అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

అందమైన బాల్యం

మధురమైన జ్ఞాపకాలతో అందమైన బాల్యాన్ని నా సొంతం చేసినందుకు అమ్మానాన్నలకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. మొదటి సంతానాన్నవడంతో నేనాడిందే ఆట పాడిందే పాట అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినా మా ఇంట్లో అయినా అపురూపంగా గడిచింది. పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, స్కూల్ ఎగ్గొట్టడానికి వేసిన వేషాలు, తిన్న చిరుతిళ్ళు, నాన్న వేలు పట్టుకుని కొట్టిన షికార్లు, 16mm సినిమాలు కబుర్లు ఇక్కడ చదవచ్చు.

ఇంటర్మీడియెట్ హాస్టల్ కబుర్లు

నూనూగు మీసాల నూత్న యవ్వనం అమ్మానాన్నలకు దూరంగా నాదంటూ ఓ స్వంత ప్రపంచం. అప్పటివరకూ ప్రతి చిన్న పనికి వాళ్ళమీద ఆధారపడి ఒక్కసారిగా నాకు నేనే నెగ్గుకు రావాల్సిన పరిస్థితులను తలుచుకుని దిగులు. అంతలోనే చుట్టూ ఉన్న స్నేహితులతో నేస్తం కట్టేసి చేసిన అల్లర్లు, పరోఠాల బిజినెస్సులు, చెరకుతోట దొంగతనాలు, ఆడ్మినిస్ట్రేటర్ కి మస్కాగొట్టి చూసిన సినిమాలు, సరదా కొంటె కబుర్లు ఇక్కడ చూడండి.

ఇంజనీరింగ్ కాలేజ్

ఇంటర్మీడియెట్ కి రెసిడెన్షియల్ హాస్టల్ కనుక పంజరంలో పక్షిలా బతికితే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీ హాస్టల్స్ లోకి వచ్చేసరికి ఒక్కసారిగా జూలోనుండి పచ్చని అడవిలోకి వదిలేసిన జింక పరిస్థితే అయింది, ఎక్కడికి పరుగులెట్టినా ఏం చేసినా అడిగేవాళ్ళులేరు. అసలు హాస్టల్ బిల్డింగ్ లో నిరంతరం కాపుకాసే వార్డెన్ ఉండడనే విషయం నాకు డైజెస్ట్ కావడానికి నెలపట్టింది :-) నిజమా అలా ఎలా సాధ్యం అని ఇప్పటికీ అనిపిస్తూనే ఉంటుంది. అంతటి స్వేఛ్చాప్రపంచంలో చేసిన అల్లర్లు కొన్ని కబుర్లు ఇక్కడ.

సినిమాలు రివ్యూలు..

నాకున్న అతి పెద్ద వ్యసనం సినిమా చూడడం రిలీజైన ప్రతి అడ్డమైన సినిమా చూసేసి ఈబొమ్మలో చూపించినట్లు తెలుగు సినిమాని భుజాల మీద మోసేవాళ్ళలో నేనొకడ్ని. చూసి ఊరుకోకుండా ఇది ఇందుకు బాలేదు అది అందుకు బాగుంది అంటూ పేద్ద వంద సినిమాలు తీసేసి విశ్రమిస్తున్న మేధావిలా చేసే విశ్లేషణలు :-) హహహ చదివిన ఒకరిద్దరు అలా తిడతారు కానీ నా దృష్టిలో ఒక సాధారణ సినీ ప్రేక్షకుడు చూసొచ్చి మిత్రులతో చెప్పే కబుర్ల లాంటి నా సినీ రివ్యూలు ఇక్కడ చదవండి. ఆరెంజ్, ఖలేజా, కృష్ణం వందే జగద్గురుం లాంటివి కొన్ని ఎక్కువమంది ఆదరణ పొందాయ్.

గురువారం, జులై 31, 2008

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే !!

ఓ నాల్రోజులు గా ఎందుకో ఈ పాట పదే పదే గుర్తొస్తుంది. ఈ పాట సాహిత్యమో లేదా mp3 నో దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఓ నెల క్రితం సుజాత(గడ్డిపూలు) గారు కూడా ఈ పాట గుర్తు చేసుకోడం చూసాను. మొత్తం మీద నా కలక్షన్ నుండి తవ్వి తీసి సాహిత్యం తో పాటు వినడానికి లింక్ కూడా ఇస్తే అందరూ మరో సారి ఈ మధురమైన పాట ని ఆస్వాదిస్తారు, తెలియని వాళ్ళకి పరిచయం చేసినట్లూ ఉంటుంది అని ఈ రోజు ఈ పాట ఇక్కడ మన అందరి కోసం. పాలగుమ్మి గారి సాహిత్యం వేదవతీ ప్రభాకర్ గారి గానం తో ఈ పాట చాలా హాయైన అనుభూతినిస్తుంది.

Amma Donga Ninnu C...


సాహిత్యం: పాలగుమ్మి విశ్వనాథ్
సంగీతం : పాలగుమ్మి విశ్వనాథ్
గానం : వేదవతీ ప్రభాకర్

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే.. నాకు బెంగా.. ||2||
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ ఊ..ఊ..ఉ..
నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ
కల కలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను... చూడకుంటే.. నాకు బెంగా...

||అమ్మ దొంగా||

కధ చెప్పే దాకా కంట నిదుర రాకా...
కధ చెప్పే దాకా నీవు నిదుర బోకా...
కధ చెప్పే దాకా నన్ను కదలనీక....
మాట తోచనీక...మూతి ముడిచి చూసేవు...

||అమ్మ దొంగా||

ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
ఎపుడో ఒక అయ్య నిన్నెగరేసుకు పోతె...
నిలువలేక నా మనసు నీ వైపే లాగితే...
గువ్వ ఎగిరి పోయినా గూడు నిదుర పోవునా...||2||

||అమ్మ దొంగా||

నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు...
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు...
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు..
కలతలూ కష్టాలు నీ దరికి రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి
కలతలూ కష్టాలు నీ దరికీ రాకా
కలకాలము నీ బ్రతుకు కలల దారి నడవాలి...

||అమ్మ దొంగా||

బుధవారం, జులై 30, 2008

గంగామహల్ రిచ్చా(క్షా)బండి పిడుగురాళ్ళ...

శీర్షిక చూసి కాసింత కన్‌ఫ్యూస్డ్ ఫేస్ పెట్టేసి మనోడేంటీ రాజకీయాల్లోకి గానీ ఎళ్తన్నాడంటావా ఈ మధ్య బజారయ్య, రిచ్చాబండి అని టపాలు వ్రాస్తున్నాడు....అని మీలో మీరే కొస్చెనింగ్ సేసుకుంటున్నారా...? ఏం భయపడకండి నేను రాజకీయాల్లోకి అస్సలు వెళ్ళబోడం లేదు... ఇది ఆ బాపతు టపా కానే కాదు !! మీరు నిర్భయం గా చదవచ్చు... సరే ఇక విషయం లోకి వస్తే... మీరు ఏప్పుడైనా సినిమా హాలు దగ్గర్లో ఉన్న ఇంట్లో ఉండటం జరిగిందా ? అంటే ఈ మధ్య కాదు కానీ కనీసం ఓ పదేళ్ళ కి ముందు. నాకు పిడుగురాళ్ళ లో ఉన్నప్పుడు ఆ అదృష్టం పట్టింది, నేను 7, 8 తరగతులు అక్కడే చదువు కున్నాను లెండి. మా నాన్న గారు అప్పటికీ చాలా ఆలోచించి హాలు పక్కనే ఉంటే రోజుకి నాలుగు ఆటలు స్టీరియో ఫోనిక్ సౌండ్ లో వినాల్సొస్తుంది అని కొంచెం దూరమైతే ఏ సమస్యా ఉండదని గంగామహల్ సినిమ హాలు ఎదురు సందు లో కొంచెం దూరం గానే అంటే ఓ పది ఇళ్ళు లోపలకే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

కొత్త ఊరు, కొత్త ఇల్లూ, కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ అంతా బావుంది ఇల్లు కూడా బావుండేది L ఆకారం లో ఉండి ఇంటి లోపలే కొంత ఓపెన్ స్పేస్ ఉండి ఆకాశం కనిపిస్తూ ఆరు బయట పడుకున్నట్లు ఉండేది ఇంకా పూర్తి గా కావాలంటే ఎంచక్కగా డాబా మీదకి వెళ్ళచ్చు పడుకోడానికి. లోపలే సూర్య రశ్మి కి కొరత ఉండక పోడం తో సన్నజాజి పొద ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉండేవి. ఆహా అంతా అద్భుతం అనుకునే సమయం లో మెల్లగా గమనించాం అసలు విషయం. ఇప్పుడు ధ్వని కాలుష్యం అని చాలా వరకు నగరాల్లో నిషేదించారు కానీ ఓ పదేళ్ళ క్రితం వరకు కూడా ఇ సినిమా హాలు రిక్షాబండ్లు మంచి జోరు మీద ఉండేవి.

మైకు లో పెద్ద వాల్యూం లో పాటలు పెట్టుకుని మధ్య మధ్య లో "నేడే చూడండి... మీ అభిమాన ధియేటర్లో... ఆంధ్రుల అభిమాన నటుడు నట ___ ఫలానా హీరో నటించిన ఫలానా చిత్రం... తప్పక చూడండి..... అని చెవులు ఊదర గొట్టే ఈ బండ్లు మన తెలుగు వారందరికీ చిరపరిచితమే. ఇక వీరు సినిమా గురించి చేసే వర్ణన వింటుంటే ఒకో సారి చూద్దాం అనుకున్న సినిమా కూడా అమ్మో అలా ఉంటుందా అయితే చూడకపోడమే మంచిదేమో అనిపించేలా చేస్తాయ్. నేను నరసరావుపేట్ లో ఉన్నపుడు అమ్మ వాళ్ళకి తెలీకుండా వీటి వెనక పరుగెట్టి పాంప్లెట్ లు సంగ్రహించిన రోజులు కూడా ఉన్నాయనుకోండీ అప్పట్లో అదో తుత్తి అది వేరే విషయం. మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే...

