డిశంబర్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నెల అయిపోయింది నాకు. అసలు ఈ కోర్స్ చేయడం వెనక ఓ పిట్ట కథ ఉంది కానీ దాని వివరాలు మళ్ళీ ఎపుడైనా సమయం కుదిరినపుడు చెప్తాను. బేసిక్ కోర్స్ చేసిన ఆనందం సద్దుమణగక ముందే పార్ట్ 2 కోర్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. దానికోసమని మళ్ళీ ఆశ్రమం కి వెళ్ళిన వెంటనే శలవల్లో ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది. అక్కడి వైబ్రేషన్స్ మహిమో ఏమిటో తెలియదు కానీ ఆశ్రమం లో ఉన్నంత సేపూ బయటి ఇబ్బందుల గురించి కానీ సమస్యలగురించి కానీ ఆలోచనలు ఏమాత్రం రావు. ఎపుడూ ఒకటే ధ్యాస.. ధ్యానం.. సేవ.. అదో మధురమైన అనుభూతి. అనుకోకుండా నాతో కలిసి పార్ట్ 1 చేసిన ఒకతను నాతోపాటు పార్ట్ 2 చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఇద్దరమూ అనుకోకుండా కలిసాము. ఇందులో మౌనవ్రతం ఉంటుంది అని తెలుసు బేసిక్ లో మేమిద్దరం నవ్వులతో కాస్త అల్లరి చేశాం మన వల్ల అయ్యె పని కాదు బాబు ఈ మౌనవ్రతాలు అవీ అదీకాక ఇంచుమించు మూడురోజులు ఉండాలిట సాధ్యమయ్యే పనేనా అదీ మనలాటి కోతులకు అని అనుకుంటూ మొదలుపెట్టాము. మొదటిరోజు అంతా ఏవో ప్రాసెస్ లు చేయించారు.

ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ల గురించి కొంచెం చెప్పుకోవాలి నిత్యజీవితంలో మనకి ఎదురుపడే వాటినుండే కొన్ని ప్రాసెస్ లను సృష్టించారు అవి చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనిపించింది. ఉదాహరణకి పెద్దవాళ్ళకి జ్వరమో లేదో తీవ్రమైన అస్వస్థత కలిగినపుడు హ్మ్ హ్మ్ అని శబ్దం చేస్తూ మూలగడం వింటూ ఉంటాం. ఆ మూలుగు వల్ల బోలెడంత నెగటివ్ ఎనర్జీ బయటకి పోయి కాస్త శక్తివచ్చినట్లు ఫీల్ అవుతారు. వయసులో ఉన్నవారు అలా మూలగడానికి జంకడం గమనిస్తాం కానీ దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయ్. ఉదాహరణకి మీరు టెన్షన్ పడుతున్నపుడు అంటే ప్రజంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందో ఇలా రెండుచేతులు పైకెత్తి వేగంగా ముందుకు జారవిడుస్తూ పెద్దగా శబ్దం చేస్తూ మూలుగు ద్వారా గాలి బయటకి వదిలారనుకోండి అప్పుడు మీలో నెగటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళి తెలియని శక్తి వచ్చిచేరినట్లు ఫీల్ అవడమే కాక టెన్షన్ తగ్గి మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. ఇలాటివే కొన్ని ప్రాసెస్ లు మెడిటేషన్ టెక్నిక్స్ తో మొదటి రోజు గడిచింది.
