కానీ ఆ తర్వాత నుండి చివరి వరకూ దర్శకుడు మనల్ని స్క్రీన్ నుండి తల తిప్పనివ్వకుండా లీనమై చూసేలా చేస్తాడు, ముఖ్యంగా చివరి నలబై ఐదునిముషాలు చాలా బాగుండడంతో బయటకి వచ్చేప్పుడు మంచి సినిమా చూశామన్న తృప్తితో వస్తాం.   

ఫార్ములా చిత్రాలకూ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకూ పెద్దపీట వేస్తున్న ఈరోజుల్లో ఈ సినిమా ఎంతవరకూ మాస్  ప్రేక్షకులను అలరిస్తుందనేది అనుమానాస్పదమే కానీ మీకు ఇలాంటి అడ్వంచర్ తరహా సినిమాలు ఇష్టమైతే కనుక ఒకసారి ఖచ్చితంగా చూడవలసిన సినిమా “సాహసం”. ఇదో అద్భుత కళాఖండమనో యేలేటి మొదటి సినిమాలలాగే స్క్రీన్ప్లే ట్విస్టులను ఊహించుకునో భారీ అంచనాలతో వెళ్ళకండి, ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి కొన్ని సీన్స్ పరిచయమైనవిగా కూడా కనిపించవచ్చు కానీ రొటీన్ ఫార్ములా కథలకు భిన్నంగా వైవిధ్యమైన సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా చూసి ప్రోత్సహించవలసిన మంచి ప్రయత్నం ఈ “సాహసం”.  

ఈ సినిమా పై నవతరంగంలో వెంకట్ శిద్దారెడ్డి రాసిన విశ్లేషణాత్మక వ్యాసం ఇక్కడ చదవచ్చు. 
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గారితో రెంటాల జయదేవ గారి ఇంటర్వ్యూ ఇక్కడ చదవచ్చు

సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ అండ్ అడ్వంచర్ గురించిన ప్రోమో ఇక్కడ చూడవచ్చు.  

శనివారం, జులై 13, 2013

Pacific Rim / అంతిమపోరాటం


మీకు యాక్షన్ సినిమాలు ఏమాత్రం ఇష్టమైనా ఈ సినిమా మిస్ కాకండి, వీలైతే మీదగ్గరలో ఉన్న బెస్ట్ త్రీడీ థియేటర్ లో చూడండి. ఈమధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ త్రీడీ యాక్షన్ ఫిల్మ్ పసిఫిక్ రిమ్. చూడడానికి ట్రాన్స్ ఫార్మర్స్ తరహా జెయింట్ రోబోలలాగా కనిపించవచ్చు కానీ ఈ ఏగర్స్ (Jaegers) డిజైన్ కాన్సెప్ట్ అన్నీకూడా అద్భుతంగా ఉన్నాయ్ ముఖ్యంగా పోరాట సన్నివేశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఎంజాయ్ చేసే విధంగా చిత్రీకరించారు. ఇక 3D ఎఫెక్ట్ గురించైతే చెప్పనే అఖ్ఖర్లేదు డెప్త్ చాలా స్పష్టంగా తెలుస్తుంది, కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తున్నట్లుకాక మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూస్తున్నామనేంతగా లీనమైపోతాం.

ప్లాట్ : When legions of monstrous creatures, known as Kaiju("Kaiju" is a Japanese word that literally translates to 'strange beast.), started rising from the sea, a war began that would take millions of lives and consume humanity's resources for years on end. To combat the giant Kaiju, a special type of weapon was devised: massive robots, called Jaegers("Jaeger" is the German word for hunter.), which are controlled simultaneously by two pilots whose minds are locked in a neural bridge. But even the Jaegers are proving nearly defenseless in the face of the relentless Kaiju. On the verge of defeat, the forces defending mankind have no choice but to turn to two unlikely heroes-a washed up former pilot (Charlie Hunnam) and an untested trainee (Rinko Kikuchi)-who are teamed to drive a legendary but seemingly obsolete Jaeger from the past. Together, they stand as mankind's last hope against the mounting apocalypse. (c) Warner Bros 
 Pacific Rim (2013) on IMDb

సాథారణంగా ఈ మధ్య చూస్తున్న సూపర్ హీరో / యాక్షన్ సినిమాలలో ముందు ఒక గంట పాటు విపత్తు గురించీ హీరో కి వచ్చిన పవర్స్ గురించి ఎస్టాబ్లిష్ చేయడానికో హీరో పవర్ గురించి తర్జనభర్జనలు పడడానికో ఉపయోగించుకుని చివరి అరగంట యాక్షన్ సన్నివేశాలతో నింపేసి ముగించేస్తున్నారు. ఈ సినిమా కూడా అలా ఒక గంట కైజు చేసే విధ్వంసాల గురించి, ఏగర్స్ ని ఎలా బిల్డ్ చేసారనే దానిగురించి చూపించి చివరి అరగంట ఒక ఫైట్ తో ముగించేస్తారులే అని ఆశించి వెళ్ళాను. కానీ సినిమా ఓపెనింగే ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశంతో ప్రారంభించడంతో ఆశ్చర్యపోయాను అలాగే ప్రతి అరగంటకి చక్కని పోరాట సన్నివేశాలు ఒకదానిని మించి ఒకటి చిత్రీకరించి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

గాడ్జిల్లా వర్సస్ మాన్ స్టర్ సినిమాలలో జుగుప్స కలిగించే సన్నివేశాలు ఉదాహరణకి నోట్లోనుండి కెమికల్స్ ఊయడం వాటిని జుగుప్సాకరంగా చూపించడం లాంటి సన్నివేశాలు ఉంటాయ్ కానీ ఇందులో అలాంటివి ఉన్నాకూడా లైట్ ఎఫెక్ట్ తో ఆకర్షణీయంగా తీశాడు. పిల్లల సినిమాలలో సైతం లిప్ లాక్ లేకుండా రిలీజ్ చేయని ఇంగ్లీష్ సినిమాల మధ్య ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకపోడం స్కిన్ షో లేకపోవడం రిలీఫ్ ఇచ్చింది. మన సినిమాలు హాలీవుడ్ ని ఆదర్శంగా తీస్కుని ఈ విషయాల్లో రెచ్చిపోతుంటే వాళ్ళు మన సంస్కృతికి దగ్గరవుతున్నారా ఏంటి అని సందేహం కూడా కలిగింది. ఈ క్రింది ట్రైలర్ చూస్తే సినిమాలో ఏం ఆశించవచ్చో తెలుస్తుంది ఇది నచ్చితే సినిమా చూడడం మిస్ అవకండి, వీలైతే మీ పిల్లలతో కలిసి త్రీడీ థియేటర్ లో ఎంజాయ్ చేయండి.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.