ఈ రిక్షా బండి వాడు పొద్దున్నే హాలు బయట బండి నిలబెట్టి, ప్రస్తుతం ఆడుతున్న సినిమా లో పాటలు హిట్ అయితే ఆ సినిమా పాటలు లేదంటే వేరే ఏవో ఒక హిట్ అయిన పాటలు వేసే వాడు. పిడుగురాళ్ళ చిన్న ఊరు ఎంత నిదానం గా ప్రతి వీధి కి తిరిగినా మొత్తం ఊరంతా తిరగడానికి రిక్షాలో ఒక అరగంట, గంట కన్నా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఊరంతా తిరిగి ప్రచారం అయిపోయాక ఇక మిగిలిన టైం అంతా బండి ని హాలు ముందు నిలబెట్టి వాడి ప్రతాపం ఆ చుట్టు పక్కల ఇళ్ళలో ఉండే మా లాంటి వాళ్ళ మీద చూపించే వాడు. వీడు మరీను ఇందులో బాధ ఏముంది, ఇదేదో బాగానే ఉంది కదా ఉచితం గా రోజు పాటలు వినిపిస్తుంటే ఏంటి వీడి బాధ అని అనుకుంటున్నారా... ఒకే పెద్ద సౌండ్ తో చెవుల్లో ఆపకుండా హోరెత్తే ఆ పాటలు భరించడం మానవ మాత్రుల వల్ల కాదండీ బాబు... మా అదృష్టం బావుండి మంచి పాటలు ఉన్న సినిమా వస్తే గుడ్డిలో మెల్ల లా కాస్త పర్లేదు కానీ చాలా సార్లు ఘోరమైన పాటలతో చావగొట్టే వాడు.

ఒకో సారి ఎప్పుడైనా శలవు రోజులోనో లేకా పండగ రోజుల్లో ఇంట్లో కాస్త పూజ లేట్ అయిందంటే ఇక చూస్కోండి ఇక్కడ మంత్రాలు హారతి గంటలూ... వీటిని డామినేట్ చేస్తూ నేపధ్యం లో నేమో డబ్బింగ్ పాటలు ఇంకా వాటిలో మధ్య మధ్య వచ్చే చిత్ర విచిత్రమైన మూలుగులతో ప్రత్యక్ష నరకం కనపడేది. మేము ఘోరం గా బలి అయిన పాటలలో ప్రేమసాగరం పాటలు ఒకటి కొన్ని పాటలు బానే వుంటాయ్ కానీ ఎంతైనా చాలా రోజులు అవే పాటలు పదే పదే అంత పెద్ద వాల్యూం తో విని భరించడానికి బోలెడు ఓపిక కావాలి. ఈ బాధ భరించ లేక ఆ లొకాలిటీ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి హాలు వాడికి మొర పెట్టుకుని ఈ హింస ప్రతి షో కి ముందు ఒక అరగంట మాత్రమే ఉండేలా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ టైము లోకూడా కాస్త సౌండ్ తగ్గించి పెట్టడం తో కాస్త విముక్తి పొందాము.

పిడుగురాళ్ళ తో అనుబంధం గా ఉండే ఇంకో జ్ఞాపకం నాటకాలు, 16mm సినిమాలు, కోలాటం. ఆ ఊరి గ్రామ దేవత గంగమ్మ. ఆవిడ గుడి కూడా పెద్దదే ఉండేది ఆవరణ ఇంకా గుడి బయటా చాలా ఖాళీ స్తలం ఉండేది. ఇప్పుడు ఇంకా ఉందో లేదో తెలీదు. గంగమ్మ గుడి జాతర సమయం లో ఇవన్నీ చూసాను. కోలాటం చాలా బావుండేది అంత మంది మధ్యన చక్కని rhythm and coordination చూడముచ్చటగా ఉండేది. ఇంకా ఇక్కడే నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటి సారి నాటకం చూసాను అంటే బాగా చిన్నపుడు మా నాన్న గారు ఒకసారి వేస్తుంటే నేను కూడా వెళ్ళాను కానీ గుర్తు లేదు. పిడుగురాళ్ళలో చూసిన నాటకం పేరు గుర్తు లేదు కానీ తెరలు, సన్నివేశాన్ని పట్టి క్షణం లో మారే background తెర, ఆ తెర వెనక నటీ నటులు వాళ్ళ మేకప్ గొడవ ఇదంతా ఇంకా జ్ఞాపకం ఉంది.

ఇక పోతే 16mm సినిమా, గుడిగంటలు అనే పాత సినిమా చూసాను. నేనైతే సినిమా కంటే ఎక్కువ ప్రొజెక్టర్నే ఆసక్తి గా చూసిన జ్ఞాపకం. ఒక చిన్న లెన్స్ దగ్గర కేంద్రీకృతమై బయల్దేరిన కాంతి పుంజం వందల కాంతి రేఖలు గా విడివడి క్రమ క్రమం గా విస్త రిస్తూ తెర అంతా పరచుకోడం. ఇంకా ప్రొజెక్టర్ కీ తెర కి మధ్య ఉన్న దుమ్ము మీద పడే కాంతి లో సీన్ ని పట్టి వెలుగు నీడలు మార్పులు చెందుతూ ఉంటే చూడటానికి అద్భుతం గా వుండేది. ఇంకా ప్రొజెక్టర్ కి అభిముఖం గా నిలబడి లెన్స్ లోకి చూడటం కూడా భలే ఉండేది. అంటే వెలుతురు వల్ల ఎక్కువ సేపు అలా చూడ లేం కానీ నేను అప్పుడప్పుడు ఎదురు గా వెళ్ళి చూడటానికి ప్రయత్నం చేసేవాడ్ని. తెర వెనక వైపుకి వెళ్ళి అటునుండి చూస్తుంటే కూడా భలే ఉండేది. మొదట గా చూసినప్పుడు పెద్ద గా తేడాలేదు రా అనుకున్నాం కానీ నిశితం గా పరికించి చూసాక కుడి ఏడమైతే పొరపాటు లేదోయ్ అని పాడుకున్నాం.

ఈ రోజుకి అవీ కబుర్లు మళ్ళీ మరికొన్ని కబుర్లతో త్వరలో కలుద్దాం,
అంత వరకు శలవ్,

--వేణు.

గురువారం, జులై 24, 2008

అలలు కలలు ఎగసి ఎగసి...

ఈ రోజు ఉదయం ఆరు దాటి ఒక పది నిముషాలు అయి ఉంటుందేమో నేను ఆఫీసుకు బయల్దేరి బస్ కోసం నడుస్తూ నా IPOD లో యాదృచ్చిక పాటలు (Shuffle songs కి ఇంతకన్నా మంచి పదం దొరకలేదు నా మట్టిబుర్రకి) మీట నొక్కగానే మొదట గా ఈ పాట పలకరించింది. సూర్యోదయమై ఓ అరగంట గడిచినా, ఇంకా సూర్యుడు మబ్బుల చాటు నే ఉండటం తో ఎండ లేకుండ మంచి వెలుతురు. అటు చిర్రెత్తించే వేడి ఇటు వణికించే చలీ కాని ఉదయపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ పాట వింటూ అలా నడుస్తుంటే. ఆహా ఎంత బావుందో మాటల లో చెప్ప లేను. ఈ పాట కి సంభందించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరు నా పొగడకుండా ఉండ లేకపోయాను.

మీకు తెలుసా ఈ పాట ఇళయరాజా గారు పాడారు. ఈ పాట లో స్వరాలు వచ్చేప్పుడు నాకే తెలీకుండా నా వేళ్ళు నాట్యం చేస్తాయి ఇక తకతుం..తకతుం... అని వచ్చేప్పుడైతే తల ఊపకుండా ఉండలేను. ఇంక సాహిత్యం వేటూరి గారు నాలుగు లైన్లు అయినా చక్కగా వ్రాసారు. "నీ జడలో..." పంక్తి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ ఓ సారి పెదవులపై ఓ చిన్న మెరుపుని పుట్టిస్తుంది. ఈ రోజంతా ఈ పాటే పాడుకున్నా అని ఈ పాటికి అర్ధం అయి ఉంటుంది కదా అందుకే ఈ పాట ఇక్కడ ఇస్తున్నా.

ప్లేయర్ ఓపెన్ కాకపోతే ఇక్కడ క్లిక్ చేయండి.

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Seetakokachiluka+Old.html?e">Listen to Seetakokachiluka Old Audio Songs at MusicMazaa.com</a></p>


చిత్రం: సీతాకోకచిలుక
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: వాణీజయరాం, ఇళయరాజా

స గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా

నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మామ గాగ సాస నీసా

అ: అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
ఆ: సాసాస నీనీని పాపాప మామామ గాగాగ సాసాస నీసా
అ: పగలూ రేయీ ఒరిసీ మురిసే సంధ్యారాగంలో
ఆ: సగపా మపపా మగపా మపప పని సని పదనిప మాగా
ఆ: ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో


తనన ననన ననన ననన తనన ననన నాన
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవన రాగంలో
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే
తనన ననన ననన ననన తనన ననన నాన

అ: తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం
ఆ: తకతుం తకతుం తకతుం తకతుం తకతకతకతుం
అ: తకధుం తకధుం తకధుం తకధుం
ఆ: తకధుం తకధుం తకధుం తకధుం

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ..ఆ..ఆ..ఆ....ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ...

నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా..
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా..
నా పుత్తడి బొమ్మా ..!

అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పొయే !

బుధవారం, జులై 23, 2008

మా బడి లో..బజారయ్య..