అదే రోజు అంటే గురువారం రాత్రి 9 గంటలనుండి మా మౌనవ్రతం మొదలైంది, అప్పటినుండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మా మౌనవ్రతం కొనసాగింది అంటే దదాపు రెండున్నరరోజులు అంటే 63 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా సేవ చేసేప్పుడు ఒకటి రెండు సార్లు తప్పనిసరి పరిస్థితులలో కేవలం సంఙ్ఞల ద్వారా మాత్రమే సంభాషించి గడిపేశాము. మొదట్లో ఎలారా ఉండటం అనుకున్నాము కానీ శుక్రవారం మధ్యాహ్నానికి మాములు గా అనిపించింది ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అసలు మాట్లాడాల్సిన అవసరం కానీ ఆలోఛన కానీ కలగలేదు. బహుశా కోర్స్ జరిగినంతసేపు నిశ్శబ్దంగా అయినా టీచర్ తో కమ్యునికేట్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు లేదా కోర్స్ లో భాగంగా చేసిన మెడిటేషన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. మొత్తానికి చాలా కష్టమేమో అనుకున్నాం కానీ అవలీలగా పూర్తిచేసేశాం. ఎప్పటిలాగే ఆశ్రమం దినచర్యని, ఉదయాన్నే ఐదుగంటలకి నిద్రలేవడం, ఆరుగంటలకి యోగా, పగలంతా మెడిటేషన్ మరియూ సేవ తో అలసిపోవడం, సాయంత్రం గురూజీతో సత్సంగ్, కిచెన్ లో సాత్వికాహారం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను.
నేను ఆశ్రమంలో ఉన్న అయిదురోజులూ గురూజీ తో విశాలాక్షిమంటపంలో పాల్గొన్న సత్సంగ్ చిత్రం
మౌనవ్రతం ఆచరించిన అంత సేపు నాతోనేను ఎక్కువసమయం గడపగలిగాను ప్రతిపనిని అస్వాదిస్తూ చేశాను. మొత్తం మీద పార్ట్ 2 అయ్యాక నాలో నేను గమనించిన స్ఫుటమైన మార్పు ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ. ఇదివరకు నాలుగు అడుగులు వేయడానికి బద్దకించే నేను ఇప్పుడు కిలోమీటర్ పైనే ఉన్న ప్రదేశాలకు కూడా అవలీలగా నడిచి వెళ్ళి రాగలుగుతున్నాను. ఈ ప్రాక్టీస్ ఇలానే కొనసాగిస్తే నాకు మంచి మేలు జరుగుతుందనే భావిస్తున్నాను. కానీ కోర్స్ చివరిరోజు విపరీతమైన జలుబు దగ్గు పట్టుకుంది వారమైనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం నిన్నటినుండే హోమియో చికిత్స మొదలెట్టాను ఏమైనా సత్ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.

అసలు విషయం చెప్పడం మరిచాను. కోర్స్ అంతా ఒక ఎత్తైతే ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం ఒక మరిచిపోలేని అనుభూతి. చల్లని చూపులతో ఆశీర్వదించి సంతోషంగా ఉన్నావా అనీ, ఏం చేస్తున్నావు అనీ కుశల ప్రశ్నలు వేసి నాతో ముచ్చటించినది ఒక్క నిముషం పాటే అయినా అంతసేపు నేను మైమరచిపోయి ఏదో లోకంలో ఉన్న అనుభూతి కలిగింది. ఆయన నిరంతర మెడిటేషన్ మరియూ సాధన ఫలితం అనుకుంటా ఒక ఉత్తేజితమైన అద్భుత శక్తి వలయం (aura) తన చుట్టూ ఉన్నట్లు అది మనల్ని మృదువుగా స్పృశించి ముందుకు సాగినట్లు అనిపించింది ఆయన నన్ను ఆశీర్వదించి ముందుకు సాగుతుంటే. అన్నీ బాగున్నాయ్ కానీ కోర్స్ చివరన టీచర్స్ మీరంతా కూడా టీచర్స్ కావాలి మీరు ఒక్కొక్కరూ 108 మందితో పార్ట్ 2 కోర్స్ చేయించాలి అని ప్రచారం చేయడం నాకు నచ్చలేదు. ఇదే విషయాన్ని హుందాగా చెప్పి ఉంటే బాగుండేది. కాకపోతే అది టీచర్స్ ని బట్టి ఉంటుంది అని అందరు టీచర్స్ ఇలా చెప్పరనీ మిగిలిన వారితో మాట్లాడినపుడు తెలిసింది. మొత్తం మీద ఈకోర్స్ ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది వీలైతే బెంగళూరు ఆశ్రమంలో లేదంటే మీ దగ్గరలో వెంటనే చేయడానికి ప్రయత్నించండి. మీకు మీరు, మీ శరీరానికి మనసుకు ఇచ్చుకోగల ఒక అమూల్యమైన బహుమతి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్, తప్పక చేయడానికి ప్రయత్నించండి.