బజారయ్య నేను ఆరో తరగతి వరకు చదివిన మా వీధి బడి లో ఉండే వాడు. మా బడికి వాచ్‌మన్, అటెండర్, క్లీనర్, రిక్షావాడు, ఇంటర్వల్ లో తినుబండారాలు అమ్ముకునే వ్యాపారి అన్నీ అతనే... చాలా చిత్రం గా అతని భార్య పేరు బజారమ్మ. పెళ్ళయ్యాక మార్చుకుందో లేకా బడి లో అంతా అలా ఆవిడ పేరు మార్చేసారో తెలీదు. బజారయ్య కి ఓ చేయి ఉండేది కాదు. మోచేతి నుండి కిందకి ఓ నాలుగు అంగుళాలు వుండేది. దాన్ని కదిలించ గలిగే వాడు, అప్పుడప్పుడూ దానినే గ్రిప్ కి ఉపయోగించుకునే వాడు. ఆ చెయ్యి ఎలా ఇరిగింది బజారయ్యా అని అడిగితే ఓ చిన్న నవ్వు నవ్వేసి "ఏదో లే ఏణూ అయ్యన్నీ ఇప్పుడెందుకు.." అనే వాడు. సాధారణమైన ఎత్తు, ఎప్పుడూ మాసిపోయిన తెల్లగడ్డం తో చూడటానికి ప్రత్యేకం గా కనిపించేవాడు. చాలా మంచి వాడు. స్కూల్ లో టీచర్లు కూడా చులకన చేయకుండా బాగా ఉండే వాళ్ళు అతనితో...

నివాసం ఉండటం కూడా మా బడి ఆవరణలోనే ఓ పక్కగా గుడిశ వేసుకుని ఉండే వాడు. అతను ఖాళీగా కూర్చుని ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు నిరంతరం ఏదో ఓ పని చేస్తూనే ఉండే వాడు. పైన చెప్పిన పనులే కాకుండా చిన్న చిన్న నాటు వైద్యాలు చిట్కా వైద్యాలు చేసే వాడు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరనుకుంటా. వాళ్ళిద్దరూ గొడవపడటం కూడా నేనెప్పుడూ చూడలేదు. అతనికి తాగుడు లాంటి అలవాట్లు లేవు కానీ తర్వాత్తరవాత మా బడి లొ మనేసాక బీడీ తాగడం చూసాను. మా బడి లో ఉన్నపుడు మాత్రం ఎలాంటి అలవాట్లు లేకుండా బాగా ఉండేవాడు. బడికి శలవులు ఇచ్చినప్పుడు ఇళ్ళల్లో ఏవైనా పనులు చేయడమో ఆ మొండి చేత్తోనే రిక్షా తోలడమో, బండి మీద తినుబండారాలు, పళ్ళు లాంటివి వీధి వీధి లోను అమ్ముకోడమో ఇలాంటి పనులు ఏదో ఒకటి చేస్తూ కనిపించే వాడు. అంతలా కష్ట పడే వాళ్ళని దగ్గరగా చూడటం నాకు అదే ప్రధమం.

అతని చేతి గురించి రక రకాల కధలు ప్రచారం లో ఉండేవి. ప్రమాదం లో పోగొట్టుకున్నాడని కొందరు, ఒకప్పుడు అతనో పెద్ద రౌడీ అనీ గొడవల్లో చేతిని పోగొట్టుకున్నాడనీ కొందరు...ఇలా చాలా కధలు ఉండేవి.. కానీ వాటిలో నిజా నిజాలు నాకు తెలీవు. ఓ సారి చిన్నప్పుడు నాకు పేగు పడి కడుపు నొప్పి వస్తే ఇటుక రాయి పట్టీ ఆ మొండి చేతితోనె పొట్ట మీద రుద్ది నయం చేసాడు. మొదట అమ్మ వాళ్ళు అతనిని అడగడానికి ఆలోచించారు కానీ చుట్టు పక్కల వాళ్ళు బాగా చేస్తాడు, వెంటనే తగ్గిస్తాడు అని చెప్పడం తో అతనితోనే చేయించారు.

స్కూల్ ఇంటర్వెల్ సమయం లో లంచ్ బ్రేక్ సమయం లో నూగు జీళ్ళు, కొబ్బరి ఉండలు, పదిపైసల ఆకారం లో ఉండే న్యూట్రిన్ కొబ్బరి చాక్లెట్ లు. మరమరాలు, చెగోడీలు, రేగి పళ్ళతో చేసిన చెక్కలు, ఉప్పూ కారం అద్దిన పచ్చి మామిడి బద్దలు, జామ కాయలు, కోటప్ప కొండ తిరణాల టైం లో చెరుకు ముక్కలు. ఇలా ఏ సీజన్ పళ్ళు, తినుబండారాలు ఆ సీజన్ లో అమ్మే వాడు. మనం కొంచెం బుద్ది గా బొద్దుగా ముద్దుగా వుండటమే కాకుండా అమ్మా నాన్న వాళ్ళు దదాపు నాకు ప్రతీ రోజు డబ్బులు ఇచ్చే వాళ్ళు సో మనం అతని తినుబండారాలకి రెగ్యులర్ కష్టమర్ కూడా అవడం తో కాస్త ప్రత్యేకమైన అభిమానం చూపించే వాడు.

నేను స్కూల్ వదిలేసాక కూడా ఎప్పుడు రోడ్ మీద కనిపించినా "ఏం ఏణూ బాఉండావా... అమ్మా నాయన వాల్లు అంతా ఎట్టుండారు..." అని ఆత్మీయం గా పలకరించే వాడు. ఈ మధ్య కాలం లో అతనిని చూసి చాలా కాలం అయింది ఎక్కడ ఉన్నాడో మరి.

శుక్రవారం, జులై 18, 2008

నేనూ నా చదువూ...

అలా కాన్వెంట్ భారి నుండి తప్పించుకుని మా బడి లో చేరాక, మొదట్లో కొంచెం మారాం చేసినా తర్వాత్తరవాత అక్కడ ఫ్రెండ్స్ తయారవ్వడం తో బాగానే బడికి వెళ్ళే వాడ్ని. చిన్నప్పుడు అమ్మ నాన్న చదవమని చెప్పే వాళ్ళు కానీ మరీ కూర్చో పెట్టి రుద్దే వారు కాదు. పైగా అప్పటి లో టీవీ లు ఉండేవి కాదు కదా సో రేడియో లు లేదా సినిమాలు ప్రధాన వినోద సాధనాలు. మనకి ఆటల మీద అంత ఇష్టం ఉండేది కాదు కాబట్టి బుద్ది గా ఇంట్ళోనే ఉండేవాడ్ని. మా ఇంట్లో రేడియో ఉన్నా కూడా దానికేసే కళ్ళప్పగించి చూస్తూ కూర్చోవాల్సిన పని లేదు కాబట్టి ఒక పక్కన అది మోగుతున్నా అది వింటూ అమ్మా నాన్న నాతో ఆడుకోడమో, కధలు, కబుర్లు చెప్పడమో... ఆటలతోనే అప్పుడప్పుడూ చదువు ఎంత ముఖ్యమో కూడా చెప్పడమో చేసేవారు. టీవీ వచ్చాక అందరమూ సిరియస్ గా దానికేసి చూడటమే కానీ కనీసం ఒకరికేసి ఒకరం కూడా చూసుకునే వాళ్ళం కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తే. నా అదృష్టం కొద్దీ నేను 10 వ తరగతికి వచ్చే వరకు మా ఇంట్లో టివీ లేదు. ఆ తర్వాత నేను ఇంట్లో లేను :-) (హాస్టల్ లో ఉన్నా అని అర్ధం లెండి).

కాన్వెంటు కి వెళ్ళడానికి పడిన కష్టాలు అంటే గుర్తున్నాయ్ కానీ మా బడి లో మొదటి 2-3 తరగతులు అసలు ఎలా గడిచాయో కూడా గుర్తు లేదు. సరదాగా జరిగి పోయేవి రోజులు నాకు కొంచెం చదవడం వచ్చాక ప్రతి నెల చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాం
టి కధల పుస్తకాలు తెచ్చేవారు. ఇవే కాకుండా విక్రమార్కుడి కధలు, వెర్రి వెంగళప్ప కధలు, బోజరాజు కధలు, లాంటి చిన్న చిన్న పుస్తకాలు కూడా తెచ్చే వాళ్ళు. అప్పట్లో తెలుగు పుస్తకాలు అద్దెకి ఇచ్చే షాపులు ఉండేవి మీకు గుర్తున్నాయా... చందమామ లాంటి పుస్తకాల నుండి పెద్ద పెద్ద నవలలు నేను చెప్పిన బేతాళ కధలు లాంటివి డిటెక్టివ్ పుస్తకాల సైజు లో ఉండే పుస్తకాలు కొన్ని, ఇంక మధుబాబు లాంటి వాళ్ళ పుస్తకాలు కూడా ఉండేవి. నాకు అవి చదవడానికి అనుమతి ఉండేది కాదు లెండి ఏ పుస్తకమైన ముందు అమ్మ అక్కడక్కడా చదివి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ నేను చదవడానికి ఉండేది కాదు. నేను అమ్మని పోరగా పోరగా 7వ తరగతి సెలవుల్లో మల్లాది గారి "నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త" నవల చదవనిచ్చింది. అదే నే చదివిన మొదటి నవల.

నేను హైస్కూల్ కి వచ్చాక చదువు మీద కొంచెం ధ్యాస తగ్గింది కదా అప్పుడు అమ్మ నాకు కంపెనీ ఇచ్చేది తనూ ఏదో ఒక పుస్తకం వీక్లీనో మంత్లీనో లేదంటే ఓ నవలో పట్టుకుని నాతో పాటు తనూ చదువుతూ కుర్చునేది. అమ్మకి ఉన్న ఇంకో అలవాటు తింటూ చదవడం తను ఒకో రోజు అన్నమో ఒకో సారి శలవు రోజుల్లో ఉదయం టిఫిన్ తినేప్పుడు కూడా చదివేది :-) నాన్న అప్పుడప్పుడూ విసుక్కునే వారు ఏవిటా తిండి అని. నేను 9 చదివుతున్నపుడు మా ఇంట్లో ఒక double cot bed ఉండేది అది నా పాలిటి బద్ద శత్రువు నాకు దాని మీద కూర్చుని చదవడం ఇష్టం కానీ అదేం మాయో తెలీదు అప్పుడే ఓ గంట సేపు యోగా చేసి వచ్చినా సరే ఆ మంచం మీద కూర్చుని పుస్తకం తీయగానే వేళ తో సంబంధం లేకుండా పగలు రాత్రి ఉదయం మధ్యాన్నం ఎప్పుడైనా సరే నిద్ర అలా ముంచుకొచ్చేది. దాంతో అమ్మ ఒకో సారి తిట్టి దాని చుట్టు పక్కల ఉండద్దు అని దూరం గా కూర్చో పెట్టి చదివించేది.

అసలు నేను చిన్నప్పుడు చదవడం భలే వింత గా ఉండేది.
ఎప్పుడో మా తాత గారు నన్ను చందమామ కధలు పెద్ద గా చదివి పెట్టమని అడిగినపుడు తప్ప నేను ఎప్పుడూ మనసులో చదువుకునే వాడ్ని. ఇంకా చదువుకునేప్పుడు చాలా చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసే వాడ్ని. గోడ పక్కన కింద పడుకుని కాళ్ళు ఇంచు మించు శీర్షాసనం వేసిన రేంజ్ లో పైకి గోడ మీదకి చాపి గుండెల మీద పుస్తకం పెట్టుకుని చదువుకునే వాడ్ని. ఒకో రోజు మంచం మీద పడుకుని కింద నేల మీద పుస్తకం పెట్టుకుని దాని మీదకి వాలిపోతూ చదివే వాడ్ని. ఇంకో రోజు కింద పడుకుని కాళ్ళు మోకాళ్ళ వరకు మంచం మీద పెట్టుకుని చదివే వాడ్ని. అమ్మ తిడుతూండేది అలా పిచ్చి పిచ్చి వేషాలేస్తే పేగు పడి కడుపు నొప్పి వస్తుంది రా... అని... అయినా మనం వింటే కదా ఓ రోజు నిజం గానే పేగు పడి కడుపు నొప్పి వస్తే అప్పుడు మా స్కూల్ లో ఉండే బజారయ్య వచ్చి ఇటుకరాయి కట్టి పొట్ట మీద రుద్ది ఏదో చేసి తగ్గించాడు. అతని గురించి మనం ఇంకో టపా లో చెప్పుకుందాం లెండి.

అసలు వీటన్నింటి కన్నా అద్భుతమైన అయిడియా అంటే నేను మా ఇంట్లో మధ్య గది లోనో లేకా ఒకో సారి వరండాలోనో పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నం అని ఏమీ ఆలోచించకుండా ఇంట్లో గోడ పక్కన గొడుగు వేసుకుని ఎవరికి కనపడ కుండా ఆ గొడుగు కింద కూర్చుని చదువుకునే వాడ్ని. మొదటి సారి నన్నలా చూసిన మా ఇంట్లో వాళ్ళు కాస్త ఖంగారు పడిన మాట వాస్తవమే కానీ తర్వాత ఎలాగో అలా చదువుతున్నాడు కదా అని వదిలేసారు. సీజనల్ గా అప్పుడప్పుడూ ఇలాంటి పనులు చేస్తుండే వాడ్ననమాట. స్కూల్ ఇంటి పక్కన ఉన్నంత కాలం బాగానే సాగింది కానీ నేను నాలుగు లొ ఉన్నపుడు అనుకుంటా మా ఇంటికి కొంచెం దూరం గా మార్చేసారు. అప్పుడు మళ్ళీ కొంచెం కష్టాలు మొదలయ్యాయ్ కానీ అలవాటైన బడి కావడం తో బాగానే వెళ్ళే వాడ్ని. మన మూడ్ బాలేపోతే అమ్మకి ముప్పై నాలుగు వంకలు పెట్టేవాడ్నిట కట్టుకున్న చీర బాలేదనో పెట్టుకున్న జుట్టు ముడి నచ్చలేదనో....అలా జుట్టు ముడి వేసుకుంటే నన్ను స్కూల్ దగ్గర వదిలి పెట్టడానికి రానిచ్చే వాడ్ని కానంట.

కొన్ని రోజులకి ఫ్రెండ్స్ తో కలిసి నా అంతట నేనే వెళ్ళడం అలవాటు చేసుకున్నా... ఒక్కడ్నే వెళ్ళడానికి కూడా పెద్ద గా భయపడే వాడ్ని కాను కాని మనకి కుక్కలు అంటే భయం ఎక్కువ చిన్నప్పటి నుండీ ఇప్పటికీ పెంపుడు కుక్కలైనా సరే పక్కన ఉంటే కొంచెం ఇబ్బంది పెడుతుంటా
యి. అప్పుడు చిన్నతనం కదా కొంచెం ఖంగారెక్కువ అల్లంత దూరాన కుక్కని చూసి ఇక్కడ పరుగు లంకించుకో బోయి కింద పడి పోయి మోకాళ్ళకి దెబ్బలు తగిలించుకునే వాడ్ని అలా ఎన్ని సార్లు జరిగిందో. ఇంకా ఒకో రోజు దారి వెంట కుక్కలేమీ కనపడక పోతే అప్పుడు రక రకాల ఆటలు గుర్తొచ్చేవి. పైన వేలాడే కరెంట్ తీగ ల నీడలు రోడ్ మీద పడతాయి కదా. ఆ తీగల నీడలనే గాలి లో రెండు కర్రల మధ్య మోళీ వాడు కట్టే తాడు లా ఊహించుకుని... రెండు చేతులు గాల్లో పెట్టి బుజాన సంచి వేలాడేసుకుని రోడ్ మీద ఆ నీడలపై బేలన్స్ చేస్తూ నడిచేవాడ్ని. అలసట తెలీకుండా ఉండటానికి మనం కనిపెట్టిన ఆట అది. కానీ ఓ రోజు మా ఇంటి దగ్గర అలా నడుస్తుంటే మా ఇంటి ఓనరు గారమ్మాయి డాబా మీదనుండి చూసి గాట్టి గా నవ్వింది పైగా అప్పుడే దాన వీర శూర కర్ణ సినిమా చూసి ఉన్నానేమో..." భరింప రాని అవమానము... హా హతవిధీ..!! హా హతవిధీ..!! అనుకుని అప్పటి నుండి ఆ ఆట ఆపేయాల్సొచ్చింది.

మరిన్ని కబుర్లతో మరో రోజు కలుద్దాం. అంత వరకు శలవా మరి...
--వేణు.

బుధవారం, జులై 16, 2008

కాన్వెంట్‌కెళ్దాం..ఛలో..చలో..

అసలు నేను పుట్టటమే ఓ 10 రోజులు ఆలస్యం గా పుట్టానుట. మా డక్టరాంటీ "వీడు లోపల తిష్టేసుకు కూర్చున్నాడు కదిలే లా లేడు.." అని పాపం అమ్మకి ఆపరేషను చేసి నన్ను బయటకి తీసిందిట ఆ కోపం/చిరాకు/ఖంగారు లోనేనేమో ఆవిడ నా కుడి చేతి మణికట్టుకి కొంచెం కింద గాటు పెట్టేసింది. నాతో పాటు పెద్దదవుతూ ఆ మార్క్ ఇప్పుడు కూడా అలానే వుంది.. సో అలా లేట్ అవడం వల్ల బాగా బలహీనం గా వుండటం, తెల్లగా పుట్టాల్సిన వాడ్ని నల్లగా పుట్టడం ఇలాంటివి అన్నీ జరిగాయంటూ ఉంటుంది అమ్మ. నాకు ఒకటిన్నర సంవత్సరం దాటినా కూడా సరిగా నిలబడ లేక పోయే వాడ్నిట. దాంతో మా అబ్బాయి ఇలా ఉంటే లాభం లేదు మా అబ్బాయిని అభినవ ధారా సింగ్ ని చేయాలి అని వ్రతం పూని బలానికి మందులు వాడటం, దొరికిందల్లా తినిపించేయడం మొదలు పెట్టారుట అవన్నీ ఒంటబట్టి ఇప్పుడు గుండులా బాగానే తయారయ్యా అనుకోండీ. కానీ చిన్నప్పుడు నాకు అన్నం తినిపించడం ఒక పెద్ద యజ్ఞంట. మంచి అంచువున్న కంచం లో కొంచెం మెత్త గా వుడికిన అన్నం పప్పూ నెయ్యి వేసి బాగా కలిపి చేతిని అలానే కంచం అంచుకి వేసి గీస్తే గుజ్జు లాగా వస్తుంది, అది నాకు ఇప్పటికీ చాలా ఇష్టం ముద్ద ముద్ద కీ అలా గుజ్జు తీసిమ్మని గొడవ చేసే వాడ్నట. సో అమ్మో లేదంటే పిన్నో నాకు ఎలా అయినా తినిపించాలి అని పాపం చేతులు మంటెత్తే లా అలా గుజ్జు తీసి తినింపించే వారు. నేను తినకుండా అయినా ఉండే వాడ్ని కాని నా అంతట నేను తినే వాడ్ని కాననమాట.సరే ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నా అంటే. మనం తిండి తినడం కోసం అందరినీ ఇలా తిప్పలు పెట్టే టైము లోనే నన్ను బళ్ళో పడేసే టైం వచ్చేసింది. ఆంధ్రా లో కేరళా టీచర్ల ఇంగ్లీష్ కాన్వెంటులు ఇంకా అమ్మగార్ల బళ్ళు అంటే St Anns లాంటివి అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నాయి మా నర్సరావుపేట్ లో కూడా వాటి హవా అప్పుడే మొదలయ్యింది. మా ఇంట్లో కూడా బాగా ఆలోచించి వీడు గొప్పోడైపోవాలి అని St Anns లో పడేసారు అదేమో మా ఇంటికి చాలా దూరం రిక్షా లో వెళ్ళాలి, అన్నం కేరేజి తీసుకు వెళ్ళాలి, మనకేమో బళ్ళో పడే వయసొచ్చినా ఇంకా అన్నం తినడం వచ్చేది కాదు కదా మరి. కానీ కాన్వెంట్లో ఆయా ఉంటుంది తను తినిపిస్తుంది అని చెప్పి ఎలా అయితేనేం నన్ను కాన్వెంటు లో పడేసారు. మీరు నమ్మరేమో కానీ నాకు ఇప్పటికీ అంతా గుర్తుంది ఇంట్లో అందర్ని వదిలేసి సొంతం గా నా కోసం కొన్న ఓ చిన్న పుస్తకాల బేగ్, ఇంకో చిన్న ప్లాస్టిక్ బుట్టలో బుల్లి తెల్ల కేరియరు, మంచినీళ్ళు తీసుకుని ఒక్కడ్నే రిక్షాలో బడికెళ్ళడం. అక్కడ కి వెళ్ళాక లంచ్ బాక్స్ లన్నీ క్లాస్ బయట ఓ చోట పెట్టి వచ్చి కూర్చుని పాఠం వినే వాళ్ళం. పేరుకు కాన్వెంటే కానీ అప్పుడే మొదలవడం వల్ల నేమో బెంచీలు ఉండేవి కాదు నేల మీదే కూర్చునే వాళ్ళం. లంచ్ టైం లో ఆయా కోసం చూస్తే తను నా బుట్ట కూడా తీసి ఇచ్చేది కాదు. మొదటి రోజు ఇలా కాదు అని ఎక్కడుంది అని వెతికితే గేట్ దగ్గర రిక్షా అతనితో మాట్లాడుతూ కనిపించింది వెళ్ళి నాకు అన్నం తినిపించు అని అడిగితే నువ్వే తినాలి అని చెప్పి పంపేసింది. అలానే ఏడుస్తూ ఏదో తినేసి ఇంటికి వెళ్ళాక అమ్మకి కంప్లైంట్ ఇచ్చేసాను. "ఆ ఆయా నాకు అన్నం పెట్టకుండా రిక్షావాడి తో మాట్లాడుతుంది... నాకు ఈ కాన్వెంటు ఏమి నచ్చ లేదు నేను వెళ్ళను..." అని. మా పక్కింటి ఆంటీ "భడవ వేలెడంత లేడు అప్పుడే ఏం మాటలు నేర్చాడమ్మాయ్ !! " అనడం కూడా గుర్తుంది మరి నేనేం చిన్న వాడ్నా చితక వాడ్నా. ఇక ఆ రోజు మొదలు ప్రతి రోజు ఇంట్లో ఓ చిన్న సైజు ప్రపంచ యుద్దం నడిచేది నన్ను స్కూల్ కి పంపించడానికి. నాకు రోజు రోజుకీ కాన్వెంటు మీద దానికి సంబందించిన వాళ్ళందరి మీద ద్వేషం పెరిగిపోతుండేది. నా కాన్వెంటు ఇలా ఉంటే మా ఇంటి పక్కన గోడని ఆనుకుని ఓ వీధి బడి ఉండేది దాని హెడ్మాస్టర్ గారి పేరు నాగేశ్వర్ రావు గారు కనుక ఆ బడి ని కూడా మేం నాగేస్సర్రావ్ మాస్టారి బడి అనే వాళ్ళం కాని అసలు పేరేంటో మర్చిపోయాను. మా ఇంట్లో కిటికీ లో నుండి చూస్తే ఆ బడిలో దదాపు ప్రతి తరగతి లోనూ పిల్లలు ఏం చేస్తున్నారో చక్క గా కనిపించేది. ఆ బడి లో అయితే మధ్య మధ్య లో మంచి నీళ్ళకోసం అని ఇంటికి రావచ్చు, మధ్యాన్నం బోజనం ఇంట్లోనే చేయచ్చు ఇలా బోలెడు అడ్వాంటేజ్ లు కనపడటం మొదలయ్యాయి. దాంతో కాన్వెంటు కి వెళ్ళను అనే నా గొడవ కూడా ఎక్కువైంది, ప్రతి రోజు నా గోల భరించ లేక నాన్న గారికి విసుగు వచ్చి సరే వీడి తల రాత అలా వుంటే ఏం చేస్తాం ఈ వీధి బడి లోనే చేర్చేద్దాం అని ఆఖరికి ఆ కాన్వెంట్ మానిపించేసి, నాన్న దగ్గర ఇంగ్లీష్ బుద్ది గా నేర్చుకోవాలి అని మాట తీసుకుని (మా నాన్న గారికి మంచి గ్రిప్ ఉంది లెండి ఇంగ్లీష్ మీద) నన్ను మా నాగేస్సర్రావ్ గారి తెలుగు మీడియం బడిలో జాయిన్ చేసేసారు. అదనమాట సంగతి...అసలు నన్ను చదివించడానికి, నాకు చదువు మీద శ్రద్ద కలిగించడానికి నానా తిప్పలు పడ్డారు లెండి మా ఇంట్లో ఆ కబుర్లు మళ్ళీ ఇంకో టపా లో చెప్పుకుందాం... శలవా మరి... --వేణు

ఆదివారం, జులై 13, 2008

పరువమా..చిలిపి పరుగు తీయకూ..

ఒకో రోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రోజంతా ఒకే పాట పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. Haunting or something అంటారే అలా అనమాట. మీకూ అలా ఎప్పుడైనా అనిపించిందా....మీరు గమనించి ఉండరేమో కాని ఖచ్చితం గా మీరూ ఫేస్ చేసి ఉంటారు. ఏదో ఒక పాట ఉదయాన్నే రేడియో లో విన్నదో ఎవరన్నా ఇంట్లో వాళ్ళు హమ్ చేసిందో అలా సడన్ గా మనల్ని అంటుకుని రోజంతా అదే పాట గుర్తొస్తుంటుంది. నాకు ఈ రోజు నిద్ర లేవగానే ఎందుకో ఈ పాట గుర్తొచ్చింది రోజు మొత్తం మీద ఒక 10-15 సార్లు హమ్ చేసి ఉంటాను ఇక లాభం లేదు అని బ్లాగ్ లో పెట్టేస్తున్నా.

చిన్నపుడు అప్పుడప్పుడూ ఉదయం పూట రేడియో లో విజయవాడ కేంద్రం వివిధ భారతి కార్యక్రమం లో వేసే వాడీ పాట. చాలా సార్లు విన్నట్లు గుర్తు. మొదటి సారి ఈ పాట విన్నపుడు ప్రారంభం ఆంగ్లం లో ఉండటం తో ఏదో పిచ్చి పాట లే అనుకున్నాను...తర్వాత నవ్వులు విని ఖచ్చితం గా చెత్త పాటే అని నిర్ధారించేసుకున్నాను. ఆ తర్వాత ఇళయరాజా గారు మెల్లగా పాట లోకి తీసుకు వెళ్తారు...జాగింగ్ చేసే అడుగుల చప్పుడు తో అద్భుతం గా ట్యున్ చేసి పాట అయిపోయే సరికి శభాష్..!! అనిపించేసుకుంటారు. ఈ పాట వీడియో దొరకలేదు కానీ ఎవరో నాలాంటి అభిమాని పాటని presentation కి జత చేసి you tube లో పెట్టాడు. నేను అదే ఇక్కడ ఇస్తున్నా. ఇది ప్లే అవ్వక పోతే ఇక్కడ (మూడవ సెట్ లో 15వ పాట) వినండి .





చిత్రం : మౌనగీతం
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలూ, జానకి

Hello !
Hi.
Good morning !
Good morning.
How do you do?
Fine. Thank you.
How about joining me?
Ok, with pleasure.

పరువమా .. చిలిపి పరుగు తీయకూ..
పరువమా .. చిలిపి పరుగు తీయకూ..

పరుగులో .. పంతాలు పోవకూ..
పరుగులో .. పంతాలు పోవకూ..

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ..

ఏ ప్రేమ కోసమో .. చూసే చూపులూ..
ఏ కౌగిలింతకో .. చాచే చేతులూ..
తీగలై .. హో .. చిరు పూవులై పూయ..
గాలిలో .. హో .. రాగాలుగా మ్రోగా..

నీ గుండె వేగాలు తాళం వేయా !

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ..

ఏ గువ్వ గూటిలో .. స్వర్గం ఉన్నదో..
ఏ చెట్టు నీడలో .. సౌఖ్యం ఉన్నదో..
వెతికితే .. హో .. నీ మనసులో లేదా
దొరికితే .. హా .. జత కలుపుకో రాదా

అందాక అందాన్ని ఆపేదెవరూ !!

పరువమా ..
చిలిపి పరుగు తీయకూ...

శనివారం, జులై 12, 2008

వీరయ్య మాష్టారు...

నేను నరసరావుపేట వదిలి పిడుగురాళ్ళ లో 7 వ తరగతి జాయిన్ అయ్యాక మన చదువుకి గ్రహణం పట్టడం మొదలైంది కానీ అంతకు ముందు అంటే ప్రైమరీ స్కూల్ లో ఉండగా 6 వ తరగతి వరకూ నేను క్లాస్ లో అందరికన్నా చిన్న వాడ్ని చదువులో కాస్త చురుకైన వాడ్ని. మా వీధి బడి లో చాలా మంది మాష్టర్లకి నేను ప్రియ శిష్యుడ్ని. నేను మొదటి తరగతి నుండీ అదే బడిలో చదువుకునే వాడ్ని. మా బడి, మొదట్లో అంటే నేను ఒకటో తరగతి చదివేప్పుడు మా ఇంటి పక్కనే ఉండేది. అసలు నేను ఈ బళ్ళో పడటం వెనక ఓ చిన్న పిట్ట కధ ఉంది అది రేపు చెప్పుకుందాం లెండి...

నేను ఐదో తరగతి చివర్లో ఉన్నపుడనుకుంటా మా వీరయ్య మాష్టరు గారు మా స్కూల్ లో జాయిన్ అయ్యారు. 6 వ తరగతి వాళ్ళకి హిందీ చెప్పేవారు, నల్లని వొంటి రంగు... తెల్లని పంచే లాల్చి.. జేబులో ఎప్పుడూ ఓ చిన్ని అడ్రస్ ల పుస్తకం ఓ పెన్ను (ఈ జేబులో పెన్ను అలవాటు నేను ఈన దగ్గర నేర్చుకుని ఇంకా వదల లేదు ఇప్పటికీ నా జేబులో పెన్ను ఖచ్చితం గా ఉండాల్సిందే !! ) వీటన్నిటికీ తోడు మొహాన ఎప్పుడూ చెరగని చిరు నవ్వు... పక్కనే ఓ సైకిలు... అచ్చమైన బడి పంతులు గెటప్ లో ఉండే వారు. ఆయన ఒంటి రంగు వల్లనేమో మొహాన నవ్వు.. వేసుకునే బట్టలు చాలా ప్రత్యేకం గా తెలిసేవి...

ఎలాంటి వారైనా ఆయన్ని చూడగానే చేతులెత్తి నమస్కరించాల్సిందే అలా ఎప్పుడూ ప్రశాంతం గా ఉండేవారు ఆయన. మా మాష్టారు అంటే మాకందరికీ చాలా ఇష్టం, చాలా అరుదు గా ఎవర్నైనా కోప్పడేవారు ఆయనకి కోపం తెప్పించేంత పని చేసాడంటే వాడికి ఇంకో మాష్టరు చేతిలో ఐతే బడితె పూజే కానీ ఈయన గట్టి గా మందలించి వదిలేసే వారు. టీవీ లు వాటిలో దక్షిణ భారతం మొత్తానికి హిందీ నేర్పించిన రామాయణ్ మహాభారత్ లాంటి సీరియళ్ళు రాక ముందే నాకు కాస్త హిందీ వచ్చిందీ, దాని మీద ఆసక్తి కలిగింది అంటే అది ఆయన చలవే... మా మాష్టారు గారు పాఠం చెబుతుంటే ఎవరో ఒకరిద్దరు తప్ప క్లాస్ అంతా చాలా నిశ్శబ్ధం గా ఆసక్తి గా వినేవాళ్ళం.

శాయమ్మ టీచరు గారని ఒకావిడ ఉండే వారు, ఆవిడకి నేనంటే బోలెడు ఇష్టం అప్పుడప్పుడూ నా చేత పాటలు పాడించే వారు. ఓ సారి మంచి వర్షం పడుతున్న టైము లో నన్ను పాడ మంటే "గాలి వాన లో వాన నీటిలో పడవ ప్రయాణం...." అని పాడేసాను, అది ఆవిడకి తెగ నచ్చేసి అందరూ మెచ్చుకున్నారు కూడా దాంతో మనం సింగర్ గా సెటిల్ అయిపోయాం. అదేంటో నాకు ఆ వయసు నుండే విషాద గీతాలు ఇష్టం పైగా అవే బాగా పాడేవాడ్ని. ఇంజనీరింగ్ కి వచ్చాక కూడా పాటల పోటీ లో పాడరా అంటే "ఆస్తులు అంతస్తులు" సినిమా లో ఏసుదాసు గారు పాడిన "మిడిసి పడే దీపాలివి... మిన్నెగసి పడే కెరటాలివి..." అని ఓ అత్యంత విషాద గీతం ఎత్తుకున్నాను దాంతో మా క్లాస్ అమ్మాయిలు వీడేదో పేద్ద..భగ్నప్రేమికుడు లా ఉన్నాడు అని అనుకున్నారట, కొన్నాళ్ళయ్యాక నన్ను అడిగి అలాంటిదేమీ లేదని నిర్ధారించుకున్నార్లెండి.

సరే నేను ఆరో తరగతి కి వచ్చాక హిందీ మాష్టారు చెప్పింది చెప్పినట్లు టపీ మని పట్టేసే వాడ్ని దాంతో నేను మా వీరయ్య మాష్టారు గారికి కూడా ప్రియ శిష్యుడ్ని అయిపోయా. ఆయన క్లాస్ లోనే అందరితో చెప్పేవారు వీడు నా ప్రియ శిష్యుడు రా అని :-) మిగతా వాళ్ళు కూడా నన్ను రిఫర్ చేయాలంటే అంతే చెప్పేవారు ఓ రోజు "మీ ప్రియ శిష్యుడు పాటలు బాగా పాడతాడండీ.." అని ఎవరో చెప్పారు. తను నా చేత ఓ రెండు పాటలు పాడించుకుని విని నీకు ఈ పాటలు కాదు రా మంచి పాటలు నేర్పుతాను అని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళి మరీ ఈ కింది రెండు పాటలు నేర్పించారు. అప్పటి నుండీ ఈ పాటలు ఎప్పుడు విన్నా మా మష్టారే గుర్తొస్తారు.

"జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి...."
"దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హొగయీ భగవాన్...కిత్‌నా బదల్ గయా ఇన్సాన్..."

ఈ రెండు పాటలు అప్పట్లో ఉదయం పూట అప్పుడప్పుడూ రేడియో లో వచ్చేవి తర్వాత "జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి...." పాటని రాక్షసుడు సినిమాలో మీరంతా వినే ఉంటారు కదా. ఈ రెండు పాటలతో పాటు వాళ్ళ ఇంట్లో తిన్న "మినప సున్నుండలూ... జంతికల రుచి కూడా ఎప్పటికీ మర్చి పోలేను :-)

నేను సాధారణం గా బళ్ళో ఆటలు పెద్ద గా ఆడే వాడ్ని కాదు అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ బలవంతం మీద కళ్ళద్దాలు ఎవరికైనా పట్టుకొమ్మని ఇచ్చి కబడీ ఆడేవాడ్ని. నేను చిన్నప్పుడు ఏం చేసినా కాస్త ప్రొఫెషనల్ గా చేయడానికి ప్రయత్నించే వాడ్ని లేండి అందుకే మా వాళ్ళంతా ఆకతాయిగా ఆడుతుంటే నేను పెద్ద పోటుగాడి లా చాలా పెద్ద ఆటగాడి లెవెల్ లో గొంతు గంభీరం గా మార్చేసి కబడి... కబడి... అని కూత పెడుతూ చాలా సీరియస్ గా ఆడే వాడ్ని. దాంతో మా వీరయ్య మాష్టారు ఎక్కడ వున్నా మా పిల్లల్లో ఎవడో ఒకడు వేళ్ళి "మాష్టారు మీ ప్రియ శిష్యుడు కబడీ ఆడుతున్నాడు రండి.." అని పిలుచుకు వచ్చే వారు. ఆయన కూడా కాదనకుండా వచ్చి చూస్తూ "భలే ఆడుతున్నావ్ రా..ఏ పని చేసినా అలా శ్రద్ద గా చేయాలి...." అని అంటూ ఎంకరేజ్ చేసే వారు.

ఆయన ప్రోద్బలం తోనే నేను పిడుగురాళ్ళ లో హిందీ ప్రాధమిక, మాధ్యమిక పరీక్షలు కూడా వ్రాసి సర్టిఫికేట్ సంపాదించాను కానీ ఆ తర్వాత మళ్ళీ ఊరు మారడం తో నా హిందీ చదువు అంతటితో ఆగిపోయింది. నేను పిడుగురాళ్ళ నుండి మళ్ళీ నరసరావుపేట వచ్చాక కాలేజి కోసం హాస్టల్ లో చేరేవరకూ ఊళ్ళో అప్పుడప్పుడూ కనపడి పలకరించే వాడ్ని కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని కలవడం కుదర్లేదు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. నిన్న ప్రఫుల్ల చంద్ర గారి तूतॊ ’మరీ’ है టపా లో హిందీ గురించి చూసిన దగ్గర నుండీ మళ్ళీ ఆయన జ్ఞాపకాలు పదే పదే వెంటాడుతుంటే కాస్త ఐనా ఊరట పొందుదాం అని ఇదిగో ఈ టపా వ్రాసేసాను.

శుక్రవారం, జులై 11, 2008

మా బేబీ ఖాన్ కబుర్లు...

:-) నేను చెప్ప బోయేది నా ఇంజినీరింగ్ క్లాస్ మేట్ బేబీ గురించి. వాడ్ని బేబీ అనీ ఖాన్ అనీ ఎవడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పిలచే వాళ్ళు. వాడికి ఆ నిక్ నేం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో గుర్తు లేదు, చూడటానికి కొంచెం సినీ హీరో శ్రీకాంత్ లా ఉంటాడు (అంటే బూతద్దం పట్టుకుని వెతికితే కాసిన్ని పోలికలు కనబడతాయ్ లెండి) కాస్త పొట్టిగా బుజ్జి గా ఉంటాడు అందుకే ఆ పేరు వచ్చిందనుకుంటా. మనిషి చాలా మంచోడు సరదాగా అందరితో కలిసిపోయి ఎవరికన్నా హెల్ప్ కావాలి అంటే అందరికన్నా ముందు ఉంటాడు. కాకపోతే ప్రతీ గుంపు లోను ఒకడు బకరా కావాల్సిందే కదా మా వాడు ఆ కేటగరీ అనమాట అదీ కాక వాడు చేసే పనులు కూడా అంతే ఉంటాయ్...

అంటే బేబీ కి ముందు పేరుంటుంది కానీ అది కూడా చెప్పేస్తే "ఏంటి మావా!! నన్నిలా అన్‌పాపులర్ చేస్తున్నావ్" అంటాడు అని చెప్పకుండా వదిలేస్తున్నా.. మా వాడు అప్పట్లోనే అంటే మాకెవరికీ ఐశ్వర్యా రాయ్ గురించి పెద్దగా తెలీక ముందే తన పోస్టర్ తెచ్చి రూం లో అంటించుకున్న కళాపోషకుడు కూడా. వాడికి ఓ పాత స్కూటర్ ఉండేది మా ఫ్రెండ్స్ లో అది డ్రైవ్ చేయని వాడు ఉండే వాడు కాదు డ్రైవింగ్ వచ్చినవాడు రాని వాడు అని లేకుండా అందరూ ట్రయల్స్ వేసే వాళ్ళు. ఇక దీని పై ట్రిపుల్స్ (ముగ్గరమూ భారీ కాయులమే) వెళ్తుంటే చూడాలి...పాపం అది బ్రతుకు జీవుడా అనుకుంటూ అష్ట కష్టాలు పడుతూ వెళ్తుండేది...

సాధారణం గా వైజాగ్ సిరిపురం జంక్షను లో ఎప్పుడూ పోలీసులు ఉండే వారు. సో ముగ్గురిలో ఒకళ్ళు ముందే దిగి నడుచుకుంటు వెళ్ళి జంక్షను దాటాక మళ్ళీ ఎక్కే వాళ్ళం. పోలీసు మమ్మల్నిలా గమనించాడేమో ఓ రోజు మాకు పోలీస్ ఎవరూ కనిపించ లేదు ఆహా!! పదరా మామ ఎవరూ లేరు అనుకుని వెళ్తుంటే పక్క నుండి సడన్ గా ఊడి పడ్డాడు... మా వాడు వదుల్తాడా నేనేనా తక్కువ తింది అని బండి ని ముప్పైనాలుగు వంకర్లు తిప్పి ఇంచు మించు మమ్మల్ని పడేసినంత పని చేసి ఎలా అయితేనేం ఫైన్ భారి నుండి తప్పించాడు.

మా వాడికి పాటలు అంటే కూడా చాలా ఇష్టం కాకపోతే పాట సాహిత్యానికీ స్వరానికీ మధ్య లంకె గుర్తు పెట్టుకోడం కాస్త కష్టం. దాంతో శంకరాభరణం పాటని ప్రేమికుడు లో "ముక్కాబ్‌లా... స్టైల్ లోనూ ఈ పాటని దేవదాసు లోని "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..." స్టైల్ లోనూ పాడుతుండే వాడు. ఓ సారి ఏదో కాంపిటీటివ్ పరీక్ష వ్రాయడానికి అందరూ ట్రైన్ లో హైదరాబాద్ ప్రయాణమయ్యారు. మరి యూత్ ట్రైన్ ఎక్కితే ఏదో ఒకటి చెయ్యాలి కదా అప్పట్లో అంత్యాక్షరి ఇంకా ఫ్రెష్ గా ఉన్న ఆటలలో ఒకటి సో అందరు అంత్యాక్షరి ఆడుతుంటే "గ" అనే అక్షరం వచ్చింది. మా వాడికి ఉన్నట్లుండి ఏమైందో ఒక్క సారి "మామా నేను పాడతా..." అని మొదలెట్టాడు... "గొహ్...దా...రీగ...ట్టుందీ...." అని ఏదో పాడాడు... అంతే ఓ పది సెకన్లు భయంకరమైన నిశ్శబ్దం...వాడి పదాలు అర్ధం చేసుకోడానికి అంత టైమ్ పట్టిందనమాట.

ఒకటి రెండు పదాలు పాడాడు (మా మీద దయతో సాధారణం గా వాడు అంతకన్నా పాడడు లెండి...) వాడి పాటలో కొన్ని పదాలు అర్ధమయ్యాయి కాని ఎవ్వరికీ ఆ పాట అసలు ట్యూన్ గుర్తు రాలేదు అంతగా పక్కన ఉన్న వాళ్ళ మెదళ్ళు కరప్ట్ అయిపోయాయి... మాఫ్రెండ్స్ అందరికీ వాడి షాక్ లు అలవాటే కదా...సో ఇదేదొ పాత పాట చాలా బావుంటుంది అని సరైన ట్యూన్ కోసం నింపాదిగా కుస్తీ పడుతున్నారు....కానీ అప్పటి వరకు పక్కనే కూర్చుని అంత్యాక్షరి ఎంజాయ్ చేస్తున్న ఓ నడివయసు పెద్దాయన అవస్థ చూడాలీ...మాటల్లో వర్ణించ లేం ఆయన పాపం నెత్తీ నోరు కొట్టుకుంటూ "సార్ ఈ పాట నాకు చాలా ఇష్టమైంది సార్.... అసలు నేను ఈ పాట ట్యూన్ మర్చి పోడమేంటి సార్... అయ్యో!! చాలా మంచి పాట సార్... గుర్తు రావడం లేదు సార్... అని నానా హైరానా పడ్డారు...కాసేపు శాంతించండి అదే వస్తుంది ఇది మాకలవాటే అని ఎవరెంత చెప్పినా పాట దొరికే వరకు ఊరుకో లేదు.

మీరంతా మా వాడి పాట వినే అదృష్టనికి నోచుకోక, నే రాసింది చదువుతున్నారు కాబట్టి ఈ పాటికే మీకు పాట ఏంటి అనేది అర్ధం అయి ఉంటుంది, ఒక వేళ అర్ధం కాకపోతే అది మూగ మనసులు సినిమా లోని "గోదారి గట్టుందీ.... గట్టుమీదా చెట్టుందీ.." అనే పాట అనమాట.

ఇంకా మా బేబీ చాలా పెద్ద manipulator, గుర్తున్న నాలుగు పదాలని ఏదో ఓ పాట ట్యూన్ లో ఇరికించి పాడేసినట్లే మతలబులు చేయడం లో ముందుంటాడు. మేమంతా ఇంజనీరింగ్ 3 వ సంవత్సరం లో industrial tour పేరుతో దేశాటనకి వెళ్ళినప్పుడు ట్రైన్ లో రిజర్వేషన్ ప్రాబ్లం వస్తే మావాడే ఎలాగో TC ని మేనేజ్ చేసి ఏదో రకం గా కనీసం ఓ నాలుగైదు బెర్త్ లైనా సంపాదించేవాడు. ఎలా చేసావ్ మావా అంటే ఏముంది మామా ఎవరికీ కనపడకుండా TC చేతిలో వందో యాభయ్యో పెట్టేయడమే అనే వాడు.

ఓ సారి నార్త్ ఇండియా లో ఏదో ఊర్లో ట్రైన్ బాగా రష్ గా వుంది మా టిక్కెట్స్ కన్‌ఫర్మ్ అవ లేదు, రిజర్వేషన్ బోగీ లో కూడా జనరల్ కంపార్ట్‌మెంట్ లాగా నిండుగా ఉన్నారు జనం... మా వాడు ఇంకో ఇద్దరం TC వెనకాల తిరిగి మిగిలిన ఫ్రెండ్స్ అందరం ఉన్న చోటికి వచ్చాం మన వాడు మంచి manipulation మూడ్ లో ఉన్నాడు చూస్తే నేమో బెర్త్ నిండా హిందీ జనం... వాళ్ళతో హిందీ లోనే మాట్లాడాలి మన వాడి హిందీ అంతంత మాత్రం...దాంతో బెర్త్ కి ఒక అంచున కూర్చోడానికి సిద్ద పడుతూ... "జర జరుగూ భాయ్..." అన్నాడు మేమంతా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూసుకుని నవ్వుకుంటుంటే ఓ క్షణమాగాక వాడూ మాతో శృతి కలిపి "ఏమంటే ఏంటి పని జరిగిందా లేదా ఇదే మరి manage చేయడమంటే.." అన్నాడు. వాడి body language అర్ధం చేసుకుని వాళ్ళు చోటిచ్చార్లెండి అదీ వాడి బడాయి.

అప్పుడు నవ్వుకున్నాం గాని నేను మొదటి సారి హైదరాబాద్ వచ్చాక ఒక లోకలైట్ తో ఇది చెప్తే "అబే చల్.. దీన్‌కీ జోక్ అంటార్‌ బే పాగల్!!..." అని ఒకళ్ళంటే "మాక్కి..కిరికిరి... దీన్ల జోకేడుందివయా... సక్కంగనే మాట్లాడిండు గదా మీ పోరగాడు...." అని ఇంకోళ్ళన్నారు... ఔ మల్ల!! అని గమ్మున ఉండి పోయా...

సోమవారం, జులై 07, 2008

సొగసు చూడ తరమా !..

ఇది గుణశేఖర్ రెండవ సినిమా అనుకుంటా, తన మొదటి సినిమా లాఠీ లో వయొలెన్స్ ఎక్కువ ఉంటుంది అది హిట్ కాకపోయినా కొన్ని సీన్స్ చాలా బావుంటాయ్. ఇతను రెండో సినిమా పూర్తి వ్యతిరేకం గా చాలా సాఫ్ట్ సబ్జెక్ట్ తీసుకుని భార్యా భర్తల మధ్య రిలేషన్ ని చక్కగా చూపిస్తాడు. ఇందులో ఆర్ట్ వర్క్ వైవిధ్యం గా బావుంటుంది, ఈ సినిమా లోని ప్రింటెడ్ చీరలు సొగసు చూడ తరమా చీరలు గా కొంత కాలం బాగానే హవా కొనసాగించాయనుకుంటా... ఇంద్రజ characterization and presentation సినిమా కే హైలెట్.

నేను ఇంజనీరింగ్ చదివే రోజులలో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్స్ పరం గా హిట్ అవునో కాదో గుర్తు లేదు కాని అప్పటి యువత హృదయాలలో మాత్రం బాగానే చోటు సంపాదించుకుంది. ఈ సినిమా లో కొన్ని పాటలు ప్రత్యేకించి ఈ పాట సిరివెన్నెల గారి సాహిత్యానికి అందమైన సంగీతం తోడై వినడానికి చాలా బావుంటుంది one of my all time favorites. ఈ పాట మరియూ సాహిత్యం మీ కోసం. ఈ పాట వినడానికి కింద play button click చేయండి లేదా ఈ సినిమాలో పాటలు అన్నీ వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Listen to Sogasu Choodatarama Audio Songs at MusicMazaa.com

చిత్రం : సొగసు చూడ తరమా
సంగీతం : రమణి ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కె.జే.యేసుదాస్

సొగసు చూడ తరమా !..
సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !..

హే..హె.... హే..హే..హె...
కులుకే సుప్రభాతాలై.. కునుకే స్వప్న గీతాలై..
ఉషా కిరణమూ... నిషా తరుణమూ...
కలిసె కలికి మేనిగా రతి కాంతుని కొలువుగా,
వెలసే చెలి చిన్నెలలో....

సొగసు చూడ తరమా !!

పలుకా చైత్ర రాగాలే, అలకా గ్రీష్మ తాపాలె,
మదే.. కరిగితే... అదే.. మధుఝరీ...
చురుకు వరద గౌతమీ... చెలిమి శరత్ పౌర్ణమీ,
అతివే.. అన్ని ఋతువు లయ్యే....

సొగసు చూడ తరమా.. నీ సొగసు చూడ తరమా..
మరుని నారి, నారి గ మారి.. మదిని నాటు విరిశరమా...
||సొగసు చూడ||
సొగసు చూడ తరమా !...

ఆదివారం, జులై 06, 2008

పైనాపిల్

నిన్న మా వైష్ణవి పేల్చిన ఇంకో మంచి జోక్ గురించి చెప్పడం మర్చిపోయానండీ... here it is

వైషు: అమ్మా టేబుల్ పైన అదేంటి ..?

అమ్మ: ఓ అదా...అదీ..పైనాపిల్ (pineapple) రా...

వైషు: అవునా...(ఓ నిముషం అలా వెళ్ళివచ్చి)

వైషు: "అమ్మా నాకు పైనాపిల్ కావాలి ఇంకా కిందాపిల్ కూడా కావాలి..."

అమ్మ: !!!!...:-)

పైనాపిల్ ని పైన ఆపిల్ గా విడగొట్టేయడమే కాకుండా దానికి కింద ఆపిల్ అని కౌంటరు కూడా వేసేసిన మా వైషు తెలివికి అవాక్కవడం తప్ప మేమేం చేయగలం చెప్పండి.

-- మీ వేణు

శనివారం, జులై 05, 2008

బుడుగులు..బుడిగీలు..పిడుగులు..

నాకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. ఛా! ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు బాబూ అని అంటారా... నిజమే లెండి ఏదో విక్రమార్కుడు సినిమా లో అత్తిలి సత్తిబాబు లాంటి వాళ్ళకి తప్ప మనలో చాలా మందికి పిల్లలు అంటే ఇష్టమే ఉంటుంది. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టమే కానీ పెంపకం లో ఉండే చాకిరి, పెంకి పిల్లలు చేసే అల్లరి ఒకోసారి భరించడం కష్టమేమో అనిపిస్తుంది. కాని ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు చూపించే ప్రేమ చూడగానే అన్నీ ఒక్క క్షణం లో మర్చిపోతాం. ఉదాహరణకి మధ్యాహ్నమో లేక ఉదయాన్నో నిద్ర లేచిన వెంటనే సగం మత్తు తో అలా మన దగ్గరికి వచ్చి మెడని కావలించుకుని బుజం మీద పడుకోడమో... లేదూ ఆటల మధ్య లో మనం వాళ్ళకి బాగ నచ్చే పని చేసినప్పుడు గబుక్కున బుగ్గ మీద ఒక ముద్దు పెట్టడమో చేయగానే ఆహా దీని కోసం ఎన్ని కష్టాలైనా పడచ్చు అనిపిస్తుంది.

ఒకో సారి వీళ్ళు చేసే అల్లరి కూడా భలే ముద్దొస్తుంది. ఒక బ్రహ్మచారి గా నాకు ఈ ప్రేమని పొందే అవకాశం దొరికింది ఇప్పటి వరకూ తక్కువే కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళబ్బాయి ప్రణవ్ ఇలా ప్రేమ ని చూపించడం లో ముందుంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు పండగే... వీడు చాలా షార్ప్ అండ్ తనకి ఉన్న ఇంకో మంచి లక్షణం ఏంటంటే అప్పుడప్పుడూ భలే ఝలక్ లు ఇస్తుంటాడు, ఈ కాలం పిల్లలు అందరూ ఇంతే ఉన్నారేమో లెండి... సరే ఇంతకీ విషయం ఏంటంటె,

ఓ రోజు బయటకి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు...
ప్రణవ్ వాళ్ళ అమ్మ వాడికి పెద్ద అక్షరాల తో "చాంపియన్" అని ప్రింట్ చేసి ఉన్న T Shirt వేసి రెడీ చేసింది.అది చూసి వాడి నాన్న "వావ్ ప్రణవ్ ఏంటీ నువ్వు చాంపియన్ వా" అని అడిగాడు
దానికి మా ప్రణవ్ జవాబు...."కాదు నాన్నా నేను ఇండియన్ ని" :-)
వాడి జవాబు కి పక్కన ఉన్న వాళ్ళే అవాక్కయితే పాపం వాళ్ళ నాన్న పరిస్తితి ఆలోచించండి.

వీడికి వైషు అని ఒక చెల్లి ఉంది తనకి 2 యేళ్ళు ఉంటాయ్ తను ఇంకా చాలా స్మార్ట్ జోల్ట్ లు ఇస్తుంది. ఎలాగంటే...వీళ్ళు నలుగురూ కలిసి స్టూడియో లో ఒక ఫోటో దిగారు దాన్లో అందరూ మంచి హార్టీ స్మైల్ తో ఉంటే మా వైషు మాత్రం కొంచెం సీరియస్ గా చూస్తూంటుంది. మొన్న ఒక రోజు అందరూ ఆ ఫోటో చూస్తుంటే...ప్రణవ్ "ఇందులో మనం అందరం నవ్వుతున్నాం వైషు నవ్వట్లేదు" అని కామెంట్ చేసాడు. దానికి వైషు వెంటనే "ఏం కాదు నేను కూడా నవ్వుతున్నాను కదా అమ్మా" అని వాళ్ళ అమ్మ సపోర్ట్ అడిగింది. వాళ్ళ అమ్మ "ఎక్కడ మరి నువ్వు నవ్వడం లేదు కదా" అని పాపం తను కూడా ప్రణవ్ వైపే మాట్లాడింది... దాంతో ప్రణవ్ రెచ్చిపోయి అవును మరి నువ్వు నవ్వడం లేదుకదా...? ఎక్కడ నవ్వుతున్నావ్ ?? కనిపిస్తుందా..అసలు... అని అడిగాడు...
దానికి వెంటనే మా వైషు "లేదన్నా నేను.. లోపల్నుంచి నవ్వుతున్నాను !!..." అని చెప్పింది..:-)
విన్న వాళ్ళెవరికి సౌండ్ లేదని వేరే చెప్పక్కర్లేదనుకుంటా :-) ఇంత చిన్న పిల్లకి ఈ అవిడియాలు ఎక్కడనుండి వస్తాయ్ రా బాబు అనుకున్నాం...వీళ్ళిలా అప్పుడప్పుడూ అవాక్కయ్యేలా చేస్తుంటారనమాట.

వీళ్ళిద్దరూ ఇలా ఉంటే న్యూజెర్సీ లో ఉన్న ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ప్రచేత్ అని పుట్టి 3 నెలలు అవుతుందనుకుంటాను సాయంత్రాలు అలా బయట తిప్పక పోతే అరిచి గొడవ చేస్తూ ఉంటాడుట బయటకి తీసుకు వస్తే అప్పుడు సైలెంట్ గా అవీ ఇవీ చూస్తూ ఉంటాడుట. ఇంకా అప్పుడే సొంతం గా బోర్లా పడటమే కాకుండా పాకడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్ప్తే నేను హాశ్చర్య పడిపోయేసాను. అంతే కాదు "ఎదగడానికెందుకు రా" పాట కూడా గుర్తొచ్చింది :-) ఈ పాట లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇప్పటి తరానికి కూడా సరిపోతుందేమో కదా... ఈ మధ్య పాట పోస్ట్ చేసి చాలా రోజులు అవుతుంది ఇది పోస్ట్ చేద్దాం అని చూస్తే ఇది ఆర్కుట్ తెలుగు సాంగ్ లిరిక్స్ కమ్యూనిటి లో ఇప్పటికే ఉంది. అక్కడ పోస్ట్ చేసిన Venu గారికి థాంక్స్ చెప్తూ... ఇక్కడ ఆ పాట....

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Andala+Ramudu.html?e">Listen to Andala Ramudu Audio Songs at MusicMazaa.com</a></p>

చిత్రం: అందాలరాముడు (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: రామకృష్ణ

ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా..ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారూ
జో జో..జో జో ! జో జో..జో జో !!

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా||2||
జో జో..జో జో.. జో జో..జో జో !

ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలీ
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలీ
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుపడితె..ఫెయిల్ ఐతే బిక్కమొగం వెయ్యాలి

కాలేజి సీట్లు అగచాట్లురా..అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తైతే మొదలవ్వును పాట్లురా..అందుకే..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో !

ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలీ
అడ్డమైనవాళ్ళకీ గుడ్మార్ణింగ్ కొట్టాలీ
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్వూ అంటూ క్యూ అంటూ పొద్దంతా నిలవాలి

పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా..మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావీ నీకెపుడూ దోస్తురా..అందుకే..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో !

B.A ను చదివి చిన్న బంట్రోతు పనికెళితే..
M.A.లు అచట ముందు సిద్దము..నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో..
పదినెల్ల దాక జీతమివ్వరూ..నువ్వు బతికావో చచ్చేవో చూడరు

ఈ సంఘం లో ఎదగడమే దండగా..మంచికాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగ !...అందాకా..

ఎదగడానికెందుకురా తొందరా..ఎదర బతుకంతా చిందర వందరా
జో జో..జో జో..టాటా..టాటా.. టాటా..టాటా !

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.